ప్రభువు మన కాపరి

యెహోవా (ప్రభువు) నా కాపరి నాకు లేమిలేదు అని దావీదు తన కీర్తనలలో తెలియజేసెను. దానికి లోతైన అర్ధమున్నది. అది సమస్త కలవరములను, అనుమానములను, భయములను తొలగించును. కాపరివలె ప్రభువు అతనితో తన దినములన్నియు ఉండెను. ఆయన అతనికి బోధించెను, అతని సంరక్షించెను, కాపాడెను. ప్రభువు తన చెంతనుండగా అతడు విశ్రాంతిని కలిగియుండెను. చాల సమస్యలుండెను గాని, ఆయన వాటన్నిటిని తీసివేసెను. దావీదు తన కన్నులను ప్రభువుపై మాత్రమే ఉంచినవాడు గాని, మనుష్యులపై, పరిస్థితులపై ఉంచలేదు. అతడు కాలములపై ఆధారపడలేదు; ఋతువులయందు నమ్మిక యుంచలేదు. తన దినములన్నిటిలో ప్రభువును తన నిజమైన సహచరునిగా చేసికొనెను. ఆ ప్రభువే శరీరమందు వచ్చి, నిశ్చయముగా ధైర్యమును బలమును మనము తనయందు కనుగొనువానిగా ప్రత్యక్షపరచుకొనెను. ఆయన ఈలాగు చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెనుజీవాహారము నేనే; నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు” (యోహా. 6:35).

యేసు అనుగ్రహించు జీవము ఏ మనుష్యుడైనను వస్తువైనను అనుగ్రహించలేదు. ఏలయనగా ఆయన ఇచ్చు జీవము సంతోషము, సమాధానము మరియు నెమ్మదితో ఉన్నవి. ఏ కాలమంధైనను సమయమందైనను ఆయన వాటిని మనకిచ్చును. జీవాహారముగా మనలను ఉత్తేజపరచి, మన ఆత్మను సంతృప్తిపరచునట్లు ఆయన నిత్యము తన శక్తితో మనలను నింపును. ఆయన యొద్దకు వెళ్లు ప్రతిసారి మనలను చేర్చుకొనును. తన చిత్తముతోను, ఆలోచనతోను మార్గములతోను మనలను తృప్తిపరచును. వాటితో మనమెన్నడును ఆకలిగొనము, దప్పిగొనము. ఆయనయందు విశ్వాసముంచుట అను సామాన్య క్రియ మన దినములన్నియు ఉల్లాసముగా జీవించునట్లు చేయును. ఇవన్నియు మనము భుజించుటకు ఆయన దయచేయు వాక్యమువలన జరుగును. అప్పుడు, మన అవసరములు తీర్చుకొనుటకు మనుష్యుల యొద్దకు లేక ప్రదేశములకు పోవలసిన అవసరముండదు. మనమెక్కడున్నను ప్రభువు మనకు దయచేయుటకును మనలను సురక్షితముగా ఉంచుటకును మనతో ఉండెనని నిరాటంకమైన నిశ్చయతతో ఉందుము.

మితముగా చెప్పినయెడల, ఎన్నడును ఆకలిగొనకుండుట లేక దప్పి లేకుండుట అనిన ఆలోచన గంభీరమైనది. దాని గ్రహించుచున్నంతకూ మనము దానిని ఆనందింతుము. ప్రతి విషయమందు దానిని చూచెదము. మరియు, దానిని విశేషముగా తెలిసికొనుటకు మార్గములున్నవి.

