దేవుని విచారించుట

దేవునితో మన సంబంధము ఆయనయందు మన ధైర్యమును నమ్మికను నిర్ధారణ చేయును. దానియందున్న ప్రమాణమును గ్రహించనయెడల మనకొరకు ఆయన తరచుగా పనిచేయుట చూడనివారమై నిరుత్సాహముతో నుందుము. దేవుడు నిత్యము మనకొరకు పనిచేయ నాశించును మరియు అది మనము ఊహించు దానికంటె ఎక్కువ మార్గములలో ఉండును. ఆయన ఆశకు మన ప్రత్యుత్తరము సమస్త మార్పునకు కారణమగును. ఆయనయందు ధైర్యమును నమ్మికను కనుపరచినయెడల మన జీవితము ఆయనపై ఆధారపడుట నిశ్చయము. ఇది రెండింటికి కారణమగును. మొదటిగా, మనమాయన మార్గమునుండి తొలగిపోము. తరువాత, విశ్వాస వైఫల్యములను తప్పించుకొందుము. ఈ రెండూ మనలను లోకముపైన నిలువబెట్టును. వాటివలన దేవుని జనులు లోకమును మరియు జీవితము వారిముందుంచిన వాటన్నిటిపై జయము పొందిరి. వారి చిట్కా ఆయనయందు ధైర్యమును నమ్మికను కనుపరచుటయే. దీనిని ఆయనతో నున్న సంబంధమునుబట్టి జరిగించిరి. సమస్తము వారికి విరుద్ధముగా ఉన్నప్పుడు వారింకను దేవునిపై దృష్టిపెట్టుటకు బలమును కనుగొనిరి. ప్రవక్త ఈలాగు చెప్పెను. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్ధన నాలకించును(మీకా. 7:7). 

దేవుడు మనకిచ్చిన తన మాటను నెరవేర్చుటకు దినములు, నెలలు మరియు కొన్నిమార్లు సంవత్సరములు పట్టును. అయినను, ఆయనకై మనము వేచియుండవలెను. దీనికి కారణములున్నవి. ఒకటి ఆయనతో బలమైన సంబంధమును కట్టుకొనుట. దీనికొరకు మనలను నాశనము చేయదలచిన వాటినుండియు అవమానపరచదలచిన వాటినుండియు కాపాడుచునే అనేకవాటిని ఆయన మనకు నేర్పించును. ఇంకను, నానావిధములైన పరిస్థితులను ఆయన మనకు అనుకూలముగా చేయువరకు కనిపెట్టవలసి యున్నాము. తుదకు మనము పొందుదుము. ఎందుకనగా, ఆయన మన మనవిని ఆలకించును. అబ్రాహాము, యాకోబు, యోసేపు మరియు దావీదు వంటివారు ఆయన కొరకు కనిపెట్టిరి. ఇంకను, రోమాకు పంపుదునని ఆయన తన కిచ్చిన మాట నెరవేరువరకు చెరసాలలో పౌలు రెండు సంవత్సరములు గడుపవలసి వచ్చెను. అయినను, వీరందరికి ఒక్క విషయము తెలిసియుండెను. ఆయన జరిగించువాడు, వినువాడు, దయచేయువాడు. కనిపెట్టుటయందు వారు గడిపిన సమయము వ్యర్ధము కాలేదు. వారాయనతో అమూల్యమైన సంబంధమును సంపాదించిరి; ఆయనలో యెదిగిరి. లోకమునకు వారాయన మాదిరైరి.

అనేకమార్లు పరిస్థితులు మనలను ఇబ్బంది పెట్టుచునపుడు లేదా జీవితము నిస్సత్తువుగా అగుపడినపుడు నిరాశ చెంది, దుఃఖమును కలిగియుందుము. కాని, దేవునితో సరైన సంబంధమును కట్టుచున్నయెడల ఫలవంతమైన పరిణామముకై ఆయనయందు ధైర్యమును నమ్మికను కలిగియుందుము. ఆయనతో ఇట్టి సంబంధమును కట్టుటకు ప్రధమముగా చేయవలసినది ఆయన మార్గమందు నిలుచుట. దానినుండి ప్రక్కకుపోవుట సమయమును శక్తిని వృధా చేయును. దానిపై నిలుచుట ఆయనను విచారించుటకు సహాయపడును. ఆయన కూడ మనకు తనను కనుపరచుకొనును. అయితే, ఆయనను విచారించుచుండగా, విశ్వాస వైఫల్యములను ఎదుర్కొందుము. ఇది అసాధారణము కాదు.

