క్రీస్తు అధికారము

దేవుడు ఈ లోకమునకు శరీరములో వచ్చుటకు ముఖ్యకారణము మానవులను తనయొద్దకు పిలుచుటకై యుండెను. ఈ సంగతి ఆయనను నిజముగా నమ్మినవారికి బాగుగా తెలియును. ఆయన తన్నుతాను యేసుక్రీస్తు లేక మెస్సీయగా బయలుపరచుకొనెనని కూడ వారికి తెలియును. కాని, అనేకమంది మెస్సీయ యొక్క సహజమైన అర్ధమును గ్రహించరు. వారాయనను అభిషిక్తునిగా, అనగా దేవుడు ఆయనను అభిషేకించెనని ఆరంభమున ఎరిగినప్పటికీ, ఇంకను ఆయనను తెలిసికొనుటలో వెనుకపడిరి. ఎందుకనగా, ఆ నామము కలిగియున్న అధికారమును లేక శక్తిని వారు ఎరుగకపోయిరి. యేసుక్రీస్తు దేవుని అభిషిక్తుడైనచో నేమి? అవును, ఎవరును చేయ సాధ్యముకాని కార్యములను ఆయన చేసెను; అవును, ఆయన దేవుని రాజ్యమును ప్రకటించెను; అవును, సిలువపై ఆయన మరణించి, సమాధిని గెలిచెను. కాని, తన్నుతాను మెస్సీయగా ఏలాగు తెలియపరచుకొనును? ఆయన రక్షించు దేవుడు ఎట్లైయ్యెను? ఇందుకు మనము చదువబోవు వాక్యము అమూల్యమైన సమాధానము నిచ్చును. ” – నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పినమాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను(యోహా. 18:9).

నీవు దేవుని మరియు ఆయన తన కుమారుని నీ ఆత్మ యొక్క రక్షణకై పంపెనని నమ్మినయెడల నీవు తప్పిపోలేదు. అది అంత సులభమైనది. రక్షణను ప్రస్తావించుటలో నా ఉద్దేశమేమనగా మారుమనస్సు ద్వారా నీ పాపములకై క్షమాపణ కలుగుట లేక నీ పాపములను, పాపస్వభావమును ఆయన యెదుట ఒప్పుకొనుట మరియు యేసును నీ ప్రభువుగాను, రక్షకునిగాను స్వీకరించుట. ఇది జరిగినపుడు సమస్త అధికారమును దేవునినుండి పొందిన క్రీస్తు అధికారమునకు దేవుడు నిన్ను అప్పగించును. ఈ కారణమునుబట్టి, యేసుక్రీస్తు మెస్సీయను రక్షించు దేవుడై యున్నాడు. దేవుడు తనకిచ్చినవారిని ఆయన పోగొట్టుకొనడు. ఆయన వారిని దేవుని శక్తియందును, పరిశుద్ధత యందును, నీతియందును పొందెను. విశ్వాసమునుబట్టి తండ్రియైన దేవుడు నిన్ను నీతిమంతునిగా చేయుట నిత్యజీవముకై నిన్ను సురక్షితముగా ఉంచుటకు క్రీస్తుకు చాలును. ఏలయనగా తన దేవుని యొక్క తీర్పు పరిపూర్ణమైనదై, కొట్టివేయబడలేనిది. కాబట్టి, ‘నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను’ అని ప్రభువు చెప్పుట ఒకచోట వ్రాయబడెను.

నీవు యేసును పూర్ణముగా నమ్మినయెడల ఆయన నిన్ను పోగొట్టుకొనడు. ఇందునుబట్టి నీవు పాపము చేయవని కాదు. కాని, ఆయన నిన్ను శిక్షించును, పరీక్షించును, ఇంకను శోధనలు కూడ నీమీదకి వచ్చునట్లు అంగీకరించును. నీవు ఆయనను వెదకి, కనుగొనవలెనని ఆయన ఇవన్నియు నీయెడల జరిగించుటకు కారణము; అంతేగాక ఆయన చిత్తము చేయుటకు విశ్వాసములో బలవంతుడవై తన పరలోక రాజ్యమును చేరవలెనని జరిగించును. ఇవన్నియు నిన్ను పోగొట్టుకొనుటకు జరిగించడు గాని, తనయొద్ద నిన్ను బద్రపరచుకొనుటకు చేయును. ఎందుకనగా నిన్ను మరల జన్మింపజేసిన వాడాయనే. మరియు, ఆయనను నమ్మి, వెదకుదవని ఆయన ఎరిగియుండెను గనుక, నీవాయనను వెదకెదవు. ఆయనను పూర్ణముగా నమ్ముటలో అర్ధమిదే.