  1. అపొస్తలుడైన పౌలును పోలి నడుచుకొనుట. అతడు ఈలాగనెను – ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంధములయందును వ్రాయబడియున్నవన్నియు నమ్మి…వారు మతభేదమని పేరుపెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరియెదుట ఒప్పుకొనుచున్నాను (అపొ. 24:14). దేవుని మరియు క్రీస్తును గూర్చి కొంత వాక్యమును మట్టుకే నమ్మువారము కాక, వారిని గూర్చిన సమస్తమును మరియు వారి వాగ్దానములను నమ్మవలసియున్నాము. వాక్యము యెడల ఏవిధమైన దురభిమానములు లేక కాపట్యములు ఉండరాదు. ఇందుకు మార్గము సమస్త స్వకీయ ఉద్దేశములు, మొండితనమును మనలోనుండి తీసివేయుట. ప్రభువు మనకు నియమించిన ప్రకారము ఆయనను సేవించినపుడు, ఆయనను గూర్చి సమస్తమును నమ్ముట ద్వారా దాని చేయుదము. కొన్నిమార్లు అది ఏమియు చేయనివారమైయుండి ఆయన మన పక్షమున పనిచేయునని నమ్ముటగును. ఆయన మన విన్నపములు ఆలకించెనని నమ్మి, ఆయనయందు కనిపెట్టవలెను, అనగా ఆయనను గూర్చి వాక్యములోనుండి నేర్చుకొనిన దానంతటిని బట్టి ఆయనను నమ్ముటయందు కాలమును వెచ్చించుట. అప్పుడు, ఆయన మనకు ఆశ్చర్యముగా సహాయము చేయును.
  2. మంచి పనిని కలిగియుండుట. ప్రభువునుండి మనకు మంచి పని ఉండుట అవసరము. అదేమైనను, ఆయననుండి రావలెను. దాని చేయుటచేత ఆయన మన జీవితమును స్థిరపరచును. మన నమ్మకత్వమును రుజువుపరచుకొనిన పిమ్మట అనేక పనులను ఆయన మనకు అప్పగించును. యేసునందు దేవుడు మనలను నూతన సృష్టిగా చేసినపుడు, అది మనకు మంచి కార్యములను అప్పగించు ఉద్దేశముతో చేసెను. వాటిని కలిగియుండుటవలన ఆయన మార్గమును విడువకుందుము. దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్ క్రియలు చేయుటకై, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నామని పౌలు ఒకచోట చెప్పెను. అనేకులు ప్రభువును తమ నిజమైన సహచరునిగా చేసికొనక వాటిని నష్టపోవుదురు. వాటిని కలిగియుండుటవలన ఆకలి మరియు దప్పి లేకుండుట అను ఉద్దేశమును నిశ్చయముగా గ్రహింతుము. అంటే, మనము నిరుత్సాహము నొందము. ఇందుకు కారణమిదిగో: మీలో ఈ సత్ క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినమువరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను (ఫిలి. 1:6). మనకు  పనిని నియమించినవాడు దాని నెరవేర్చుటకు మనలను నడిపించును.
  3. అజ్ఞానమును తప్పించుకొనుట. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక (1 పేతు. 1:14). స్త్రీ పురుషులు ప్రభువుకు విధేయత చూపుటనుండి తొలగిపోయినపుడు అజ్ఞాన సంబంధమైన మనస్సు వారిలో ఏర్పడును. ఇట్టి పరిస్థితిలో అజ్ఞానము ఆనందము కాకపోవును. బదులుగా అది దుఃఖమగును. ఏలయనగా వారు తప్పించుకోదలచిన ఆకలి మరియు దప్పి వారిపై పడును. జీవితము పరిష్కారములను కోల్పోవును; సమాధానములు దొరకుట కష్టమగును. వారు దేవుని జ్ఞానము కలిగియుండి కూడ ఇదివరకు అజ్ఞానములో చేసినవాటిని చేయునట్లు అవిధేయత ఒక ముసుగును వారిపై నిలుపును. కావున, అజ్ఞానులగుట రెండింతల తప్పిదమగును. విధేయతగల పిల్లలు ఎన్నడును ఆకలిగొనరాదని లేక దప్పిగొనరాదనిన ఉద్దేశముతో విధేయత కలిగియుందురు. ఇందుకు విరుద్ధమైనదానిని ఎదుర్కొనుటకు వారు భయపడి, దాని సమ్మతించరు.
