దేవుని ఆలకించుడి

దేవుని ఆలకించుట ఒక అపూర్వమైన లక్షణము. వాక్యములోనుండి ఆయన ఉపదేశించు వాటన్నిటియెడల శ్రద్ధ చూపుట ద్వారా మనలను ఆయనకు లోబరచుకొనుటతోపాటు విధేయత యొక్క ఫలమును కోయుటకు బాట వేసికొందుము. అన్ని విషయములలో తనను ఆలకించినపుడు దేవుడు ఉత్సహించును. దీని ముఖ్య ఫలితము ఆయన చిత్తమునకు, ఆలోచనకు మరియు జ్ఞానముకు కట్టుబడియుందుము. రాబోవునది మనకు తెలియనప్పటికీ, ఒక మంచి ఫలవంతమైన పరిణామమును గూర్చి నిశ్చయత కలిగియుందుము. తనను ఆలకించవలెనని దేవుడు ఆశించుటలో నున్న ముఖ్య ఉద్దేశము మనము మన జీవిత పరిస్థితులన్నిటి ద్వారా ఆయనను మహిమపరచి, ఆశీర్వదింపబడినవారమై సురక్షితముగా నిలుచుట. అసలు ఆయనను ఆలకించునపుడు ఏమగును? దీనికి సమాధానము ఈ వాక్యములో ఉన్నది. అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలును కట్టడలును మీ పితరుల విషయములో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగిమన ప్రవర్తననుబట్టియు క్రియలనుబట్టియు యెహోవా మనకు చేయదలచిన ప్రకారముగా ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి (జెక. 1:6). 

“నెరవేరలేదా” అనిన పదముకు ‘పనిచేయలేదా’ అని అర్ధము. ఆనాటి ఇశ్రాయేలు పితరుల యొద్దకు వాక్యము వచ్చినపుడు వారు వినిరి. అది వారిని వెలిగించెను. అది ఏలాగు పనిచేసెననగా, వారు తిరిగి (అనగా, మారుమనస్సు పొంది) సమస్తముకంటె ఎక్కువగా దేవుని యెంచిరి. దేవుని ఉపదేశము అగుపడిన వెంటనే మనయెడలైన ఆయన చిత్తమును గురించి నమ్మిక కలిగించుటకు అది బహు శక్తివంతమైనది. దేని విషయమైతే నమ్మిక పొందుచున్నామో దానిని నిరాకరించుట కఠినత్వము. కఠినత్వమును కొన్ని విధములుగా వర్ణింపవచ్చును గాని, దాని ప్రధాన గుణము ప్రత్యక్షపరచబడిన సత్యమును అంగీకరించుటకు అయిష్టమును వ్యక్తపరచుట. ఆ పితరులు దేవుని ఆలకించినపుడు కఠినత్వముకు చోటియ్యలేదు; కఠినత్వము పట్ల వారు కఠినముగా ఉండిరి. కావున, వాక్యము వారియెడల నెరవేరెను; అనగా, దేవుడు వారియెడల ఆశించుచున్నదాని విషయమై వారు ఒప్పింపబడునట్లు అది వారి హృదయములలో పనిచేసెను.

పైనున్న పరిశుద్ధ వాక్యము ఇతరమైనవాటి విషయములకు కూడ వర్తించును. దేవుడు నిన్ను ఒక ప్రత్యకమైన పనికై పిలుచుచున్నాడని ఒకమారు తలంచెదము. దానికై వాక్యములోనుండి ఆయన నీకు ఉపదేశించును. నీవు ఆలకించినపుడు ఆయన పట్ల విధేయతనుబట్టి నీయెడల ఆయన చేయ నుద్దేశించినదాని విషయమై నీకు నమ్మిక కలుగునట్లు వాక్యము నీలో పనిచేయును. నీ విధేయతకు ఫలముండునని గ్రహింతువు. వాస్తవముగా, ఆయన ప్రత్యకమైన పిలుపును వినుటవలననే నీ అవసరములు, ఆశలు నెరవేరును. ఆయనను సేవించుటకు నీ మార్గము సుస్థిరము చేయబడెను! ఒక ప్రత్యకమైన పనికొరకు మాత్రమే ఆయన నీకు ఉపదేశింపక, నీవు ఎంచవలసిన సరైన దిశను లేక కచ్చితమైన మార్గమును కూడ ఉపదేశించును. దీనిని జీవితమునకు సంబంధించి చిన్న మరియు సామాన్య విషయములయందు సహితము ఆయన చేయును. కొన్నిమార్లు ఆయన ఉపదేశము కనిపెట్టుమని సెలవిచ్చును. ఇవన్నియు ఆయన చేయుటకు కారణము ఆయన ఉపదేశించు సమస్తమును ఆలకించుటకు నిన్ను నీవు ఆయనకు లోబరచుకొనుటయే. కాబట్టి, ప్రార్ధించునపుడు మరియు వాక్యమును ధ్యానించునపుడు వినుటకు చెవిగలవారమై యుండుట బహు ముఖ్యము.

