దేవునివలనైన ఆదరణ

శ్రమ ఆదరణవలనైన గొప్ప జీవితముకు బాటవేయును. ఏదోవిధమైన శ్రమ లేనిదే దేవుని ఆదరణ ఉండదు. ఈ ఆదరణ పొందనివాడు క్రీస్తును, క్రీస్తు దాసులను  అర్ధముచేసికొనలేడు. మనుష్యులు నానావిధములైన శ్రమలను ఎదుర్కొనినప్పుడు ఆదరణ పొందగోరుదురు. ఇది మనసుకు నియమింపబడిన ఆవశ్యకత. శ్రమలలో ఆదరణ పొందనివాడు జీవితములో నిలబడలేక విచ్ఛిన్నమగును. అందుకే మనుష్యులు తాము పొందు శ్రమలకై ఆదరణ పొందవలెనని  అనేకమైనవాటిని ఏర్పరచుకొందురు. మనుష్యులు భౌతికమైన వాటినుండి ఆదరణను పొందగోరుదురు గనుక ఆ ఆదరణ వారిని పూర్ణముగా బలపరచదు. అనగా, ఆ ఆదరణకు కార్యసాధకము ఉండకపోవును. కార్యసాధకమైన ఆదరణ కేవలము దేవునినుండి మాత్రమే కలుగును. ఎందుకనగా, అది నానావిధములైన శ్రమలను సహించుటకు బలపరచును. ఇందుకు సూచిక శ్రమపడువాడు సహింపక పాపము చేయుటయే. అవును, శ్రమలను  సహించలేనివాడు పాపము చేయును గనుక కార్యసాధకమైన ఆదరణ వానిలో ఉండదు. దేవునివలన ఆదరణ పొందుచు శ్రమను సహించువాడు పాపము చేయజాలడు. ఇందువలననే  భౌతికమైనవాటినుండి ఆదరణ పొందగోరువాడు దేవుని సంబంధికాదు. ఈ భూమిపై దేనికొరకు ఒకడు వేగిరపడునో దానిబట్టే వాడు శ్రమపొంది పాపము చేయును. కాని, దేవునిపై ఆధారపడి  జీవించువాడు శ్రమను సహించు కార్యసాధకమైన ఆదరణను కలిగియుండును గనుక వాడు క్షయమైనవాటికై వేగిరపడక తన ప్రాణమును, దేవుడు అనుగ్రహించిన సమస్తమును కాపాడుకొనును.

సేవకుడైనను కుటుంబములోని క్రైస్తవుడైనను తనవారికి ఆదరణ దయచేయు యంత్రముగా ఉండవలెను. ఇందునుబట్టియే క్రీస్తును దేవునిగాను, రక్షకునిగాను గ్రహించుచు, బయలుపరతుము. దేవునివలనైన ఆదరణ ఎంత గొప్పదనగా అది అప్పటివరకు నిలిచియున్న భారమును, నిరుత్సాహమును లేనట్టుగా చేయును. వాటి స్థానములో నెమ్మదిని దయచేయును. దీనిని కలిగినవాడు ధైర్యమును పొందును గాని భయమును సేవించడు. ఈ ధైర్యము రాబోవు శ్రమల విషయమై వివేకవంతునిగా చేయును. ఎట్లనగా, దేవుని ఆదరణవలన కలిగిన అనుభవము పాపమునుండి  తప్పించుకొనుటకు సహాయపడును. దీనికొరకు శ్రమపడినను  ఆదరణ కలుగక మానదు. ఈ ఆదరణ అనేక రూపములలో  దేవుడు మనకు దయచేయును. కొన్నిమార్లు పరిశుద్ధాత్మ ద్వారాను, కొన్నిమార్లు వాక్యములో నుండియు, కొన్నిమార్లు  మనుష్యుల ద్వారాను, మరికొన్నిమార్లు దేవుడే పరిస్థితులను తారుమారు చేయుట ద్వారాను కలిగించును. ఇట్టి మార్గములలో కలుగు ఆదరణకు శత్రువు ఉండడు. జయమే ఉండును. కావున, కోల్పోయినను కోల్పోనివారముగాను, నష్టపోవుచున్నను నష్టపోనివారముగాను, అపాయములను  ఎదుర్కొనినను అపాయము లేనివారముగాను, హింసపొందినను పొందనివారముగాను జీవింతుము. దేవునివలనైన ఆదరణ ఎల్లప్పుడును బలమైన ప్రత్యామ్నాయమును కలిగించును. దానియందున్న ఉద్దేశము మనుష్యులకు గోచరముకాదు. ప్రత్యామ్నాయము ఎల్లప్పుడు మనుష్యులు ఊహించు-దానికంటే ఘనమైనదై యుండును. ఇందువలననే క్రీస్తు జననము, మృతి, పునరుత్తానము లోకమును జయించుటకు మూలమాయెను.  ఆయనను ధరించుకున్నవాడు అనేకులకు ఆదరణకై యంత్రముగా నిలుచును. మేము శ్రమ పొందినను మీ ఆదరణకొరకును రక్షణకొరకును పొందుదుము; మేమాదరణ పొందినను మీ ఆదరణకొరకై పొందుదుము. ఆదరణ, మేముకూడ పొందుచున్నట్టి శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై యున్నది” (2 కొరి. 1:6).

