దేవుని సభ

మన ప్రభువైన దేవుడు మనతో మాటలాడునని చెప్పుటకు మనయొద్ద చక్కనైన కారణము, అధికారము ఉండెనా? ఆయన ఆశ మనకు తెలియును. మనతోను, మనలోను నివసించుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. తన్నుతాను సిలువపై అర్పించుకొనుట ద్వారా ఏర్పరచిన పవిత్రమైన అన్యోన్యతను మనతో కలిగియుండవలెనని ఆయన ఆశపడుచున్నాడు. అయినను, ఆయన ఆశ యొక్క ప్రాముఖ్యతకు మనలో అనేకులము విలువను చూపము. అనేక గొప్ప సంగతులు ఆయనతో అన్యోన్యతవలన చోటుచేసికొనును. మన అర్పణలను త్యాగములను ఆయన వెదకుటలేదు గాని, ఆయనతో పరిపూర్ణ సంబంధమునే కోరుచున్నాడు. మనమాయనను విని ఆ ప్రకారముగా చేయవలెనని కోరుచున్నాడు. మన ఆలోచనలతో, విధానములతో ఆయనను తృప్తిపరచవలెనని తన రక్తముతో మనలను పరిశుద్ధపరచలేదు. కాని, కాపరి వెంట గొర్రెలవలె మనమాయనను వెంబడించవలెనని మనలను పరిశుద్ధపరచెను. ఆయనతో పరిపూర్ణ సంబంధముకై ఆయన వాక్యము శక్తియై యున్నది. వాక్యములోనుండి మనయొద్దకు వచ్చుటకు ఆయనే వాక్యమై యున్నాడు. కాని, యెహోవా మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించునట్లు దాని లక్ష్యము చేసినవాడెవడు? (యిర్మి. 23:18).

నిశ్చయముగా, మన ప్రభువైన దేవుని విని, ఆయన సభను పొందవలెనని ఆయన కోరుచున్నాడని చెప్పుటకు చక్కనైన కారణము, అధికారము ఉన్నది. ఈ మాట కంటికి కనబడు నిమిత్తము చెప్పునది కాదుగాని, దేవుని చిత్తము. మనుష్యుడు దేవుని సభలో నిలుచునా లేక నిలుచుటకు యోగ్యుడా అని విశ్వసించనివారు ప్రశ్నింతురు. అయితే, తన సభలో నిలుచుట తన చిత్తమని చెప్పుచునపుడు దానియందు నమ్మికయుంచుటకు ఆయన అవకాశమిచ్చెను; నమ్మిక ఆయన మాటను చూచుటకు, వినుటకు మనలను నడిపించును. ఆయనతో సహవాసములో మనలను నిలుపు ఏకైక లక్షణము నమ్మిక అని గుర్తుంచుకొనుడి. ఆయననుండి మానవుడు పొందునవి దాని మూలముగానే; అది తప్ప వేరేది ఏదియులేదు. మీ రక్షణను ప్రశ్నించుకొనుడి. అది శరీరమునందు అవతరించిన దేవునియందు నమ్మికవలననే. అయినను, అనేకులు దాని యొక్క సారమును గ్రహించరు. ఎందుకనగా, వారు దేవునితో సంభాషించు నమ్మిక కంటె, అనగా నిజమైన విశ్వాసము కంటె బుద్ధిబలముకు చెందిన విశ్వాసముతో ఉండిరి.

బుద్ధిబలముకు చెందిన విశ్వాసము దేవుని సభలో ఎవడు నిలువగలడు అను ప్రశ్నకు సమాధానమును దయచేయదు. అది బాహ్యమైనది మరియు దాని ఉనికి కేవలము క్రియలతో కొనసాగును. అబద్ధ సిద్ధాంతమైన దానియందు అనేకులు పడిపోయిరి. కొందరైతే దానిని హత్తుకొనిరి, ఎందుకనగా అది వారి కోరికలకు సరిపోయెను. శరీరమునందు వచ్చిన దేవుడను వారు నమ్ముదురు మరియు వారు నమ్మెదరు గనుక రక్షణ కొరకు క్రియలు చేయుచు, దానియందు నిలుచుటకు క్రియల పట్ల మొగ్గుచూపుదురు. విపర్యయముగా, నిజమైన విశ్వాసము బహు వ్యత్యాసముతో నున్నది. అది దేవుని సభలోనుండి పుట్టును. దేవుని సభలో నిలుచుట ఎవనికి సాధ్యమో అది చెప్పుటయే గాక, ఆయన చెప్పువాటిని ఒకడు విని, గైకొనునట్లు అది అవకాశమిచ్చును. ఆయన మాటను క్రమముగా చూచి, వినుచున్నావని నీవు చెప్పగలవా? అట్లైనచో, ఆయన మాటను విని, గైకొనుట యొక్క అర్ధము నీకు తెలియును. నీవు దేవునితో సహవాసము చేసినపుడు, అనగా, ఆయనతో అనుదినము మాటలాడి, వాక్యమును వెదకినపుడు ఆయన నీకు ఏర్పరచిన మాటను చూచెదవు; మరియు ఆయన ఆత్మ నీకు సరైన గ్రహింపును దయచేయును, అనగా నీవాయన మాటను విందువు. “విశ్వాసము క్రీస్తునుగూర్చిన మాటవలన కలుగును” అని చెప్పుటలో నున్న అర్ధమిదే. కాబట్టి, “మనము విశ్వాసమువలననే నడుచుకొనుచున్నాము” అని కూడ వ్రాయబడెను. కాని, ఆయన సభలో లేనివారు నమ్ముచున్నారు గనుక, వారు వెలి చూపువలన నడుచుచు క్రియలు చేయుదురు.