ఒక్కసారి రక్షింపబడినవాడు ఎల్లప్పుడు రక్షింపబడినట్లు కాదను ప్రచారమొకటి ఉండినందున జాగ్రత్తగా ఉండుము. అట్టి ప్రచారము అనేకమంది క్రైస్తవులు రక్షణలో కొనసాగుటకై దేవుని చిత్తమును విడిచి, క్రియలు చేయుటలో ప్రయాశపడుటకు కారణమాయెను. అది వారిని దేవునియందు పూర్ణ నమ్మికనుండి వేరుచేయుచుండెను. (నేనును ఒక సమయమున తెలియకపోవుటవలన, మనుష్యులకు భయపడుటవలన దానిక్రింద ఉండితిని). అది నిజమైనచో కృప తొలగిపోవును. అంతేగాక శక్తి, పరిశుద్ధత, నీతివలన సర్వజ్ఞుడైన దేవుని తీర్పు అసమర్ధమైనదని అర్ధమిచ్చును. నీవు కృపపై అధికారమును కలిగియుండనియెడల దానిని కొట్టివేయుటకు నీకు అధికారము లేదు. ఏలయనగా రక్షణ విశ్వాసము ద్వారా కృపవలనైనచో మరియు నీవు కృపను పొందినచో నీ తీర్పునుబట్టి నీవు రక్షింపబడలేదు గాని, దేవుని తీర్పువలనే రక్షింపబడితివి. ఆయన నీ నమ్మికను నిందలేనిదిగా ఎంచి, నిన్ను బద్రపరచుమని క్రీస్తుకు అప్పగించెను. అయితే, పండ్రెండుమందిలో తనను మోసము చేసినవానిని ఆయన పోగొట్టుకొనెను. ఎందుకనగా, వాడు ఎన్నడును దేవుని నమ్మియుండలేదు. ఏలయనగా వాడు తప్ప ఆ పండ్రెండుగురిలో ఎవరును తరచుగా డబ్బు సంచిలోనుండి ధనమును దొంగిలించలేదు; వాని నమ్మిక వేరుగా ఉండెను. కాబట్టి, బుద్ధిబలముచేత విశ్వాసమును పొందినవారు రక్షింపబడిరని తలంచి, ‘ఒక్కసారి రక్షింపబడుట ఎల్లప్పుడు రక్షింపబడుట కాదు’ అనిన సిద్ధాంతమును సృష్టించిరి. ఇది సత్యము కానియెడల, ఆత్మ పౌలు ద్వారా మన తండ్రియైన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక (2 కొరి. 1:2) అని చెప్పియుండకపోవును.

ఈ ఒక్కసారి మాత్రమే గాక అనేకమార్లు ఆత్మ వాటిని విశ్వసించువారికి నూతన నిబంధనలో తెలియజేసెను. యేసు వారిని పోగొట్టుకొనడు అని తప్ప దీనికి వేరే అర్ధమేముండును? అయితే, ‘ఒక్కసారి రక్షింపబడినవాడు ఎల్లప్పుడు రక్షింపబడినట్లు కాదు’ అనిన సిద్ధాంతమునకు కొన్ని లేఖనములు జీవము పోయుచునట్లుగా కనబడుచుండెను. మరియు వాటిలో తీవ్రమైనది విశ్వాసమునకు సున్నతిని చేర్చజూచిన గలతీయులకు పౌలు పలికిన మాటలై యుండెను. ఇవన్నియు క్రీస్తులోనికి వచ్చినవారు వెనుదిరుగకుండునట్లు హెచ్చరికకై యుండెను. గలతీయుల విషయములో మనము చూచుచున్నది వారిలో భయమును నింపుటకు దేవుడు పౌలు ద్వారా తన ఉగ్రతను తెలియజేయుట. వారు నశించిపోయిరని కాదుగాని, శక్తి, పరిశుద్ధత మరియు నీతియందు ఆయన క్రీస్తుకు అప్పగించినవారిని శిక్షించుటై యున్నది. తన విస్తారమైన ప్రేమతో మనలను నడిపించు దేవునిగూర్చిన జ్ఞానమును కలిగినపుడు మనమాయనకు దగ్గర సంబంధులమై, మనుష్యులు, వారి సూత్రములనుండి విడుదలను పొందెదము. ఏలయనగా మనలో ఎవరము రహదారిపై హెచ్చరికలను నిర్లక్ష్యము చేయుచు ప్రయాణము చేసెదము? కావున, దేవుడు వారిని పోగొట్టుకోకుండుటకై వారిని ముందుగా హెచ్చరించెను. ఆయన కృపను పొందినవారందరికి ఆయన ఈలాగు చేయును.