క్రీస్తునందు ఉన్నవారమైతే శ్రమపొందినప్పుడు దేవునివలనైన ఆదరణకొరకు ఎదురుచూచెదము. లోకసంబంధులమైతే లోకమువలన లేక మనుష్యుల ఆలోచనలవలన ఏదైనా కలుగునా అని ఎదురుచూచెదము. చాలాసార్లు మనలను ప్రేమించి జనులు మనకు ఆదరణ కలిగించు మాటలును ఉపాయములను  పలుకుదురు. వాటిని గౌరవించుచునే దేవునిపై మన దృష్టిపెట్టినప్పుడు దేవుడు మనలనుబట్టి అతిశయించి కార్యసాధకమైన ఆదరణను మనకనుగ్రహించును. అప్పుడు శ్రమపొందిన మనము దేవుడు మనకు ఇచ్చినవారందికీ ఆదరణను రక్షణను  దయచేయువారౌదుము. దేవుని ఆదరణ మనయెడల కార్యమును సాధించినప్పుడు మనతో నున్నవారందరు ఆదరణ పొందుదురు. ఈలాగున అనేక శ్రమలను ఓపికతో సహించు శక్తిమంతులమైనప్పుడు క్రీస్తుకు  నిజమైన సాక్ష్యులుగా ఉందుము. ఏలయనగా దేవునివలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి… (1 థెస్స. 1:4). ఈ రీతిగా మనము గుర్తింపబడుదుము. ధనమైనను, విద్యయైనను, అధికారమైనను, చీకటితనమైనను మన గుర్తింపుకు కారణము కాకుండును. కావున, ఓపిక కలిగి సహించ సమర్థునిగా దేవునిచే నిర్మింపబడినవాడు ఎవరు లోకసంబంధులో ఎవరు క్రీస్తు సంబంధులో యెరుగ సమర్ధుడు. ఇందుకొరకై వాడు ఏర్పరచబడి, దేవునిచే నిత్యము ప్రేమింపబడుచు ఆయనవలన కలుగు కార్యసాధకమైన ఆదరణబట్టి జీవించును. అప్పుడు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ నిలుచును.