దేవునితో అన్యోన్యత ఆయన సభలో (సమక్షమున) నిలుచుటవలననే కలుగును. అది ఆయన ఆలోచనలను మార్గములను నీకు దయచేయును. అవి నిన్ను ఆయన పరలోక స్థలములకు సురక్షితముగా చేర్చును. అమూల్యమైన జీవకిరీటముకై వెళ్లుటకు నీవు సిద్ధముగానునపుడు నీ జీవితమును విశ్వాసమునందు జీవించి యుందువు. కావున, ఆయన వారిని చూచి – ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి; అనేకులు ప్రవేశింప జూతురు గాని వారివలన కాదని మీతో చెప్పుచున్నాను (లూకా. 13:24). అనేకులు ఎందుకు ప్రవేశింపలేరు? యేసు ద్వారమును విశాలముగా తెరువనందునా? కాని, దేవుడు అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచున్నాడని చెప్పబడెను. ఇరుకు ద్వారమున ప్రవేశించువారు దేవుడు తమలో జీవించు విధానమును గట్టిగా పట్టుకొనినవారు. దానినే వారు ఏకైక మార్గముగా ఎరిగినవారు. దేవుడు వారినుండి కోరినదానినే వారు చేయుదురు. వారు అలవాటు ప్రకారము ఆయన మాటను చూచి, వినుటకు ఆయన సభలో నిలుచుందురు. ఒకసారి వారు ఎత్తైన కొండను ఎక్కునట్లుగాను, మరో సమయమున లోయలో గాని, సమమైన ప్రదేశములో గాని నడుచునట్లుగాను అగపడుదురు. వారు మనుష్యుల ఆలోచనను వెదకరు మరియు సహాయముకై కుడివైపునకు గాని, ఎడమవైపునకు గాని తిరుగరు. దేవుని సభను పొందుటకు వారు ప్రాయాశపడుదురు. ఎందుకనగా, ఆయనయందు వారి విశ్వాసము బుద్ధిబలముపై ఆధారపడి యుండలేదు.

ఆయనతో అన్యోన్య సంబధముకైన నీ ప్రయాశలో విఫలము కాకుండునట్లు చూచుకొనుము. నీయందు జీవించుట, నీతో ఉండుట దేవునికి ప్రియము. ఏలయనగా ఆయన రూపమైన నీవు పాడైపోకుండునట్లు ఆయన చనిపోయి తిరిగి లేచెను. నీయందు ఆయన సన్నిధి గొప్ప మార్పును కలుగజేయును. నీవాయన మహిమను శక్తిని నీతిని చూచెదవు; నీ క్షేమముకై ఆయన నీ చుట్టునున్న లోకమును తీర్పుతీర్చును. కాబట్టి, ఆయనతో అన్యోన్యముగా ఉండుటలో నున్న విలువను ఈ వాక్యముతో ఆలోచన చేయుము. వారు తిని తృప్తిపొందిన తరువాత, గోదుమలను సముద్రములో పారబోసి ఓడ తేలిక చేసిరి (అపొ. 27:38). వారు ఓడను తేలిక చేయనియెడల మునిగిపోవుదురు. వారు చేయుచున్న గొప్ప ప్రయాణముకై ఓడ ఆహారముతో నిండియుండెను. అయితే, తమ ప్రాణములను కాపాడుకోవలసిన సమయము వచ్చినపుడు గోదుమలను వారు ప్రియముగా ఎంచలేదు. తృప్తిపొందునంతగా తిని మిగిలిన గోదుమలను సముద్రములో పారబోసి ప్రాణములను కాపాడుకొనుటకే ఎంచుకొనిరి. ఇరుకు ద్వారమున ప్రవేశించుటకు ప్రయాశపడుట ఇటువంటిదే. అంతకంతకు సంపాదించవలెనని లేక ఉన్నదంతయు గట్టిగా పట్టుకొనవలెనని ఆశపడు స్త్రీ, పురుషులు వెలి చూపువలన జీవింతురు. కాని, దేవుని సభను పొందినవారు వారికెంత కావలెనో మరియు దేవుడు ఎంత ఎక్కువగా వారికిచ్చుటకు ఇష్టపడుచున్నాడో ఎరుగుదురు. దేవుడు వారిని తన ఉద్దేశము కొరకు సృజించుకొనెనని వారికి తెలియును. కావున, వారు నిత్యము ఆయన సభలో నిలిచియుందురు.