  4. మనస్సును స్వాధీనపరచుకొనుటమరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనములో ఉన్నవి (1 కొరి. 14:32). మనము మేలు చేయు నిమిత్తము, మరిఎక్కువగా దేవునికి మహిమ కలుగజేయు నిమిత్తము పిలువబడితిమి. అల్లరికి కారణమగు వారిగా ఉండరాదు. ప్రభువునే సేవించుట నిజముగా మన ఆశైనయెడల ఆయన తన చిత్తమును మనలో జరిగించునట్లు మన ఆత్మలను నెమ్మది పరచుకొందుము. ప్రభువువలన ఆత్మవరము పొందుట ఒక ఆధిక్యత; అది ముఖ్యము కూడ. కాని, ఆ వరమును ఉపయోగించుటలో ఆశానిగ్రహమును ఆచరించుట చెప్పనశక్యమైన మేలు కలుగజేయును. మరల, మనస్సును స్వాధీనపరచుకొనుటవలన ప్రభువు పట్ల మన విధేయతను ఎరుగుదుము. ఆయన ఇచ్చిన మంచి కార్యమును ఆయన కోరినట్టుగా జరిగించుచున్నామో లేదో తెలిసికొందుము. ఆశానిగ్రహము లేకపోవుటవలన వాస్తవముగా ఆత్మవరములోని సారమును లేక మంచి కార్యము యొక్క సారమును నష్టపోవుదము గనుక, చేదైన ఫలితము కలుగును.
  5. దేవుని చిత్తమును అనుసరించుట. అన్యక్రైస్తవుల నుండి సున్నతి కోరిన యూదా క్రైస్తవులతో పేతురు ఈవిధముగా చెప్పెను. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? (అపొ. 15:10). దేవుడు కోరినదానికి మించి మనము వెళ్లరాదు. విరుద్ధముగా ప్రవర్తించుట వాక్యముయెడల దురభిమానములు, కాపట్యములు  కలిగియుండుట చేత జరుగును. మన ఇష్టములను, ఉద్దేశములను తృప్తిపరచుకొను నిమిత్తము ప్రభువును పరీక్షించుట మనలో కఠినత్వమును కలిగించును. ఇట్టి స్థితి ఆయనను సమీపించుటలో నున్న లోతును ఆనందించుటకు, ఆయనను నమ్ముటకు మనలను దూరము చేయును.
  6. యేసును ఆలకించుట. ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవిని చూచి – నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను (మార్కు. 2:14). ఆ సమయమునుండి మత్తయి ఆయనను ఆలకించుట మానలేదు. అతడు ఎంత దీర్ఘముగా ఆలకించెననగా, ఆత్మ ద్వారా దేవుడు తనకు బయలుపరచిన దానంతటి ప్రకారము యేసు క్రీస్తును గూర్చిన సువార్తను వ్రాసెను. ప్రభువు మనకు ఏమి చెప్పునా అని మనమెల్లప్పుడు చెవులు గలవారమై యుండవలెను. లేనియెడల, ఆయన చిత్తమును, ఉద్దేశములను, మార్గములను నష్టపోవుదుము. ఆయనను వెంబడించుట విధేయత అను క్రియను చేయుట మాత్రమే కాదుగాని, అది బంగారు భవిష్యత్తును ఊహించగల జ్ఞానమను క్రియ కూడ. ఒక్కసారి వాక్యములోనుండి ఆయనను విని, వెంబడించినపుడు, అన్ని విషయములకు అదే మాదిరిని పాటించవలెను; ఆ అనుభవమును ఎన్నడును విస్మరించరాదు. అప్పుడు, ఆకలి లేకుండుట మరియు దప్పిగొనకుండుట యందున్న సంతోషము మనదగును.
Posted in Telugu Library.