మనలో అనేకమంది చాలాసార్లు దేవునివలన కలుగు ఆదరణకు చోటియ్యము. అంటే, శరీర ప్రేరణవలన తొందరపడి నెమ్మదికొరకు పరుగెత్తెదము. ముఖ్యముగా శ్రమయందును లేక అవసరతయందును ఉందుము గనుక ఆలోచనలో బలహీనులుగా ఉందుము. అట్టి సమయములలో దేవునివలనైన ఆదరణకొరకు ఎదురుచూచుట కష్టతరమై యుండును. ఆ సమయములలో మనుష్యులు కూడ లోతులేని మాటలు మన శాంతికొరకు పలుకుదురు. అయితే, అప్పుడు కూడ దేవునిపైనే మనస్సు పెట్టుటకు గొప్ప విశ్వాసము కావలెను. విశ్వాసము ఆయనను సంతోషపెట్టునదై యుండి ఆయనతో సంభాషించునదిగా ఉండవలెను. అప్పుడు శ్రమలో కూడ మొదటిగా మహా దేవుడే జ్ఞాపకముండును. ఇందువలననే పౌలు, అపొస్తలులు, ప్రవక్తలు, రాజులు, లేవీయులు, హెబ్రీయులు భక్తులైరి. ఇట్టివారిని మనకాలములో చూచినచో భాగ్యముగా ఎంచవచ్చును. మితిమీరిన తత్త్వజ్ఞానమును లేక హేతువాదమును ఆలింగనము చేసికొనువారే  ఈదినములలో తరచుగా కనబడుచున్నారు. ఇంకా, క్రీస్తుకు సాక్ష్యులుగా బ్రతకాలనే కాంక్షలేనివారు ఉన్నత పదవులను ధరించుట చూచుచున్నాము. ఇట్టివారందరినిబట్టి ప్రజలు ఆదరణ పొందుట ఏట్లో ఎరుగకుండిరి. విశ్వాసము పల్చబడునప్పుడు ఆదరణ కొదువగును గనుక పాపము విస్తరించును. ఆదరణ పొందుటకు ఒక మంచి సూత్రము ఈ వాక్యము నుండి పొందవచ్చును. కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు  ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి(1 పేతు. 1:13).

మనము క్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుటలో మనస్సు అను నడుముకట్టుకొనినవారమైతే శ్రమలలో ఆదరణకొరకు దేవునివైపు చూచుట కష్టతరము కాకుండును. ఆలోచన చేయుడి. క్రీస్తు రెండవ రాకడ ఎప్పుడో తెలియక దినములు, వారములు, ఇంకా సంవత్సరములు అయన ప్రత్యక్షమగునప్పుడు కలుగు కృపకొరకు కనిపెట్టువారమైనప్పుడు దేవునివలనైన ఆదరణకొరకు కనిపెట్టుట చిన్న సంగతే. ఆ నిరీక్షణ ముందర ఈ నిరీక్షణ చిన్నదే కదా. అయినను, దేవునివలనైన ఆదరణ పొందలేక జనులు, పాలకులు, సేవకులు పాపము వెంబడి పాపము చేయుచున్నారంటే ఏమిటి అర్ధము? వారి క్రైస్తవ్యము విశ్వాస సంబంధమైనది కాక మనుష్యుల బోధ సంబంధమై యున్నది. శరీరమునుబట్టి ప్రసిద్ధి నొందినవారి అంగీకారముచేత  నడుచుకొనువారు దేవునివలనైన ఆదరణ పొందగలరా? కనుకనే అనేకమంది జీవితములో శ్రమలవలన వేదన మిగిలియున్నది. వీటినుండి తప్పిచుకొనుటకు వారు ఆశ్రయించుచున్నవి వారిని ఇంకను గొప్ప వేదనకు గురిచేయుచున్నవి. అయ్యో ఎంత బాధ! క్రీస్తును  ఎరిగియున్నామని చెప్పి శరీరమునుబట్టి ప్రసిద్ధి నొందిన మనుష్యులను వెంబడించుట ఎక్కడి న్యాయము? అయితే, దేవునివలనైన ఆదరణ మనకును మనకు ఇయ్యబడినవారికిని శాంతి నిచ్చును. మీరు క్రీస్తుకు నిజముగా సాక్ష్యులై  ఉండదలచిన యెడల, శరీరానుసారముగా ప్రసిద్ధినొంది మిమ్మును దేవుని ఆదరణకు దూరము చేయుచున్నవారిని కనుగొనుట  సాధ్యమే. దేవుని వాక్యమే మీరు ఆలాగు చేయవలెనని కోరుచున్నది. అయ్యో వారికి శ్రమ. వారు కయీను  నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పుత్రోవలో ఆతురముగా పరుగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి(యూదా 1:11).