దేవునితో బలహీనమైన సంబంధము ఆయనతో బలమైన సంబంధము కంటె ఎక్కువ విశ్వాస వైఫల్యములను చూచును. ఇష్మాయేలును వారసునిగా అనుకొనినపుడు అబ్రాహము విశ్వాస వైఫల్యమొందెను. అది సరైన గ్రహింపు లేకపోవుటవలన జరిగెను. కాని, దేవుని విచారించి, ఆయనలో ఎదిగినపుడు ఆయనయందు అతడు ధైర్యమును నమ్మికను ఉంచెను. దేవుడు వాగ్దానము చేసినట్టుగానే శారా ద్వారా అతడు కుమారుని పొందెను. విశ్వాస వైఫల్యము ఒక విషయమును గూర్చి దేవుడు ఎన్నడును ఉద్దేశించని విధముగా అర్ధము చేసికొనుటవలన కలుగును. క్రీస్తుయందు ఎదుగుటలో విశ్వాస వైఫల్యములు ఒక భాగము. అవి దేవునితో బలమైన సంబంధమునుబట్టి తొలగిపోవును. అయితే, ఆయనతో మన సంబంధము బలహీనమగుచున్నదని తెలియవచ్చుచునప్పుడు, అవి మరల మనలో సాధారణమగును.

ఆతురముగా ప్రభువుకై కనిపెట్టలేకపోవుటకు కారణము దేవునితో బలమైన సంబంధమును కలిగియుండకపోవుట; శరీరము వేరే ఆలోచనలు కలిగియున్నది. ఇందుకు విరుద్ధమైనచో, అభయమొకటి ఉన్నది. అది ఈ మాటలలో చూచెదము. ఇది మొదలుకొని మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు, ఆకాశ మేఘారూఢుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా (మత్త. 26:64). యేసు మనకు ఉపసంహరించరాని అభయమును అనుగ్రహించుచుండెను. దేవునితో బలమైన సంబంధమువలన ఆయన తన మాటను మనయెడల నెరవేర్చుటను చూచెదము. సర్వశక్తుని కుడిపార్శ్వమును గూర్చి అవివేకులముకాము. సృష్టి దానిగూర్చి మాటలాడుచున్నది, ఇంకను పరిశుద్ధ గ్రంధము దానితో నిండియున్నది. దేవుడు ఏలాగున, ఎప్పుడు మరియు ఎందుకు నానావిధములుగా పనిచేయుననునది అగాధమైనది. మననుండి అవసరమైనది ఆయనయందు కనిపెట్టు సామర్ధ్యము. ఆ సామర్ధ్యము దేవునితో బలమైన సంబంధమువలన పుట్టును.

దేవునితో బలమైన సంబంధమువలన కలుగు ఆనందకరమైన పరిణామమును గూర్చి ఈ వాక్యము వివరించుచున్నది. అందుకతడు – కుమారుడా, నీవెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి; (లూకా. 15:31). తప్పిపోయిన కుమారుని ఉపమానము మనకు బాగుగా తెలిసినదే. తరచుగా అది ఒక దేవుని కుమారుడు తప్పిపోయి, మరల తిరిగివచ్చుట అనిన కోణమునుండి ఆలోచన చేయబడును. కాని, ఎన్నడును తండ్రిని విడిచివెళ్లని కుమారుని గూర్చి కూడ దానిలో చెప్పబడెను. అతడు తండ్రితో బలమైన సంబంధమును కలిగినవాడు. సంశయములు లేనివాడై అతడు ఆయనను సేవించెను. తన తండ్రిని విచారణ చేయుట ద్వారా తనకొరకు దాచబడిన దానిగూర్చి తెలిసికొనెను. అతడు “నావన్నియు నీవి” అనిన ఉపశాంతమైన మాటలను వినెను. మనకు ఒక అభయమున్నది. తండ్రితో బలమైన సంబంధమునుబట్టి ఆయనకు చెందినవన్ని మనవగును. వాటిని ఇంకను మనము పొందకపోయినను, ఆతురముగా కనిపెట్టుట ద్వారా వాటిని కచ్చితముగా పొందుదుము. దేవుడు తాను చేయునని మరియు నెరవేర్చుదునని మనకు తెలిపినవాటన్నిటిని చేయును; మనము అడుగు వాటన్నిటిని ఆయన దయచేయును. ఈ సంగతి ఆయనయందున్న మన ధైర్యమునుబట్టియు నమ్మికనుబట్టియు ఎరుగుదుము.

