దేవుని దయ

దేవుడు తన బిడ్డల యెడల ఎందుకు దయ చూపించును? ఆయన ఎప్పుడు వారియెడల దయగలిగి యుండును? ఆయనకున్న ఒక దివ్యమైన లక్షణము వారిని జ్ఞాపకముంచుకొనునట్లు తన మనస్సును అనువర్తించుకొనుట. వారియెడల ఆయన కెల్లప్పుడు మంచి మనస్సుండును. ఈ విషయమును గూర్చి ఆయన పిల్లలమైన మనము నిశ్చయతతో ఉండవచ్చును. ఏ పరిస్థితులలోనైనను ఆయన మనకు సహాయము చేయును. భయము, ఆందోళన మరియు కష్టములను కలుగజేయు మార్గములను కొన్నిమార్లు ఆయనే మనకు అనుగ్రహించును. అయినను, తగిన సమయమున మనలను జ్ఞాపకము చేసికొని, కాపాడి, మనకు సమకూర్చును. ఆయన హస్తమే మొదటి నుండి నడిపించుచుండెనని మనమెరిగినప్పటికీ, ఆయన మనగురించి తగినట్టుగా ఆలోచన చేయునని నమ్ముట ఆవశ్యకము. మనలను నడిపించుట మొదలుపెట్టెను గనుక, ఆయన మనపై దయ చూపు బాధ్యతను తీసికొనును. ఆదికాండము 8:1 ఈలాగు చెప్పుచుండెను. దేవుడు నోవహును అతనితోకూడ ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసికొనెను. దేవుడు భూమిమీద వాయువు విసరునట్లు చేయుటవలన నీళ్లు తగ్గిపోయెను.” 

దేవుడు నోవహును ఓడను జ్ఞాపకము చేసికొనుటకు గల కారణము ఆయన అతని కిచ్చిన వాక్యము (మాట). భూమి అంతటిలో అతనినే నీతిమంతునిగా ఆయన ఎరిగెను గనుక, దానిని అతని కిచ్చెను. ఇప్పుడు, దేవుడు తన బిడ్డల యెడల ఎందుకు మరియు ఎప్పుడు దయ చూపునో మనకు గ్రాహ్యమైనది. దేవుని దయను ఒక క్రైస్తవుడు పొందదలచినయెడల వానికి నీతి బొత్తిగా అవసరము. విశ్వాసము ద్వారా నీతిమంతునిగా చేయబడుటవలన నీతి కలుగును. ఒక్కసారి నీతిమంతులముగా చేయబడినపుడు దేవుని మందలోనికి చేరుదుము. ఆయన దయకు మూలము నీతిలో విశ్వాసము ద్వారా కొనసాగుట. నీతి, విశ్వాసము అనునవి ఒకదానిపై ఒకటి ఆధారపడును. ఒకటి లేకుండ రెండవది వికసించదు. మన నీతిని కాపాడుకొనుట ద్వారా నిశ్చయముగా మన విశ్వాసమును చాల రెట్లు వృద్ధి చేసికొందుము. అలాగుననే, విశ్వాసమును మన జీవితములోని అన్ని విషయములకు అన్వయించుట ద్వారా మన నీతిని కాపాడుకొందుము. దేవుని యొక్క నిరంతర దయకు ద్వారమును తెరచు విశ్వాసములో ఎదుగుటకు కచ్చితమైన మార్గము నీతిని కాపాడుకొనుట. మనయెడల దేవుని దయను ప్రభావితము చేయు కారణములున్నవి; వాటిని చూచెదము.

