దేవుని శక్తిని నీవెట్లు అంచనావేయుదవు? దేవుని శక్తిని ఆలోచన చేసినపుడు ఆయన గూర్చి ఏమనుకొందువు? ఆయన శక్తిని నీవు ఏవిధముగానైన పొందితివా? దానిపై ఆధారపడువానికి అది ఏమైయుండును లేక అది ఏమి చేయును? లేక, నీకు దానిగూర్చి అవగాహన లేకుండెనా? విశవసించువానిగా నీవీ ప్రశ్నలకు జవాబు చెప్పగలవు. ప్రస్తుతము నీవు జవాబు చెప్పలేనియెడల రాబోవు దినములలో జవాబు చెప్పుటకు నిన్ను నీవు సిద్ధపరచుకొనవలెను. ఏలయనగా దేవుని శక్తి నమ్మువానికి మరుగై యుండక, అమితముగా దొరకును. మనమెంత అధికముగా మనకున్న ఆటంకములను, బలహీనతలను మరియు మితమైన జ్ఞానముకు చెందిన ఆలోచనలను గుర్తించి, వాటిని విడిచిపెట్టుదుమో అంత అధికముగా ఆయన శక్తిపై ఆధారపడుదుము. విశ్వసించు వాడెవడును ఆయన శక్తినిగూర్చి వాజ్యమాడడని తెలిసినందున ఆయన శక్తి ఆశ్చర్యమైనదని చెప్పుట అనావశ్యకముగా ఉండును. కాని, అది మనయెడలను మనయందును పనిచేయనియెడల ఆ మాట ఆలోచించవలసినదై యుండును. నేను మరల చెప్పుదును – ఆయన శక్తి ఆశ్చర్యమైనది. దాని అగోచరత ఈ వాక్యమునుండి గోచరమగును. “దేవుడు – వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను” (ఆది. 1:3).
దేవుడు అలాగు ఏలాగు చేసెను? మానవుల జ్ఞానమంతయు ఉండినను, ఆయన శక్తిని అర్ధముచేసికొనగలవాడు ఒక్కడైనను లేడు; మరియు, దానిని అనుకరించు వాడైనను, అనుకరించుదైనను లేదు. దాని పని తీరును వివరించు వారెవరును లేరు. బహుశా, ఇట్టి అగోచరతవలననే అది అనేకులకు చోద్యముగాను, కల్పితముగాను ఉండును. కాని, ఇది నిజమేనా? వెలుగు కమ్మని ఆయన ఆజ్ఞాపించినపుడు దానికి సాక్ష్యమిచ్చునట్లు ఎవడును ఉండియుండలేదు!
ఆయన శక్తి ఆశ్చర్యమైనదని, అది మానవుల జ్ఞానముకు మించినదని చెప్పుటకు రెండు లేక మూడు విధానములు కలవు. మొదటిగా, మన స్వంత మార్గములలో పోవుచునే “దేవుడు చెప్పెను గనుక” అని చెప్పుట. రెండు, ఆయన శక్తినుండి పొందవలెనని విశేషముగా కల్పితములను చేయువారి విధాన ఫలితములలో మునిగిపోవుట. ఈ రెండు మనకు ఎంతమాత్రమును మేలుచేయనప్పటికీ, సంఘముగా కూడుకొనువారి ఎదుట అవి మనలను నిరపరాధులుగా చూపించును. అవి మనము ఒక గుంపుకు చెందినవారమని తెలియజేయును. సంఘముగా కూడుకొను అనేకులు ఈ రెండింటిలో ఒకదానిని గాని, రెండింటిని గాని కలిగియుండుటతో తృప్తిపడుదురు. మరియు, వారి సంతోషము, సమాధానము, నెమ్మది స్వల్పకాలమునకును, బాహ్యముగాను, విలువలేనివిగాను ఉండును. కావున, ఆయన శక్తి విషయమై వారు నటించువారిగానే జీవింతురు. అయితే, మూడవ విధానమున్నది. అది మనలోను మన ద్వారాను తన శక్తిని జరిగించుటకు దేవునికి అవకాశమిచ్చుట. చూడుము, ఈ విధానము మన అదీనమందుండదు. అది దేవుడు ఆశించినది మరియు మనము దానిని అంగీకరించితిమి. అది ఆయన ఇష్టానుసారముగా మనతో వ్యవహరించుటకు ఆయనకు మనలను అప్పగించుకొనుటను కోరును. ఈలాగు జరిగినపుడే ఆయన శక్తి మనకు తెలియును. అప్పుడు, నిజముగా ఆయన శక్తిని గూర్చి “దేవుడు చెప్పెను గనుక” అని చెప్పుటతోపాటు దానిగూర్చిన కల్పిత విధానమువలనైన ఫలితమును తప్పించుకొనినవారమై దానికి మనమే ప్రభావఫలితముగా నుందుము.