దేవునితో బలమైన సంబంధము ఆయనను అర్ధముచేసికొనును. అది ఆయనకును ఆయన చిత్తమునకును అప్పగించుకొనును. దానిని పొందుటకును కొనసాగించుటకును కొన్ని ఆలోచనలు ఇవిగో:

1. దేవుని నడిపింపును అంగీకరించుట. ఒకడు ఆయన నడిపింపుతో ప్రారంభించి, దానిలో కొనసాగించుటకు ఆసక్తిని చూపవలెను. లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను (అపొ. 9:6). ఈ కారణమునుబట్టియే పౌలు అంతటివాడాయెను. ఈ ఒక్కసారి మాత్రమే కాక, అతడు అన్నివేళల దేవుని ఆలకించెను; ఆలకించిన దానిని హృదయమునకు హత్తుకొని, దాని ప్రకారము నడిచెను. ఆయనతో అతని బలమైన సంబంధము క్రీస్తునందు తన సంపూర్ణ జీవితమునకు బాట వేసెను.

2. సువార్తకు సేవచేయుట. దీనివలన నిత్యము దేవునితో సంబంధముగలిగి యుందుము. ఆయన మార్గముల ద్వారా ఆయనతో సహవాసము చేయుదుము. విశ్వసించువారిని సువార్తలో పాల్గొనుమని పౌలు ప్రోత్సహించెను. ఏలాగనగా  క్రీస్తుసువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు -చేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను, ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు (2 కొరి. 9:13). సువార్త కొరకు ధర్మము చేయుట ద్వారా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు విధేయులై యుందుము. రక్షణ విషయమై సువార్త వర్తమానమని తెలియజేయుటకు విశ్వాసులకు దేవుడు దానిని మార్గముగా చేసెను.

3. సత్యమందు నిలుచుట. సత్యమును తెలిసికొనుట మాత్రమే గాక, దానియందు నిలువలసి యున్నది. సత్యమునకు మనలను దూరముగా ఉంచుటకు సాతానుకున్న ఒక సులువైన మార్గము భిన్నత్వమును చూపించుట. వాని తప్పించుకొనుటకై వాక్యము ఒక సూత్రమును కలిగియున్నది.  సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనాకధలును మితములేని వంశావళులును, విశ్వాస సంబంధమైన దేవుని యేర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగియున్నవి గనుక, వాటిని లక్ష్య పెట్టవద్దని (1 తిమో. 1:4). దేవుని చిత్తమందు కొనసాగుట మన బాధ్యత. సత్యమందు నిలువనిదే దీనిని జరిగించలేము. విశ్వాసమువలనైన ఆయన చిత్తము లేక ఏర్పాటు ఆయన మనలను చేయుమని అడిగిన వన్నిటిని కలిగియుండును.

4. మనము నిజముగా ఎవరిమో ఆలాగున ప్రవర్తించుట. గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంధమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు (ప్రక. 21:27). గొఱ్ఱెపిల్ల యొక్క గ్రంధమందు మన పేర్లు వ్రాయబడెనని మనకు ధైర్యమున్నయెడల, దేవునితో బలమైన సంబంధమును కలిగియుండకుండ అడ్డగించు దేనికైనను అవకాశమియ్యరాదు.

Posted in Telugu Library.