ఒక్కసారి దేవుని ఉపదేశము మనలో పనిచేయగా, మార్పు అనివార్యము. అది మనలో జరుగవలసిన మార్పైనను లేక మనకొరకు జరుగవలసిన మార్పైనను, నిశ్చయముగా జరుగును. ఆయన వాక్యము తరచుగా మనలో పనిచేయునపుడు మరిఎక్కువ ధైర్యవంతులము, ఆశీర్వదింపబడినవారము మరియు స్వతంత్రులము అగుదుము. మన భావావేశములనుబట్టి ఆయన మనకు ఉపదేశము చేయును. ఇందువలన, ఒక విషయమును గూర్చి రోగకారియైన భావములు మనలో ఉన్నయెడల ఆయన వాటిని అర్ధముచేసికొనును. వాటినుండి మనలను విడిపించదలచును. మానవులు తరచుగా వారిని అర్ధము చేసికొనువారు కరువైరని బాధపడుదురు. వారు కేవలము మహోన్నతుడైన దేవుని ఎరిగినయెడల ఎంత బాగుగా ఉండును! అయితే, మనకు ఆయన తెలియును; ఆయన మన క్షేమము కొరకును తన మహిమ కొరకును మనకు ఉపదేశించును. మరల, జీవితములో అధిక భారములవలన మనకు భావావేశములు కలిగినపుడు, ఆయన తన వాక్యమును మనతో మాటలాడి ధైర్యపరచును. మరియు, అవి సంతోషమువలనైతే దీవించుటకై ఆయన ఇంకను మనకు ఉపదేశించును.

మనకు అవసరమైనది ఏది ఉన్నను, దేవుని వాక్యము దానికై మనలో పనిచేయునని ఇప్పుడు మనకు తెలియవచ్చెను. అంటే, అది మనకొరకు పనిచేయును. అందుకాయన – ఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయిననదని ఆమెతో చెప్పెను (మార్కు. 7:29). సురోఫెనికయ వంశమందు పుట్టిన స్త్రీ క్రీస్తు మాటలు విను చెవిని కలిగియుండెను. ఆమె ఆయనను దేవుని కుమారునిగా గ్రహించెను. అవసరములో ఉన్నప్పుడు ఆమె ఆశించినదల్లా ఆమె కుమార్తెను గురించి ఆయన మాట. దేవుని యొక్క మంచి కార్యముకై విశ్వాసముతో ఆమె ఆయనను ఒప్పించెను. యేసు ఆమెతో మాటలాడగా, అది జరిగెను. అధిక భారములవలనైన ఆమె భావావేశములను ఆయన అర్ధముచేసికొనెను. ఆమె కుమార్తె దివ్యముగా మారెను. ఉపశమనము మరియు సంతోషము అనునవి దేవుని ఉపదేశమువలనైన పరిణామములు.