వినుము, ఇరుకు ద్వారమున ప్రవేశించుట సమస్తమును శాశ్వతముగా కోల్పోవుట అని కాదు. దేవుడు మానవులను దరిద్రులనుగా చేయు ఉద్దేశముతో పిలువడు; ఎన్నడును ఆయన అట్టి ఉద్దేశమును కలిగియుండలేదు, కలిగియుండడు. కాని, ఇరుకు ద్వారమున మనలను ప్రవేశించుమని చెప్పినపుడు తనకు ప్రాధాన్యత ఇయ్యవలెనని, ఆయన సభలో నిలుచుండుమని మరియు తాను కోరుదానిని మనము చేయవలెనని ఆశపడుచున్నాడు. మరియు, ఇది మన క్షేమము కొరకే. ఇందు నిమిత్తము మనకు ఇష్టమైనవారిని లేక ఇష్టమైనదానిని విడిచిపెట్టుమని ఆయన అడుగును. ఈలాగు చేసి మన ద్వారా లోకముకు మానవుల యెడల తన ప్రేమను చూపించును. కొంతకాలము అవసరమైనవి కొదువుగా ఉండినప్పటికీ మననుండి ఆయన కోరినవాటన్నిటినిబట్టి మనలను నిరాధారముగా ఉంచడు. ఏలయనగా ప్రతివాడును తన కుటుంబమును, యింటిని లేక తనకు చెందినవి, మొదలగువాటిని ఆయన కొరకు విడిచిపెట్టినపుడు వారు నిత్యజీవముతోపాటు మరల సమస్తమును తిరిగి పొందుదురని వాగ్దానపూర్వకముగా ఆయన చెప్పెను. ఆయనను నమ్మువారికి ఆయన ఆలోచన ఎంత అద్భుతమైనది! వారిని వింతగా కనుపరచుటకు లోకమునకు వారిని వేడుకగా చేయును. ఈలాగు చేయుట అనేకమంది స్త్రీ, పురుషులను తన పిల్లలుగా చేసికొనుటకే కదా?

అనేకులు ఈ జ్ఞానమును స్వీకరించరు. కాబట్టి, వారాయనతో అన్యోన్య సంబంధమును కోరరు. వారాయనను నమ్మరు. ఇరుకు ద్వారమున ప్రవేశించుమని పిలుచుచున్న వాక్యమునుబట్టి వారు భయపడుదురు. ఎందుకనగా, వారిలో నమ్మకమును కలిగించు మాటను వారు పొందలేదు. మరియు, వారి ప్రయాశను మాటలతోను క్రియలతోను జరిగించుటకు మార్గములను వెదకుదురు. ప్రయాశపడుట వాస్తవముగా ఏమి దయచేయును? నీవు పొలములో ప్రయాశపడుట ఏమి తెచ్చిపెట్టును? అది నీకు, నీ కుటుంబమునకు, ఇంకను ఇతరుల పోషణకై ఫలమును దయచేయును. అది నీ పని విషయమై అనుభవజ్ఞానమును దయచేయును. నీవు మేలైన నిర్ణయములను తీసికొందువు. గొప్ప ఫలములకై జ్ఞానముగా వ్యవహరించుటవలన మెరుగైన జీవనోపాయమును కలిగియుందువు. నీవు ఇరుకు ద్వారమున వెళ్లుటకు ప్రయాశపడుట నీ జీవితమునకును ఆత్మకును, నీ కుటుంబము యొక్క జీవితమునకును ఆత్మకును మరియు ఇతరులకు కూడ అదే కలుగజేయును. నీవు దేవునినుండి, దేవునిగూర్చి నేర్చుకొందువు మరియు ఇతరులకు దేవుని సహాయముగా నుందువు. ఇది నిజమైన విశ్వాసము యొక్క విధానము. అది నీలో నున్న అనేక ఆలోచనలను క్రియలను తీసివేయుట ద్వారా నీ జీవితమును తేలిక చేసి, దేవుని సభలో నిలుచుటకు సహాయము చేయును. ఈ కారణమునుబట్టి, దేవుని కుమారునిగా దేవుడు వచ్చెను. మన తండ్రియైన దేవుని చిత్తప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములోనుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్నుతాను అప్పగించుకొనెను (గల. 1:4).