దేవుడు తనకు అనుగ్రహించిన ప్రతివానిని బద్రపరచు క్రీస్తునుగూర్చి ఇంకను ఏమి అర్ధము చేసికోవచ్చునో చూడుము. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము – ఏడు నక్షత్రములు తన కుడిచేత పట్టుకొని యేడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా (ప్రక. 2:1). ఆయన నిరంతరము విశ్వసించువారిని కనిపెట్టుకొని యుండును. క్రైస్తవులు ఈ విషయమై చింతించ నవసరము లేదు. తన కుడిచేత పట్టుకొనిన ఏడు నక్షత్రములు దూతలు మరియు ఏడు దీపస్తంభములు సంఘములై యున్నవి. ఆయనే సమస్త అధికారమును కలిగినవాడు మరియు ఆయనను పూర్ణముగా నమ్మినవారిని బద్రపరచుటకు ఆయన తన అధికారము నంతటిని ఉపయోగించును. మనము మొదటిగా ఆయనను ఎరుగుటకు మరియు దేనివలనైతే కృపను దేవుడు మనకు వరముగా ఇచ్చెనో ఆ నమ్మికను ఆయన ఎన్నడును విసర్జించడు. ఇది మన రక్షణను సూచించును. రక్షణ క్రియలను కలిగియుండునని మనుష్యులు తలంచినపుడు అబద్ధపు సిద్ధాంతములు పుట్టును. కాని, మనము పాపము చేయుదమని ఆయన ఎరిగి కృప నిచ్చెనని గ్రహించుము. అయితే, భ్రమపడకుము. ఏలయనగా, పాపము శరీరసంబంధమైనది మరియు నమ్మిక ఆత్మలోనుండి పుట్టునది; మనము ఆత్మలో మారుమనస్సు పొందుట ద్వారా మనకొరకు చనిపోయిన దేవుడు శరీరమందు జరుగు పాపములనుండి రక్షించును. ఆయన కృపననుగ్రహించుటకు గల కారణమిదే. ఆయన మనలో ఉంచిన దేవుని భయము మనలను ఆయన యొద్దకు తిరిగి రప్పించును. కాబట్టి, ఒకచోట పౌలు మనస్సు విషయములో దైవనియమమునకు, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నానని చెప్పి యేసు ద్వారా రక్షించు దేవునికి విశ్వాసముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను.

ఈ వాక్యమును ఆలోచన చేయుము: తానును తన కుమాళ్లును, పశువులును, యీ బావినీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా? (యోహా. 4:12). నిజముగా యేసు ఎంత గొప్పవాడని నీవనుకొనుచున్నావు? నేను కూడ ఈ ప్రశ్నను వేసికొంటిని మరియు నేను కొనుగొనిన సమాధానము ఈ స్త్రీ పొందిన దానివలె ఉండెను. అద్భుతములు చేయుటకు, ఐశ్వర్యములు ఇచ్చుటకు యేసు కున్న సామర్ధ్యమును మనుష్యులకు అనేకులు ప్రకటించుటకు ప్రయాశపడుదురు. కాని, అవి ఆయనకు స్వల్పమైన సంగతులు. ఆయన నిజముగా ఏమి దయచేయ గలుగునో వారు ఎరిగినపుడు మిగిలినవి దయచేయుట ఆయనకు సమస్యకాదని తెలిసికొందురు. ఆయన మాత్రమే దయచేయున దేమిటో ఇప్పటికే మీకు తెలియవచ్చును. అది జీవజలము. నిజముగా, ఆయన యాకోబుకంటె మరియు ఇతరులందరికంటె గొప్పవాడు. ఇతరుల నుండి ఆయనగూర్చి తెలిసికొనుటకన్నా, ఆయన ఎంత గొప్పవాడో నీవే ఆయనను అడుగుము. ఆయన నీకు చూపించును. నీకు జీవజలము నిచ్చును. అది కృపవలనని, నీ బలమువలన కాదని గ్రహించెదవు. అప్పుడు నీవు ఎలా తప్పిపోవుదువు? జీవముగలది నీయందు జీవించుచున్నయెడల నీవు మరణించగలవా? దేవునినుండి నిన్ను పొందిన యేసు నీలో జీవజలము పారునట్లు చేయును. ఈ కారణమునుబట్టి, ఆయన దీపస్తంభముల మధ్య సంచరించును. అప్పుడు ఆయన నిన్ను పోగొట్టుకొనెనా లేక నీ రక్షణను నీవు విసర్జించగలవా? నేను చెప్పునదేమిటి? ఒకసారి నీవు జీవజలమును రుచిచూచినపుడు నీవు దాని తియ్యదనమును తెలిసికొందువు. నీ ఇల్లు ఎక్కడ ఉన్నదో, నీవు ఎవరికి చెందినవాడివో తెలిసికొందువు; నీ కొరకైన దేవుని మనస్సును, ఆశను, ఉద్దేశమును ఎరుగుదువు. ఆయనకు భయపడుటను కోరుదువు. అన్ని సమయములలో నీ ఆలోచనలలో ఆయనను కలిగియుందువు. పాపము చేయునపుడు ఆయన నిన్ను సరిచేయును మరియు అన్ని విధములైన యుద్ధములకై నీకు శిక్షణ నిచ్చును. నీవు పడిపోయినపుడు ఆయన నిన్ను లేపును. ఇందుకొరకు దేవుడు నీకు కృప నిచ్చెను. నీ నమ్మికను ఆయన ఎరిగియుండెను మరియు తనయొద్దకు నిన్ను రప్పించును. దేవుడు తన కృపను వ్యర్ధపరచడు; ఏలయనగా తన శక్తి, పరిశుద్ధత మరియు నీతిచేత దానిని నీకిచ్చుట న్యాయమని ఎంచెను.