వెలుగు కమ్మని దేవుడు చెప్పినపుడు, ఆయన రాబోవునది ఏదో కచ్చితముగా ఎరిగినవాడై, తన ఉద్దేశముకు అది ఏవిధముగా సరిపోవునో ఎరిగినవాడునై యుండెను. ఈ దినమువరకు ఆయన శక్తి యొక్క కార్యము ఆయనకు వైఫల్యము నియ్యలేదు. ఇది మనకు ఏమి చెప్పుచుండెను? మొదటిగా, ఆయనను నమ్ముట చోద్యము కాదు. తరువాత, ఉపయోగకరమైన పరిణామమును కలిగించుటకై ఆయన శక్తి నిత్యము మనయెడల పనిచేయును. చూడుము, ఆయన శక్తి దేనినైనను మార్చును, సృజించును మరియు తీసివేయును. దానికొరకు మననుండి ఏవిధమైన కళానైపుణ్యతైనను అవసరములేదు గాని, సంపూర్ణ విధేయతయు భక్తియు కావలెను. మన బ్రతుకులోను మరియు మనకు ప్రియులైనవారి బ్రతుకులోను కార్యములు జరుగవలెనని ఆశించినచో ఆయన శక్తిపై మనము ఆధారపడవలెను. ఒకసారి ఒక జనాంగము ఆలాగు చేసిరి మరియు దేవుడు ఉత్తరమిచ్చెను. “అప్పుడు యెహోవా – వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పిగించుచున్నాను, వారిలో ఎవడును నీ యెదుట నిలువడని యెహోషువతో సెలవియ్యగా” (యెహో. 10:8). ఈ మాటలను హృదయములో చేర్చుకొనుము మరియు జయము నిచ్చిన ఆ సమయమును విశ్వాసము ద్వారా నీవు రుచిచూచెదవు. ఆయన శక్తి ఆశ్చర్యమైనదని నీవు చూచెదవు. ఒక్కసారి దేవుడు అభయమిచ్చిన పిమ్మట ఆయన చెప్పినది జరుగునట్లు తన శక్తితో సాధించును. మనము సంతోషమును సమాధానమును నెమ్మదిని పొందు నిమిత్తము అది నానాసమయములలో నానావిధములుగా పనిచేయును. ఇశ్రాయేలు తన నైపుణ్యమునుబట్టి జయము పొందలేదు గాని, దేవుడు తన ధైర్యమును వారికిచ్చుటవలనను మరియు శత్రువు మీద ఆయన గొప్ప వడగండ్లను పడవేయుటతోను, యెహోషువ ప్రార్ధనను ఆలకించి సూర్యచంద్రులను నిలుపుటవలనను జయము పొందిరి. కొన్నిమార్లు మనమెన్నడును చూడని వాటిని, బహుశా మరెన్నడును చూడనివాటిని దేవుడు మనకొరకు చేయును. వాటికై మనకు మనసున్నదా?
దావీదుకు ఆ మనసుండెను. ఏ సంఘటనలు ఎప్పుడు చోటుచేసికొనునో అతడు ముందుగా చూచి ఏర్పరచుకొనలేదు గాని, దేవుడు తన శక్తియందు వాటిని జరిగించునని ఎరిగియుండెను. కావున, ఆయనకు సేవచేయు రాజుగా అతడు ఏలెను. “ఈ ఆరుగురు హెబ్రోనులో అతనికి పుట్టిరి, అచ్చట అతడు ఏడు సంవత్సరముల ఆరునెలలు ఏలెను, యెరూషలేములో ముప్పది మూడు సంవత్సరములు ఏలెను” (1 దిన. 3:4,5). అతడు ఏలిన దినములలో ఒడిదుడుకులు ఉండినను, దేవుడు నియమించిన సంవత్సరములను ఘనతతో ముగించెను. దేవుడు తన శక్తితో సంపూర్ణ ఫలితమును దయచేయవలెనని ఆయన ఎదుట బలహీనునిగా ఉండుటకు అతడు ఎంచుకొనెను. అతడు వేరొకవిధాముగా చేసియుండవచ్చును గాని, జీవితములో నానావిధములైన కార్యములు చేయుటకు తాను సమర్ధుడను కానని తెలిసికొనునట్లుగా దేవునియెడల అతని విధేయత, భక్తి నిలిచెను. కాబట్టి, ఆయనపై అతడు ఈలాగు ఆధారపడెను. “యెహోవా, నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి, నీ శరణుజొచ్చియున్నాను నా ప్రాణము ధారపోయకుము” (కీర్త. 141:8).