రాబోవుచున్న మరణమును తప్పించుకొనుటకు వారు ఓడను తేలిక చేసినయెడల నిత్యమరణమును తప్పించుకొనుటకై మన శరీర సామర్ధ్యములను విడిచి మనలను తేలిక చేసికొందము. ఈ కార్యమును దేవుని కుమారుని ద్వారా చేసెదము. ఆయన రక్తము దేవునితో అన్యోన్యతను అడ్డగించు సమస్తమును తీసివేయుటకు సామర్ధ్యముగలది. దేవుడు తన మాటతో మనలను నింపు నిమిత్తము అది మనలను వట్టివారిగా చేయును. ఈలాగు జరుగవలెనని మనము నిజముగా కోరినచో ప్రస్తుతపు దుష్టకాలము మనకు హాని కలుగజేయనేరదు. ఏలయనగా అది శరీర సామర్ధ్యములయందే వృద్ధి నొందును గనుక, మన ఆలోచనలు, క్రియలు దానిని పోషించనపుడు అది మృతమైనదగును. మనము దేవుని సభలో నిలిచియుందుము గనుక, అది మన పాదముల క్రింద త్రొక్కబడును. మన కుటుంబము యొక్క జీవితమును, మన చుట్టునున్నవారి జీవితములను నాశనము చేయు హానికరమైన దేదియు మనయందు ఉండకపోవును. ఇంకను, వారియెడల తన చిత్తమును మనము నెరవేర్చునట్లు దేవుని సభ మనలను బలపరచును. వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి (అపొ. 9:35).

దేవుని కుమారుని రక్తము యొక్క శక్తివలన మనమాయన చిత్తమును చేయుదుము మరియు వారు దేవునివైపు తిరుగుదురు. ఇదే మనలను తేలిక చేసికొనుటవలన కలుగు పరిణామము. మనలోనికి ప్రవేశించిన దేవుని ఆధారములు మనద్వారా ప్రకాశించును. వాటిని గమనించకుండుట అనేకులకు అసాధ్యమగును. వారు దేవుని శక్తిని మహిమను చూచెదరు. ఇందు నిమిత్తము మనము ఆయన కొరకు ముందుగా లోకమునకు వేడుకగా చేయబడి, తరువాత వింతగా కనుపరచబడుటకు ఆయన మనలను పిలిచెను. నీవు, నేను ఇందుకు సిద్ధమేనా? మనము నిలకడగా ఆయన సభలో నిలిచినయెడల సిద్ధముగా నుందుము. మనకు సంబంధించిన వన్నిటిని మనము తెలిసికొందుము. ఆయన నడువమని చెప్పినపుడు నడిచెదము, కూర్చుండమని చెప్పినపుడు కూర్చుందము, మాటలాడుమని చెప్పినపుడు మాటలాడుదము మరియు క్రియలు చేయుమని చెప్పినపుడు చేయుదము. అప్పుడు, దేవుని రాజ్యము అన్ని సరిహద్దులను దాటిపోవును. మరియు, యేసు వారితో ఇట్లనెను – ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి(మత్త. 24:4).

కాబట్టి, నీవు పొందినదానినుండి తప్పిపోకుము. ఏలయనగా నీవు దేవుని సభలో నిలుచు మార్గమును కనుగొంటివి; నీయెడల ఆయన కోరికను తెలిసికొంటివి. దేవుని ఉద్దేశమును నీవు కనుగొంటివి. ప్రస్తుతపు దుష్టకాల ప్రకారము పనిచేయువానిని విడిచిపెట్టుము. వాడు తన బుద్ధిబలముతో దేవుడు నిర్ణయించనివాటిని తనవెంట తెచ్చును. నీకొరకైన దేవుని ఆలోచనలను (లేక సభను) వాడు అందించడు. అందుకతడు ఇచ్చకపుమాటలు చెప్పి నిబంధన నతిక్రమించువారిని వశపరచుకొనును; అయితే తమ దేవుని నెరుగువారు బలముకలిగి గొప్ప కార్యములు చేసెదరు (దాని. 11:32).

Posted in Telugu Library.