సహోదరుడ నబడినవాడైనను, సహోదరియైనను, సేవడుకు అనబడినవాడైనను, అధికారియైనను వారి నడతను మనము యేసుక్రీస్తు కొరకు కలిగిన నిబ్బరమైన బుద్ధితో గమనించినప్పుడు విశదమౌదురు. ఇట్లు చేయుట మనలను, మనతోనున్నవారిని కాపాడుకొనుటగును. మంచివారెప్పుడు ప్రమాదకరము కాదు. శరీరానుసారముగా ఆదరణ పొందువారే బహు ప్రమాదకరము. ఎందుకనగా వారు ఆదరణ పొందు ప్రతిసారి దేవుని నామమును ఉపయోగించుచు ప్రజలను మోసము చేయుదురు. ఈ మోసములో చిక్కుకొను ప్రతివాడును దేవునికిని ఆయన ఆదరణకును దూరమౌదురు. మోసము చేయువారు “…తాము చేయుచున్న నరహత్యలును మాయమంత్రములను జారచోరత్వములును చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు (ప్రక. 9:21). అసలు సంగతి ఏమనగా క్రీస్తుకొరకు వారి మనస్సు మారలేదు. అయితే, వారు బాప్తిస్మము పొందియుండవచ్చును. అందుకే మోసము చేయుచు, అట్లు  చేయుచున్నారనే భీతి లేకుండా తిరుగుచున్నారు. శరీరానుసారముగా జీవించుటలో వారు ఆరితేరిరి గనుక బాప్తిస్మమును కూడ ఆలాగుననే పొందిరి. కాని, వారి పాపము నిలిచియున్నందున వారు విశదమగుచుండిరి. క్రీస్తు విషయమై శ్రమ పొందుచున్నవారు పాపము చేయకుండుటకును, దేవునివలన ఆదరణ పొంది జీవించుటకును శ్రమ పొందుచున్నారని వారెరుగరు. ఈ సంగతి మారుమనస్సు వలనైన శక్తి ద్వారానే అర్ధమగును. వారైతే పాపములు చేయుచు, వాటివలన  శ్రమ పొందుచు, శ్రమకు ఆదరణను ఏర్పరచుకొనుచు, దేవుని వారమని చెప్పుకొనుచు, జనులను మోసము చేయుచు జీవించుచుండిరి. వారి మోసము మనలను లోకమువైపు తిరుగుమని బలవంతము చేయును. ఇట్టివారికి బేషరతుగా దూరమై జీవించితిమా బ్రతుకుదుము. సహోదరులారా, సున్నతి పొందవలెనని  నేనింకను ప్రకటించుచున్నయెడల ఇప్పటికిని  హింసింపబడనేల? ఆ పక్షమున సిలువ విషయమైన అభ్యంతరము తీసివేయబడునుగదా? (గల. 5:11).

వారికి దూరముగా జీవించుటవలన బ్రతుకుదుము, ఎట్లనగా శ్రమనుబట్టి పొందు దేవుని ఆదరణ ద్వారా బ్రతుకుదుము. మోసము చేయువారిని, వారు  ప్రకటించునవి అనుసరించినయెడల హింస ఉండదు. అయితే, సిలువ విషయమైన అభ్యంతరము ఉండును. సిలువ విషయమై అభ్యంతరము ఉన్నచోట సిలువ కొరకైన శ్రమ ఉండదు గనుక దేవునివలనైన ఆదరణ కూడ ఉండదు. దేవునివలన ఆదరణ పొందక ప్రకటింపబడు సువార్తయైనను, చేయు  క్రియలైనను  సిలువకు అభ్యంతరములను సృష్టించును. వాటిలో ప్రతిఒక్కటి లోకసంబంధముగా నడుచుటకు బాట వేయును. శరీరానుసారముగా ఆదరణను పొందుచున్నప్పుడు సిలువను గూర్చిన సువార్త యొక్క లోతును ఔన్నత్యమును అగత్యమును వ్యర్ధపరచుదుము. మన లేమి, కష్టము, నష్టము, అవమానము, నిందలు మొదలగునవి దేవుని ఆదరణవలన చెదరగొట్టబడినప్పుడే సువార్త యొక్క ఉద్దేశము మనయందు సంపూర్ణమగును. ఇట్టి జీవితము అనేకులకు ఆదరణ నిచ్చును. దేవునివలనైన జనులను గూర్చి ఇట్లు చెప్పబడెను. ప్రతివిషయమందు అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను (రోమా. 3:2).

Posted in 2020, Telugu Library.