1. ఫలవంతమైన జీవితముకై దేవుని వాక్యముపై దృష్టిపెట్టుట. జీవితములో ముందుకు పోవుటకు యత్నించవలెనని అనిపించినపుడు మనమాయన మనస్సును, అనగా మనయెడల ఆయనకున్న ఆలోచనలు పరిగణించవలెను. ఇందుకు ప్రభావశాలియైన మార్గము ఆయనతో మాటలాడుట. దీనిని చేయనిచో, పరిణామము మన ప్రయత్నములవలన కలుగు వైఫల్యమగును. అది ఈ వాక్యములోనుండి గ్రాహ్యమగును. నీవు విత్తు విత్తనముల పైరును నీ ద్రాక్షతోట వచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండునట్లు (అపవిత్రములు కాకుండునట్లు) నీ ద్రాక్షతోటలో వివిధమైనవాటిని విత్తకూడదు” (ద్వితీ. 22:9). దేవుని మార్గములతో మన మార్గములను జోడించరాదు. నోవహు ఆయన వాక్యముతోను మార్గముతోను ప్రారంభించెను మరియు వాటి మూలముగానే ఓడ ఎక్కెను. లోకమును శరీర ప్రేరణలవలన మనస్సులో పుట్టు ఆలోచనలును మన జీవితములో ప్రాముఖ్యమైన పాత్రను పోషించుటకు తరచుగా ప్రయత్నించును. కాని, అవి ఎన్నడును మేలును కోరవు; అవి నీతిని పాడుచేయును.

2. అనుదినము ప్రభువు కొరకు మనలను ప్రత్యేకపరచుకొనుట. మనలను మనము పరీక్షించుకొని, క్రీస్తు ద్వారా పరిశుద్ధతను పొందవవలెను. పరిశుద్ధముగా ఉండుట మన వృత్తి. దీనికి మొదలు ఏకాంతములో ఆయనతో సమయము గడుపుట. అప్పుడు, మన ఉద్దేశములను ప్రక్కనబెట్టుటకు తీర్మానించుకొందుము; నీతిలో వృద్ధి చెందుటకు తన నడిపింపుకై సిద్ధముగా ఉంటిమని ఆయనకు చెప్పుదము. ఇది మనలను ఏ అపవిత్రము నుండైనను పవిత్రపరచుటకు ఆయన కవకాశమిచ్చును. ఆయన కొరకు ప్రత్యేకపరచుకొనుటను మన ప్రత్యేకహక్కుగా చేసికొనినపుడు మన సమస్త ప్రయాసలలో మనలను జ్ఞాపకము చేసికొనుటకు ఆయన తన మనస్సును అనువర్తించును. మరియు, మన మనస్సు కూడ ఆయనకై ప్రత్యేకముగా ఉండకూడదనిన ఆలోచనను విరమించును. ఏలయనగా ఇది తన పిల్లలందరికి ఆయన చిత్తమై యుండెను. వారికీలాగు ఆజ్ఞ ఇచ్చెను – లేవీయులారా, నా మాట ఆలకించుడి; ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధస్థలములోనుండి నిషిద్ధ వస్తువుల నన్నిటిని బయటికి కొనిపోవుడి (2 దిన. 29:5).

3. ఆయన ఆజ్ఞలను అభ్యసించుట. దీనికై బలము అలవాటుగా వాక్యమును చదువుటనుండి వచ్చును. ఆయన ఆజ్ఞలను గైకొనుట ప్రతి విశ్వాసి యొక్క మౌలిక బాధ్యత. ఆయన దయను పొందుటకు అది ప్రధాన ప్రమాణము. ఏలయనగా దానియందు నీతిలో జీవించుటకున్న నిరీక్షణ సంపూర్ణమగును. దానికై స్పష్టమైన ఉద్దేశము గలవారమై, ఆయన ఆజ్ఞలను ఆచరించగలము. ఇందుకు దేవుడు మనలో అవకాశమును కలుగజేయును. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను (కీర్త. 119:32). గొప్పవాటిని అర్ధము చేసికొందుము గనుక, ఆయన కార్యములవలన విస్తారమైన సంతోషమును పొందుదుము. అవకాశములు, సహాయములు, ఆశీర్వాదములు, ఇంకను అనేకమైన ఇతర ఏర్పాట్లు సరైన సమయములో మనకు లభించును. జీవితములో దేవుడు మనకు సుఖము నిచ్చును. ఆయన నిరంతర దయను పొందవలెనని నిర్ణయించుకొనినయెడల ఆయన ఆజ్ఞల మార్గమున పరుగెత్తుట దానికొరకు మనలను సిద్ధపరచును.

