ప్రభువు పలికిన మాటలన్నిటిని చేయాలనిన సంకల్పము ఒక బలమైన లక్షణము. అది ప్రభువు మాటలను ఆలికించి, వాటిని హత్తుకొనుటకు ధైర్యము నిచ్చును. దాని గలవాడు దానినుండి దూరమగుటకు భయపడును. దానివలన జీవమును కాపుదలయు ఉండునని వాడెరుగును. దీనికి రుజువు వానికై ప్రభువు చేయు కార్యములు. ఆయన ఆలోచనలు, మార్గములు నిజముగానే ఆశ్చర్యమైనవని వాడు చూచెను; వాటి ద్వారా వాడు బహు సంతోషమును, ఫలమును పొందెను. ఆయనవలన వాడు అనేక అనుభవములు పొందెను గనుక, ఆయనయెడల గౌరవమును తన హృదయములో ఏర్పరచుకొనెను. అట్టి గౌరవముకు కట్టుబడిన యెడల వాడు కదలక యుండునని, భయపడక, నశించిపోకుండునని ఎరిగెను. ఆ సంకల్పము ఇదివరకు ఉన్నదే మరియు దానిని అవలంబించుటవలన కేవలము మేలు జరుగును. “మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు – యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తరమిచ్చిరి“ (నిర్గ. 24:3).
యెహోవా మాటలన్నిటిని చేయుటకు ఒక విశ్వాసి తన్నుతాను ఆయనకు సమర్పించుకొను స్థితికి వచ్చినపుడు, ఆయనను నిర్లక్ష్యము చేయరాదనిన నిర్ణయము చేసియుండెను. కాబట్టి, మన నిర్ణయము ఏమైయున్నది? మనము చేయు నిర్ణయము దేవుడు మనలను నడిపించ దలచిన మార్గమును నిర్దేశించును; అది మనకొరకైన ఆయన ఆలోచనలను నిర్ణయించును. మన విధి నిర్దేశించబడును. అది మనకు పూర్తిగా అవగాహన కానప్పటికీ, ప్రభువు దానిని ఆలోచన చేసెను గనుక దానిని పూర్ణముగా జరిగించును. అది జీవితములో మనము ఎదుర్కొను వివిధ పరిస్థితులను బట్టి, సమయములను బట్టి బయలుపడును; ఆశీర్వదింపబడితిమని తెలిసికొందుము. మోషే పలికిన మాటలు వినిన ఇశ్రాయేలు సరైన నిర్ణయము చేసిరి. ప్రభువు కనికరమును చూచినవారై ప్రత్యామ్నాయమును వారు వెదకలేదు. మన జీవితములో ప్రభువు పని విధానములే ఆ నిర్ణయమును చేయుటకు సహాయపడును. మరియు అది మొదటిగా ఆయన వాక్యమును నమ్ముటతో ప్రారంభమగును. వివేకముతో ఆలోచన చేసినపుడు జీవితములో మనము చేయువన్నియు విశ్వాసమువలననే అని తెలిసికొందుము. కాబట్టి, వాక్యమును వినుట సాధారణముగానే విశ్వాసమును కలిగియుండవలెను. అప్పుడు, ఆయన మాటలన్నిటికి మనలను మనము సమర్పించుకొనుటకు ఆయన కనికరమును అనుభవించెదము.
