దేవుని ఆశ

దేవుడు మనకు సంతోషము నిచ్చుటకు ఆశించును. మనయెడల తన సహాయమును ఆలస్యము చేయ నుద్దేశించడు. పరీక్షింపబడుచున్న సమయములలో సహితము మనకు సహాయము చేయుటకు ఆయన తిరస్కారము చేయడు; బదులుగా, సహాయము చేయుటకు ఆసక్తి చూపును. ఆయన సహాయమును పొందుటకు మనము చేయవలసినవాటిలో ఒకటి ఆయన అసహ్యించుకొనువాటికి దూరముగా ఉండుట. క్రియలు చేయుట మాత్రమే చాలదు. పాపసంబంధమైనవాటితో సహవాసము చేయుచునపుడు ఆయన సహాయమును కోల్పోవుదుము; క్రియలు సహితము నిసత్తువగును. దేవుని కొరకు క్రియలు చేయుట ఆయన అసహ్యించుకొనువాటితో మన సంబంధమునకు ప్రత్యామ్నాయమని మనలను నమ్మించుటకు సాతాను యుక్తి గలవాడు. వాడి యుక్తిలో పడిపోవుట అవిధేయతయు మరియు అనీతి చేయుటయు అగును. కాబట్టి, సంఘముగా కూడుకొను అనేకమంది క్రీస్తుకు విరోధముగా నడుచుకొనుట మనము చూచెదము. దేవుని కొరకు నానావిధములైన క్రియలు చేయుట ఆయన అసహ్యించుకొనువాటితో నున్న వారి సంబంధమును కొట్టివేయునని నమ్ముట వారు ఎంచుకొందురు. అనీతి మరియు పరిశుద్ధత ఒకేచోట నుండలేవు. దేవుని వాక్యము దేవుడు అసహ్యించుకొనువాటిని గూర్చి స్పష్టముగా చెప్పుచుండెను; అది బహు సూటిగా నున్నది. ఆయన సహాయము కోరు మనము దానిని హత్తుకొనవలెను. బేతేలును ఆశ్రయింపకుడి; గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్లకుడి; గిల్గాలు ఆవశ్యముగా చెరపట్టబడిపోవును; బేతేలు శూన్యమగును(ఆమో. 5:5). 

పాపసంబంధమైనవి మనకు తెలియపరచబడనిదే వాటికి దూరముగా నుండలేము. దేవుని వాక్యము వాటిని తెలియజేయును. ఆయన నడిపింపును ఆశ్రయించినపుడు ఆయన సహాయమును పొందుటకై ఆయనతో అన్యోన్యముగా ఉండుటకు ఆసక్తిని పెంచుకొందుము. తన సన్నిధిని ఇశ్రాయేలు నిత్యము కలిగియుండవలెనని దేవుడు వారికి ధర్మశాస్త్రము నిచ్చెను. కాని, వారు దానిని విడిచిపెట్టుటను ఎంచిరి. అయినను, ఆయన అసహ్యించుకొనువాటిని వారికి మరల తెలియజేసి, వారిని హెచ్చరించెను. వారాయన హెచ్చరికలను వినినయెడల రక్షింపబడియుందురు. మానవులుగా మనమందరము ఆయనకు ఇష్టముకానివాటిని చేయుటకు బలహీనులము. కావున, వాటినిగూర్చి హెచ్చరించుటకై ఆయన తన నిబంధన నిచ్చెను. ఆయన హెచ్చరికలను గట్టిగా పట్టుకొనువాడే ఆయన సహాయమును త్వరగా పొందును. మనలను ప్రేమించెను గనుక, ఆయన మనలను హెచ్చరించును. మనము చెడువాటివైపు గాని, చెడు స్థలములవైపు గాని తిరిగినపుడు ఏమగునో ఆయనకు తెలియును. వాటిలో నష్టమును నాశనమును ఉండును మరియు అవి మన జీవితములో ఉండుటకు ఆయన ఇష్టపడడు. వాటివైపు తిరుగుట మన ఆరోగ్యమునకు హాని, మనస్సునకు అస్థిరత్వము కలుగుటయే కాక, ఆయన నీతిని సూటిగా అడ్డుకొనునట్లు అవి మనలను సిద్ధము చేయును. అనేకమంది క్రైస్తవులు ఆయన నిబంధనయెడల ఆసక్తిని చూపనివారై పాపసంబంధమైనవాటితో సహవాసమును ఆనందించిరి, ఇంకనూ ఆనందించుచుండిరి.