ఇప్పుడున్న ప్రశ్న ఏమనగా, దేవుని వాక్యము మనలో నెరవేరవలెనని ఎంత తీవ్రముగా ఆశపడుచున్నామనునదే. సంఘ కార్యక్రమములకు హాజరై, సరైన మార్గమున ఉన్నామని తలంచువారుందురు. ఇంక, నానావిధములైన మంచి కార్యములు చేసి, దేవునికి మేలు చేయుచున్నామని తలంచువారూ ఉందురు. విపర్యయముగా, దేవుడు తమకు కేవలము ఉపదేశించవలెనని ఆశించువారు ఉందురు. మన జీవిత సంగతులన్నిటిలో ఆయన ఉపదేశమును ఆశించువారమైతే మన సంతోషము సంపూర్ణము చేయబడును. ఇది యేసు మాటలలోనుండి స్పష్టమగుచున్నది. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి – ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను” (యోహా. 7:37). పితరులకు దేవుడు చేసినది, యేసు శరీరమందు ప్రజలకు చేసినదంతయు యేసు మనకు కూడ చేయుటకు సిద్ధముగా ఉండెను. ఆయన ఆత్మలో వాటిని చేయును. ఆయన చెప్పినట్టుగా మన కడుపులోనుండి జీవజలనదులు పారునట్లుగా చేయును. కాబట్టి, దేవుని ఉపదేశము ఆయన మనకొరకు ఉద్దేశించిన దానికై మనలో పనిచేయును. మన అవసరములు, ఆశలు సహితము తీర్చబడును.

కావున, దేవుని ఉపదేశము కొరకు ఎల్లప్పుడు ఆశగలవారమై యుందము. ఒకవేళ ఆ ఆశ ఆర్పివేయబడినచో, పరిణామము ఈలాగుండును.

1. దేవునినుండి కలుగు అనేకమైన గొప్పవాటిని కోల్పోవుదుము. మనము దేవుని పిల్లలమైనను, ఆయన ఉపదేశమునకు చెవిని మూసివేసినందున అనేకమైన మంచివాటిని కోల్పోవుదుము; ఆయన ఉత్సాహమునకు మనము అచేతనముగా ఉంటిమి. ఒకప్పుడు ఆయన రక్షణ విషయమై అచేతనముగా ఉండిన జనులుండిరి. కావున, సంతోషమును ధన్యతను స్వేచ్ఛను ఇచ్చు ఆయన ఉపదేశమును వారు నష్టపోయిరి. వారితో పౌలు ఇట్లనెను. కాబట్టి దేవునివలననైన యీ రక్షణ అన్యజనులయొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురు గాక, వారు దాని విందురు (అపొ. 28:28).

2. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను మరిచెదము. అనగా, దేవుని సూత్రములను తేలికగా ఎంచుదుము. అప్పుడు, మనుష్యులపై దేవుని కొరకు ప్రభావమును చూపము మరియు దేవుని కొరకు న్యాయమును పలుకు స్థితిలో ఉండకపోవుదుము. మనము మరల తిరుగునట్లు మనలను శిక్షించుటకై, మరియు కొన్నిమార్లు కఠినముగా శిక్షించుటకై, దేవుడు ప్రమాణములను చేపట్టును. మరియు పౌలు ఈలాగు చెప్పెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా – నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?” (గల. 2:14).

3. నిరీక్షించుటలో బలహీనులౌదుము. దేవునినుండి కలిగిన నిత్యజీవ వాగ్దానమును మన జీవితము ప్రతిబింబించదు; ఏలయనగా శరీరములో జీవించుచున్న వారివలె ప్రవర్తించెదము. బహు త్వరగా దానిని అనావశ్యముగా కనుపరచెదము. ఇంకను, దేవుడు మనతో మాటలాడినవాటన్నిటి విషయమై నిరీక్షణ కలిగియుండవలెననిన ఆలోచన మనకు దూరమగును. కాని, దేవుని ఉపదేశము కొరకు శాశ్వతమైన ఆసక్తితో పౌలు ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాదికాలమందే వాగ్దానము చేసెను (తీతు. 1:2) అనిన దానియందు బొత్తిగా స్థిరముగా ఉండెను.

4. బహు చెడ్డది సంభవించును. లోకుల హృదయమును ఏలు పాపము మనలను ఏలుట ప్రారంభించును. అది మనలను ప్రేరేపించి, మనలను ఏలునట్లు అనుమతింతుము. మరల లోకముతోను, దాని అలవాట్లతోను ఏకమౌదుము. మరియు, పరిణామములకై మన క్రియలన్నియు దేవునిచేత గమనించబడును. మరియు ఆ దూత నాతో ఈలాగు చెప్పెను – ఆ వేశ్య కూర్చున్నచోట నీవు చూచిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆ యా భాషలు మాటలాడువారిని సూచించును” (ప్రక. 17:15).

Posted in Telugu Library.