“ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్ధ్యము కలిగించుచున్నాడు. అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును” (2 కొరి. 3:6).
ధర్మశాస్త్రమును చంపు అక్షరముగా పౌలు ఉపదేశించాడని అర్ధముచేసికొనుట అంత కష్టము కాదు. అయితే, తాను ఎటువంటి నిబంధనకు పరిచారకుడో కూడ చెప్పుచున్నాడు; ఆ నిబంధనకు అక్షరముతో సంబంధములేదు. ఇది ఎందుకనగా ధర్మశాస్త్రము మనుష్యుని మనస్సాక్షికి శాశ్వతమైన స్వస్థతను కలిగించలేదు. అది శరీరమునుబట్టి జరిగింపబడగా మనస్సాక్షికి సంపూర్ణసిద్ధి కలుగజేయు దేవుని రక్తముపై కట్టబడిన నూతన నిబంధనైతే శరీరానుసారముగా జరిగింపబడునది కాదు. ఇది ఇలా ఉండగా ధర్మశాస్త్రము నిత్యత్వము చేరకుండా మనస్సాక్షిని చంపివేసెను. కానీ, ఆత్మయైతే మనస్సాక్షికి క్రీస్తు రక్తమువలన స్థిరపరచబడిన జీవము నిచ్చెను.
అయితే, ఎటువంటి అదనపు ప్రభావము అవసరము లేకుండానే స్వతస్సిద్ధముగా లేవీయుడు ధర్మశాస్త్రము యొక్క పరిచారకుడగును. ఇందుకు లేవియునిగా పుట్టుటతోపాటు చెక్కబడిన ధర్మశాస్త్రము అతనికి చాలును. కాని నూతన నిబంధన పరిచారకుని విషయమై ఇట్లుకాదు. పరిచారకుడగుటకును అతని జన్మకును సంబంధములేదు. మరియు, క్రొత్త నిబంధన గ్రంధమును కేవలము కలిగియుండి దానిని అధ్యయనము చేయుట ద్వారా అతడు సేవకుడు కాలేడు. జీవింపజేయు ఆత్మ నిశ్చయముగా అవసరము, ఎందుకనగా నూతన నిబంధన సహితము ఆత్మవలనై యున్నది. ఈ ఆత్మ లేకుండ ఒకడు నూతన నిబంధన పరిచారకుడు కాలేడు. క్రొత్త నిబంధన గ్రంధము వ్రాయబడక మునుపే పౌలు అతని సమకాలికులు జీవింపజేయు ఆత్మ ప్రకారముగా నూతన నిబంధనను ప్రకటించిరి. వారు దానిని క్రీస్తు కొరకు పొందిన అనేక జీవితానుభవములతోపాటు ప్రవక్తలనుండి, కీర్తనలనుండి, ధర్మశాస్త్రము నుండి ఆత్మ దయచేసి తగిన జ్ఞానము ద్వారా పొందిరి. అయితే దీనివలన మనకేమిటి? మనము గ్రహించవలసిన దేమనగా, ప్రవక్తలనుండి, కీర్తనలనుండి, ధర్మశాస్త్రము నుండి, క్రొత్త నిబంధన గ్రంధము నుండి మనము ప్రకటించు నూతన నిబంధనకు కూడా పైవిధానమునే కలిగియుండవలెను. అప్పుడు, నూతన నిబంధన పరిచారకులుగా దేవుని నుండి సామర్ధ్యమును పొందినవారమౌదుము. అంతేకాక, క్రొత్త నిబంధన గ్రంధము నుండి ప్రకటింపబడిన ప్రతి మాటకు ఆత్మ ప్రభావము ఉండవలెను. ఇట్లు కానియెడల క్రొత్త నిబంధన గ్రంధము యొక్క ఫలితము ధర్మశాస్త్రమువలనైన ఫలితముగా నుండును. ధర్మశాస్త్రము మరియు క్రొత్త నిబంధన గ్రంధము దైవావేశమువలన కలిగినవే; వ్యత్యాసము ఏమనగా, ధర్మశాస్త్రములోని అక్షరములో ఆత్మ పనిచేయ నవసరములేదు గాని నూతన నిబంధన కొరకు ఏర్పరచబడిన ప్రతి అక్షరములో ఆయన పనిచేయవలెను. బహుశా ఈ ఆవశ్యకతనుబట్టే అనేకులు అర్ధజ్ఞానము లేకుండా వల్లించుటనుబట్టి, పారంపర్యాచారమును బట్టి మరియు బుద్ధిబలమును బట్టి పరిచార్యకులైరి గాని, దేవుడు దయచేయు సామర్ధ్యములనుబట్టి కాదు.