చదువబోవునది దేవుని వాగ్దానమువలన కలిగెను గనుక, అది మన ఆత్మలను ఉత్తేజపరచవలెను. అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి (మత్త. 1:1). ఈ వాగ్దానము విశ్వాసమువలననే గాని, మరి దేనివలనైనను కలుగలేదు. విశ్వాసమునుబట్టి అబ్రాహాము సంతానమైన క్రీస్తును వాగ్దానముగా పొందెను; విశ్వాసమునుబట్టి దావీదు వారసునిగూర్చిన వాగ్దానమును, అనగా క్రీస్తును పొందెను. దేవుడు తన వాగ్దానములను నెరవేర్చును. నిత్యసింహాసనముపై కూర్చుండుటకు శక్తిని, అధికారమును కలిగియున్న మెస్సీయను యేసును ఆయన పంపి ఆయనకు నిరతరము రాజ్యముండునట్లు చేసెను. విశ్వాసము ద్వారా కృపవలన రక్షింపబడిన నీవు, నేను ఆయన రాజ్యమై యున్నాము. శరీరమును జయించునట్లు, ఆత్మలో దేవుని సేవించునట్లు మనమాయన అధికారము క్రింద ఉన్నాము. కాబట్టి, ఆయన ఈలాగు చెప్పెను. పరలోకమునుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను (యోహా. 6:51).

నీవు దేవుని మరియు నీ ఆత్మ రక్షణకై ఆయన యేసును పంపుటను నమ్మితివి గనుక నీవు జీవాహారమును తినియున్నావు. దేవుడు నిన్ను పోగొట్టుకోకుండునట్లు నిన్ను క్రీస్తుకు అప్పగించెను. ఆయన తన శక్తి, పరిశుద్ధత మరియు నీతిన్యాయములనుబట్టి నిన్ను రక్షించినపుడు నీవు నిరంతరము జీవించుటను తప్ప మరిదేనిని ఎంచుకొనవు. నీవాయన శరీరమును, అనగా వాక్యమును తినియున్నావు గనుక, జీవజలమును పొందెదవు. నీవు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానముకై ముందుకు మాత్రమే పరుగెత్తదవు. బుద్ధిబలముచేత విశ్వాసము కలిగి రక్షింపబడితినని తలంచువాడెవడును నీపై ప్రభావమును చూపలేడు. ఏలయనగా నీవు జీవజలమును పొందుటకు కారణమైన యేసు శరీరము (వాక్యము) నీ ఆత్మను దేవుని మహిమకై బద్రపరచునట్లు నీ శరీరమును జయించును. కాబట్టి, ఆయన ఈలాగు చెప్పెను. మీరు ఆత్మచేత నడిపింపబడినయెడల ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు(గల. 5:18).

Posted in Telugu Library.