దేవుని నిబంధనయెడల మనము ఆసక్తిని చూపినపుడే లాభము పొందుదుము. మన అంతరంగ పురుషుడు ఆయన నీతిని అనుసరించును. ఇందు నిమిత్తము కూడ ఆయన వాక్యమును పరిశోధించుట అలవాటు చేసికొనవలెను. అప్పుడు, దేవుని ఆత్మ యొక్క సహాయమునుబట్టి పాపసంబంధమైనవాటికి దూరముగా ఉండుటకు ఆయన నిబంధనను జ్ఞాపకము చేసికొందుము. ఇది మనకు ఒక అలవాటుగా అగువలెను మరియు దేవుని మంచితనముకై మనము ఆసక్తితో కొనసాగినయెడల, అది ఆలాగు జరుగును. అప్పుడు, అన్ని సమయములలో ఆయన సహాయము మనకు ఉండును. ఆయన మనకు ప్రతి విషయములో సహాయము చేయుట చూచెదము. అపొస్తలుడైన పౌలుకు అది లభించెను. శతాధిపతి పౌలును రక్షింప నుద్దేశించి వారి ఆలోచన కొనసాగనియ్యక, మొదట ఈదగలవారు సముద్రములో దుమికి దరికి పొవలెనని ఆజ్ఞాపించెను (అపొ. 27:43). వాస్తవముగా, ఆ దినమున పౌలు చంపబడి యుండవలెను. ఏలయనగా ఓడ మెట్ట పట్టినపుడు ఖైదీలందరిని చంపుట శతాధిపతికిని సైనికులకును ఆవశ్యము. వారు తప్పించుకొనుటకు కారణమై మరణము పొందుటకంటె, వారిని చంపుటయే వారు చేయుదురు. అయినను, శతాధిపతి ఇందుకు విరోధముగా చేసెను. పౌలులో ఉన్న తన ఉద్దేశముకు సరిపోవునట్లు దేవుడు అతని మనస్సు మార్చెను. మరియు, ఈ సంఘటనకు మునుపే పౌలు ఒక ఆశ్చర్యమైన సంగతిని బయలుపరచెను. అది అతనికిని అతనితో ప్రయాణము చేయుచున్న వారందరికిని సహాయము చేయుదునని దేవుడు తన దూత ద్వారా చేసిన వాగ్దానము.

నీ జీవితములో దేవునికి ఒక ఉద్దేశము ఉన్నప్పుడు, ఆయన నీకు నిశ్చయముగా సహాయము చేయునని తెలిసికొనుము. కేవలము ఆయన అసహ్యించుకొనువాటి తట్టు నీవు తిరిగినపుడే ఆయన సహాయము నీకు దూరమగును. దేవుని సేవించు విషయమై పౌలు బహు వివేకమును ఉపయోగించెను. దేవుని కొరకు పవిత్రమైన హృదయముతో జీవించుటయే అతని ప్రధాన గురిగా చేసికొనెను. ఆత్మవలన పరిశుద్ధపరచబడుట అను ప్రక్రియ ద్వారా తన మనస్సాక్షిని శుద్ధి చేసికొనుటను వెంటాడెను. ఇందునుబట్టి దేవుని యెదుట కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై జీవించుచున్నానని చెప్పగలిగెను. ఇది ఒక భారమైన ఆలోచనగా అగుపడవచ్చును. కాని, పాపసంబంధమైన వాటివైపు తిరుగుటవలన జీవితము మరిఎక్కువ భారమగును. ఏలయనగా వాటిలో నష్టము మరియు బాధ కచ్చితముగా ఉండును. విపర్యయముగా, పవిత్రమైన హృదయముతో దేవుని కొరకు జీవించుటను నీ ప్రధాన గురిగా చేసికొనినయెడల, సమస్తము దేవుడు చూచుకొనును; నీ జీవితమునకు సంబంధించిన వాటన్నిటిని ఆయన చూచుకొనును, నిజముగా అన్నిటిని ఆయన చూచుకొనును. అంతేకాక, వాటికి పరిపూర్ణత ఉండును. ఇదే ఆయన సహాయము యొక్క అంతర్గత గుణము.