మన సమర్పణకు కట్టుబడి యుందుమా అనునది వేరే సంగతి. దానికి కట్టుబడనియెడల, మన ప్రాచీన స్వభావమునకు వెళ్లిపోతిమి; విశ్వాసము ఎన్నడును బలమైన అంశము కాకపోయెను. వెనుకకు పోవుటకు కారణము ప్రభువు కార్యములను మానివేయుట కాదు గాని, ఆయన కనికరమును తేలికగా ఎంచితిమి. అప్పుడు, ఆయన మనకొరకు పనిచేయుట మానును. ఇశ్రాయేలు వారు చేసిన నిర్ణయమును విడిచిపెట్టిరి; సమర్పణను విడిచిరి. ఇది ఎవరిలోనైనను సంభవించుట సాధ్యమే. నానావిధములైన శరీరాలోచనలు, భావములు మనలను ఏలుచున్నయెడల, ప్రభువు మనకు చేసినవాటన్నిటి విషయమై కఠినులౌదుము. కాని, మనము చేసిన నిర్ణయముకు కట్టుబడినయెడల ఏమగును? దేవుని అన్యోన్యత బయలుపడును. ఆయన చేయువాటికిని, మనలను నడిపించు ఎత్తైన స్థలములకును అంతముండదు. సమర్పణలో కొనసాగుట చేత దానినుండి వెనుదిరుగు భయమును కలిగియుండము; వెనుదిరుగుట అనునది ఉనికి లేని పదార్ధమై యుండును.
యెహోవా మాటలన్నిటికి సమర్పించుకొనుటకు బహుమానమున్నది. “యెహోవా ప్రమాణము చేసి వారి పితరుల కిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయుల కప్పగించెను. వారు దాని స్వాధీనపరచుకొని దానిలో నివసించిరి” (యెహో. 21:43). ఇశ్రాయేలు సమర్పణను బట్టి వారికొరకైన దేవుని వాగ్దానముల యొక్క నెరవేర్పును చూచిరి. ఆయన పట్ల తిరుగబాటు చేసి, పాపము చేసిన అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులు దాని చూడకపోయిరి. వారు నిర్ణయమును నోటితో పలికిరి గాని, హృదయములో కఠినత్వముతోను ఉదాసీనతతోను ఉండిరి. దేవుడు వారికొరకు ఆలోచన చేయని దానిని వారు ఆశించిరి. ఆయనతో సంబంధమును ఆటంకపరచు వాటిని వారు కోరుకొనిరి. సమర్పణను కలిగిన ఇశ్రాయేలుకు వాగ్దానము దయచేసి, దానిని నెరవేర్చినవాడు మనమాయనకు చేసిన సమర్పణకై మనకు కూడ వాగ్దానములు చేసి, వాటిని నెరవేర్చును.
ప్రభువు మాటలన్నిటిని గైకొందుమని ప్రమాణము చేయుట కేవలము మనకు మేలు చేయును. దానిని ఒక్కసారి విశ్వాసము ద్వారా మన హృదయముతో చేసినపుడు, దాని నెరవేర్చుటకు ఆయన సహాయము చేయును. కాని, ఒకవేళ, ఎవడైనను దానిని నెరవేర్చుటలో ఒక కాలమున విఫలమైనచో ఏమగును, లేక ఆత్మలో ఒకడు దాని విషయమైన అయోగ్యుడైనచో ఏమగును? దానికొరకు కూడ ప్రభువు ఆలోచన కలిగియున్నాడు. తన యొద్దకు మనలను ఎలా రప్పించుకోవలెనో ఆయనకు తెలియును. “యూదారాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి – నావలన తప్పు వచ్చినది; నా యొద్దనుండి తిరిగి నీవు వెళ్లిపోయినయెడల నామీద నీవు మోపినదానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అష్షూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు ఆరు వందల మణుగుల వెండియు అరువది మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను“ (2 రాజు. 18:14). దేవుడు హిజ్కియాకును ఇశ్రాయేలుకును మేలు చేసెను. వారి పాపముకు ఫలితము నిచ్చుట ద్వారా వారికి వివేకమును కలుగజేసెను. ప్రభువు హెచ్చరికలకు హిజ్కియా వెంటనే స్పందినచనప్పటికీ, పరిణామములను ఎదుర్కొనినపుడు వారి పాపమును గుర్తించెను. విశ్వాసము ద్వారా తాను ప్రభువుకు చేసిన సమర్పణను జ్ఞాపకము చేయు హృదయమును అతడు కలిగియుండెను. ఈ హృదయము అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులు కలిగియుండలేదు.