4. దేవుని యెడల తిరిగుబాటు చేయుమని ప్రేరేపించు ఆలోచనలకు తావియ్యకుండుట. అయితే అతడు తనకు గుఱ్ఱములను గొప్ప సైన్యము నిచ్చి సహాయము చేయవలెనని యడుగుటకై ఐగుప్తుదేశమునకు రాయబారులను పంపి బబులోనురాజు మీద తిరుగుబాటు చేసెను; అతడు వర్ధిల్లునా? అట్టి క్రియలను చేసినవాడు తప్పించుకొనునా? నిబంధనను భంగము చేసెను గనుక తప్పించుకొనడు (యెహె. 17:15). కొన్నిటిని దేవుడు వద్దని చెప్పినపుడు ఆలకించవలెను. మరల, ఆయన ఉపదేశించకుండ స్వంత మార్గములను ఏర్పరచుకొనరాదు. ఇవి ఆయన సేవకు మాత్రమే కాక, విశ్వాసి జీవితములో ప్రతి అంశమునకు కూడ వర్తించును. ఆయన వాక్యమును అతిక్రమించి తప్పించుకొనుట అసాధ్యము. ఆయన చిత్తమును నెరవేర్చుటకు అడ్డదారులు లేవు; మహిమకును ఆనందముకును ప్రత్యామ్నాయ మార్గములు లేవు. వీటినిగూర్చి నోవహు తన మనస్సునందు ఆలోచనైనను కలిగియుండలేదు.

5. సత్యములో నడుచుట. దేవుని వాక్యముకు విరోధముగా యేసు ఎన్నడును మాటలాడలేదు, పలుకలేదు. యూదులు ధర్మశాస్త్రమును పలికిరి గాని, దేవుడు ఆశించినట్టుగా దానిని చేయలేదు. నీతిలో కొనసాగదలచిన -యెడల, సత్యమును ఎరుగుట చాలదు. దానియందు నడువవలెను. అంటే, దానికొరకు ధైర్యముగా నిలబడవలెను. మనము నీతియందున్నామని కచ్చితముగా తెలిసికొనుటకు అవిశ్వాసుల యొక్క, నీతివిరోధుల యొక్క నిందలే స్పష్టమైన సూచన. అప్పుడు, క్రీస్తునందున్నామని, క్రీస్తుతో ఉన్నామని ఎరుగుదుము. అబద్ధసాక్షులనేకులు వచ్చినను సాక్ష్యమేమియు దొరకలేదు. తుదకు ఇద్దరు మనుష్యులు వచ్చి  (మత్త. 26:60). మనలను తప్పుగా చూపించు క్షణమందు వారు మనపై పైచేయి సాధింతురు గాని, జయము మనదగును. దేవుడు క్రీస్తును మృతులలోనుండి లేపినట్టుగానే సరైన సమయమున మన శత్రువుల యెదుట మనపై దయ చూపించును. మనము నీతిమంతులుగా తీర్చబడినయెడల మనకు శత్రువులుందురు. కాని, మన నీతి పరీక్షింపబడుట ద్వారా దేవునికి మహిమ కలుగుట దాని ఫలితమగును.

6. దేవుడు మనకిచ్చిన పిలుపుపై దృష్టిపెట్టునట్లు చూచుకొనుట. యేసు – నేను వచ్చువరకు అతడుండుట నాకిష్టమైతే అది నీకేమి? నీవు నన్ను వెంబడించు మనెను (యోహా. 21:22). మనకేమైనను, మన ఎదుట ఎవరు నిలిచినను, మన దృష్టిని మల్లించరాదు. శరీర భావములు మనలను జయించరాదు. క్రీస్తునందు దేవుడు మనకిచ్చిన దానిని ప్రాముఖ్యముగా చేసికొనవలెను. మన వశములో లేనివాటి విషయమై ఆందోళన చెందుట నీతి కొరకై మనలను బలహీనులనుగా చేయును. దేవుడు తన కప్పగించిన దానిపై నోవహు దృష్టి ఉంచెను గనుక, ఓడను పూర్తి చేసి, తన కుటుంబమును కాపాడుకొని, లోకముపై నేరస్థాపన చేసెను. దేవుడు ఇచ్చిన పనిని, సమస్తమును మరియు అందరిని కాపడుకొను ఆకాంక్షతో మనముండవలెను.

Posted in Telugu Library.