దేవునికి అసహ్యమైనవాటి తట్టు తిరుగుటవలన నిశ్చయముగా పరిణామము లుండునని గ్రహించుట ముఖ్యము. అయితే ముందుగా, పాపసంబంధమైనవాటి తట్టు తిరుగుటవలన ఫలించు ఫలము ఏమైయుండును? దేవుని అవమానపరచు మాటలు మాటలాడి, క్రియలు చేయుదుము. అంటే, దేవుని మార్గములను ఆలోచనలను దూషించునట్లుగా మన మాటలు, క్రియలు ఉండును. మరియు, ఆయనతో అన్యోన్యతకు కారణమైన మన విశ్వాసమును ఓడబద్దలు చేయుదుము. ఇది ఆయన నీతిని నిరాకరించుటవలన కలుగు ఫలితము. అప్పుడు, పరిణామములు ఉండును. మనలను నిత్యత్వమందు దేవుడు శిక్షింపకపోయినను, ఇప్పుడు శిక్షించును. ఇందుకై ఉదాహరణ ఈ వాక్యమందు కనబడుచున్నది. వారిలో హుమెనైయును అలెక్సంద్రును ఉన్నారు; వీరు దూషింపకుండ శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించితిని (1 తిమో. 1:20).

విపర్యయముగా, వాక్యమును పరిశోధించి, పవిత్రమైన హృదయముతో దేవుని సేవించు ఉద్దేశముతో ఆయన హెచ్చరికలను పాటించినయెడల, పాపసంబంధమైన వాటినుండి దూరముగా ఉండు మనస్సును సంపాదించుకొందుము. అప్పుడు, తండ్రియైన దేవుని భవిష్యద్ జ్ఞానమునుబట్టి, ఆత్మవలన పరిశుద్ధత పొందినవారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తమువలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడినవారికి కృపయు సమాధానమును విస్తరిల్లును గాక (1 పేతు. 1:2) అనిన మాట మనకు ఉత్తేజముగా వర్తించును. దేవుని సహాయము మనకు విస్తరిల్లును. “విస్తరిల్లును” అనిన భావము బహు ఆశ్చర్యమైనది. దాని అర్ధము ఆయన సహాయము మన నిరీక్షణకంటెను ఆలోచనకంటెను మించి ఉండును. మాటలలో వర్ణింపలేనంతగా మనకు సంతోషము, సంతృప్తి ఉండును.

దేవుడు అసహ్యించుకొను వాటినుండి దూరమగునట్లు ఒక్కసారి మన ఆసక్తిని అభ్యాసము చేసిన పిమ్మట, దానిని విడిచిపెట్టరాదు. ఇందు నిమిత్తమై పౌలునందున్న ఆత్మ ఒక సులువైన కొలత నిచ్చెను. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి (కొలొ. 3:15). ఆయన సమాధానమును మనయందు రెండు విధములుగా ఏలుచుండ నియ్యుదము. మొదటిగా, ఆయన సమాధానముతో నిండియుండుటకు కారణమైనవాటిని మనలో నిలుపుకొనుట; రెండు, దానిని దయచేయువాటిని వెంటాడవలెను. ఆలాగు చేయుట ద్వారా దేవునికి ఇష్టమైనవాటిపై మన హృదయము నిలిచియుండును. సమాధానమును నిలుపుకొనుటకు ఒక మార్గము మన కనుగ్రహించిన సమస్త ఆనందమునకు, కృపకు మరియు సమాధానముకై ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుట. పాపసంబంధమైనవాటికి మనలను కలవరపెట్టు అవకాశము ఉండనందున అది క్రీస్తు సమాధానమును మనలో ఏలుచుండ నియ్యును. అప్పుడు, రెండు విషయములు చోటుచేసికొనును.

1. దేవునితో మన సామీప్యమును తెలిసికొందుము. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు (అపొ. 2:27). ఇది దేవుని సహాయముకై గొప్ప కారణముగా నుండును.

2. పాపసంబంధమైనవాటివలన కలవరపెట్టబడుట ఎట్లుండునో ఊహించుదుము. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు(లూకా. 15:16). దేవునికి అసహ్యమైన వాటివైపు తిరుగుటవలన కలుగు పరిణామములను ఊహించుట ద్వారా మనయెడల దేవుని ఉద్దేశము మరిఎక్కువగా మనకు స్పష్టమగును.

Posted in Telugu Library.