అయితే, మన సమర్పణను కొనసాగించు విషయమై ఈ సూత్రమును గైకొనినచో ఆలస్యము చేసి, మన వైఫల్యము యొక్క ఫలితమును పొంద నవసరము ఉండదు. “బుద్ధిహీనునికి నూరుదెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును“ (సామె. 17:10). పాపము యొక్క పరిణామములు మనపై రప్పించక మునుపే ప్రభువైన దేవుడు మనలను గద్దించును. మన హృదయములు ఆయన హెచ్చరికలకు స్పందించనపుడు పాపములకు పరిణామములు కలుగును. అవి మనలను కుదిపివేయు బలమైన శక్తియై పాపమువలన నష్టపోయిన వివేకమును తిరిగ రప్పించును. గద్దింపును గ్రహించి తన సమర్పణకు తిరిగి వచ్చువాడు పరిణామములను పొందడు. మనమింకను వివేకముతో నుండగా ప్రభువునుండి గద్దింపు వచ్చును. తన వివేకమును ఉపయోగించనివాడు దాని నిర్లక్ష్యము చేయును. కాబట్టి, వివేకము గలవానికి గద్దింపుమాట లోతుగా నాటుకొనును. తన జ్ఞానమును ఉపయోగించి, ఉద్దేశపూర్వకముగా ఆ గద్దింపును తన హృదయములోనికి చొచ్చుకెళ్ళునట్లు చేసి, పాపము యొక్క పరిణామములను తప్పించుకొనును. మరియు దేవుడు ఈలాగు చెప్పెను – “మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమునుండి మరలి నీతి న్యాయములను జరిగించినయెడల తన ప్రాణమును రక్షించుకొనును“ (యెహె. 18:27).
ప్రభువు మాటలన్నిటిని చేయుటకు కారణమైన మన సమర్పణ రెండింటిని ప్రతిబింబించును – నీతి మరియు న్యాయము. దానికి రెండు ఆశ్చర్యమైన లాభము లున్నవి.
- క్రీస్తును పూర్ణముగా ఎరుగుదుము. “అయితే యేసు వారియొద్దకు వచ్చి – పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది“ (మత్త. 28:18). మనమాయన అధికారము నుండి పొందుదుము. అన్ని విషయములలో మనము ముందుకు సాగుటకు ఆయన అధికారమే కారణమని తెలిసికొందుము. మన మార్గమును మనుషులైనను, పరిస్థితులైనను, ఆటంకపరచకుండ లేక ఆటంకపరచినపుడు సరాళమగునట్లు ఆయన నియంత్రించును. మన భారములు తేలికగునట్లు ప్రతి విషయముకై ఆయనపై ఆధారపడుటకు అలవాటు పడుదుము.
- అద్భుతమైన వరమును పొందెదము. ఇందు నిమిత్తమే యేసు శరీరమందు ప్రత్యక్షమై, సిలువపై మరణించి, సమాధిని గెలిచెను. “ఎనిమిది దినములైన తరువాత లోపల ఉన్నప్పుడు తోమా వారితోకూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచి – మీకు సమాధానము కలుగును గాక అనెను” (యోహా. 20:26). సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము జీవితములో మనకు ధైర్యమిచ్చును. ఆయన మాటలను గైకొనుచుండగా, సమస్త భయముల నుండియు, కలవరములు మరియు ఊహల నుండియు క్షేమముగా ఉండుటకు ఆయన తన సమాధానమును మనలోనికి పంపును. మనకు అగపడు వాటన్నిటిని అర్ధము చేసికొనలేనప్పటికీ, ఆయన సమాధానము మనలను నిబ్బరముగా నిలుపును. ఆయన మనలను సంరక్షించునని ఎరుగుదుము. దేవుని సమాధానముతో పోల్చుటకు ఈ భూమిపై ఏదియు లేదు; ఏదియు దానివంటి ప్రభావమును దయచేయదు.