దేవుని ఆశ్రయించినయెడల మనయెడల ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయన శక్తి మనకొరకు పనిచేయునని పూర్ణ నమ్మికతో ఉందుము; ఏమగునో తెలియకయే అది పనిచేయునని నిరీక్షించెదము. మూడు అంశములను చూచి వాటిలో దేనికైనను సరిపోవుదమా లేక దేనికిని సరిపోకపోవుదమా చూచెదము.
- ఆయన ఉగ్రత మార్గమందు నిలుచుట. “యెహోవా రోషముగలవాడై ప్రతికారము చేయువాడు, యెహోవా ప్రతికారము చేయును; ఆయన మహోగ్రతగలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారిమీద కోపముంచుకొనును“ (నహూ. 1:2). దేవుని సత్యముకు మార్గములకు విరోధముగా పనిచేయువాడు ఆయన శత్రువు. వాడు జీవితమును మితమైన జ్ఞానముతో కొనసాగించుచు ఆయన అమితమైన శక్తియెడల లక్ష్యము లేకుండును; వాని పాపము తీసివేయబడలేదు. వాడాయనను గాని, ఆయనను పూజించువారిని గాని, గౌరవించడు. ఆయన జనులు తనకు సేవచేయకుండునట్లు వారికి ఆటంకములు కలుగజేయును. వారి జీవిత విధానమును గేలి చేసి ప్రశ్నించును.
- అవిశ్వాసముకు ఆతిధ్యమిచ్చుట. “ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను” (మార్కు. 6:5, 6). దేవుడు తన శక్తిని ఒక వ్యక్తియెడల నిలిపివేయుటకు కారణము అవిశ్వాసము. దేవుడు ఉన్నాడని నమ్మి, ఆ నమ్మకమును సరిగా కలిగియుండనివాడు అవిశ్వాసముతో ఉండును. దేవునిగూర్చి వాడు బహు తక్కువగా ఎరిగెను. దేవుని మరియు ఆయన సర్వశక్తిత్వమును ఒప్పుకొనుటకు ఇష్టుడై యుండును గాని, తన జీవితము ఆయనకు అప్పగించు విషయమై ఆయనయందు నమ్మిక యుంచడు. దేవునిపై పూర్ణముగా ఆధారపడకుండ ఆయన తనకు గొప్పవాటిని చేయవలెనని ఆశించును. వాడు అంతరంగమందు శరీర అవకాశములకై వెదకు వారివంటివాడు.
- అన్యాయముగా మాటలాడుట. యేసు ఈలాగు పలికెను. “మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగల వానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడు చున్నారేమి?“ (యోహా. 7:23). యూదులు యేసు పట్ల అన్యాయముగా ప్రవర్తించిరి. ఒకడు దేవుడు సర్వశక్తిమంతుడని చెప్పి, ఆయన చేయు క్రియలను కొలిచి మాటలాడుట అసాధ్యము. అన్యాయముతో నుండుట సత్యముకు అతీతముగా జీవించుట. ఇది దేవునికి మహిమ నియ్యక, ఆయనను మనుష్యుల ఎదుట అవమానపరచును. ఇది ఆయన ప్రగాఢ శక్తిని చూడునట్లు ఒకనికి అవకాశమియ్యదు.
పై అంశములతో మనకు సంబంధము లేనియెడల, దేవుని శక్తిని పొందువారమగుటకు ఇతరమైన ఏ ఆటంకములు మనకు లేవు. మన జీవితము ఆయన శక్తివలన ముందుకు సాగిపోవును.