అద్భుత లాభములు

క్రైస్తవులమై నందుకు ఆశ్చర్య లాభములున్నవి. నీవెపుడైన వాటిని ఆలోచించితివా లేక లెక్కించితివా? చాలామార్లు విశ్వాసులు సాధారణమైన లాభములతోను నలిగిన ఆలోచనలతోను తమ జీవితమును కొనసాగించుదురు. వాటిలో బహుగా చిక్కుకున్నవారై వారు  క్రీస్తువలె ఉండుటవలన కలుగు నిజమైన లాభములను తెలిసికొనరు. క్రైస్తవునిగా జీవించుటనగా క్రీస్తువలె జీవించుట మరియు దానికి అద్భుతమైన లాభములుండును. వాటిని వెదకుట మొదలుపెట్టినపుడు మనకు తరచుగా సమాధానములు దొరకును. ఏలయనగా పరలోక దేవుడు వాటిని కనుగొనునట్లు దయచేయును. ఆయన వాక్యము ద్వారాను ఆత్మద్వారాను జ్ఞానముతో, ఆసక్తితో, శక్తితో మనలను సన్నద్దులుగా చేయును. మనము కనుగొను సమాధానములను బట్టి క్రీస్తునందు దేవుడు కోరిన పరిపక్వతకు చేరుదుము. తాను దయచేసిన లాభములను వెదకి, పొందుటకు ఎవరికి ఏ సమయమందు లోతైన ఆశ ఉన్నదోనని దేవుడు పైనుండి పరిశీలించును. అపొస్తలుడైన పౌలు ఆత్మయందు గతకాలమునకు చెందినవారిని జ్ఞాపకము చేసికొని ఈలాగు పలికెను. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతివలన ప్రయోజనమేమి?” (రోమా. 3:1).

క్రైస్తవులుగా ఎటువంటి లాభములను కలిగియున్నామో అని మనము కూడ ప్రశ్నించుకొనవలెను. యూదుడు సున్నతివలన తెలియబడి లాభమును కలిగియునపుడు, దేవుని మూలముగా మరల జన్మించిన మనకు కూడ లాభములుండును. వారు దేవోక్తులు పొంది ఆయన చిత్తమును, ఉద్దేశమును జరిగించిరి. కావున, వారాయన నుండి విస్తారముగా కనికరములను, దయను, క్రియలను మరియు దీవెనలను పొందిరి. ఆత్మ మూలముగా జన్మించుట యూదునిగా జీవించుట కంటె గొప్పదైనది గనుక, దానికున్న లాభములు కూడ శ్రేష్టమైనవి. క్రైస్తవులముగా మనము నీతి గాను, పరిశుద్ధము గాను జీవించుటకు అనేకమైనవాటిని ఆలోచన చేయవలసినవారము. అయితే మేలుకరమైనదేమనగా, దేవునితో అన్యోన్యతవలన అవన్నియు పరిశుద్ధాత్ముని చేత మనకు జ్ఞాపకము చేయబడును. మనమట్టుకైతే, జ్ఞాపకము చేయబడుచున్న వాటినిబట్టి క్రైస్తవునిగా జీవించుటకున్న లాభములను మనస్సునందు గలవారమై యుండవలెను.

  1. దేవునికి సమీపులము. ఆయన కృపాసింహాసనముకు ఇదివరకటి కంటె సమీపముగా ఉంటిమి. అట్టి అవకాశమును ఆయన మనకు అనుగ్రహించును. ఆయన మనతో నిత్యము ఉండునట్లును, ఆయన కోరినవి మనలోనికి ప్రవేశించునట్లును తన ఆత్మను మనకు ఇచ్చును. శత్రువు ఆయనను తప్పించుకొని మనలోనికి ప్రవిశించుట వీలుపడదు. పాపము మనలో ప్రత్యక్షమగుటకు భయపడును. మరియు మనలో ప్రకాశించు వెలుగు పాప క్రియలను సహజముగానే అడ్డగించును. కాబట్టి, పౌలు ఈలాగనెను. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసికొనక దేవుని యొక్క ఆత్మవలన ఆరాధించుచు, క్రీస్తుయేసు నందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము (ఫిలి. 3:3). శరీరమునందు నమ్మిక యుంచకపోవుటవలన పాపమునకు కలుగు ఓటమి దేవునితో మనకున్న సమీపమును ప్రతిబింబించును. ఇప్పుడు, మనము కోరిన దేదైనను మనకు కలుగును; మనలో ప్రతి ఆలోచన వ్యర్ధము కాకపోవును; మనము చేయు ప్రతి పని నిరర్ధకము కానేరదు. క్రీస్తునందు ఘనపరచబడుటను ఎంచినంత కాలము, అనగా ఆయన చిత్తము చేయుటకును ఆత్మయందు ఆరాధించుటకును ప్రయాసపడు నంతవరకు, శరీరమునకు ప్రాముఖ్యత నియ్యకుందుము. కాబట్టి, మనము సృజింపబడిన విధముగానే నిలిచియుందుము – అనగా నిజమైన సున్నతి.
  2. భవిష్యత్తును తెలిసికొను సామర్ధ్యము. దేవునితో మన సమీపము రాబోవు సంగతులను తెలిసికొనునట్లు చేయును. సర్వజ్ఞుడైన దేవునిచే తెలియపరచబడినపుడే గాని, ఎవడును ముందుగా తెలిసికొనలేడు. ప్రభువైన యేసుక్రీస్తు రాకడను గూర్చి మాత్రమే మనము ముందుగా తెలిసికొనుట వీలుపడదు. మన జీవితమును గూర్చి, మనయెడల దేవుని చిత్తమును గూర్చిన సంగతుల విషయమైతే, ఆయన పిల్లలమనిన ఆధిక్యత నిలిచిపోవలెను గనుక, వాటిని మనము ఎరుగునట్లు ఆయన దయచేయును. ఆయన పిల్లలుగా ఒక్కసారి మనలను పిలిచిన తరువాత మన పట్ల తన ఆలోచనలను మంచితనమును మనకు తెలియపరచుటకు ఆయన తన్నుతాను నిలువరించుకొనడు. ఈ విషయమై నొవహు మనకు ఉదాహరణగా నిలిచెను. విశ్వాసమునుబట్టి నొవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను; అందువలన అతడు లోకము మీద నెరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను” (హెబ్రీ. 11:7). తనను పిలిచినవాని బట్టి అతడు రాబోవువాటిని చూచెను. కనబడనివాటిని తెలిసికొనుట ద్వారా లోకసంబంధమైన దుష్టత్వమును మరియు దాని పరిణామములను తప్పించుకొనుట సులువగును.
  3. నిర్దిష్టమైన పాత్రను కలిగియుండుట. దేవుడు దయచేయు ఆజ్ఞవలన దీనిని గ్రహించెదము. ఆయన కొరకు మనమెట్టివారమై యుండవలెనో ఆయన ఉపదేశించును. పౌలును గూర్చి మాటలాడితే, తనయెడల దేవుడు కలిగియున్న ఆలోచనను ఎరుగుటకు అతడు ఆధిక్యతను కలిగియుండెను. అది అతనికి క్రైస్తవునిగా ఉండుటవలననే కలిగెను. అతడు ఈలాగు చెప్పెను – మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణయైన క్రీస్తుయేసు యొక్కయు ఆజ్ఞ ప్రకారము క్రీస్తుయేసు యొక్క అపొస్తలుడైన పౌలు (1 తిమో. 1:1). ఒక నిర్దిష్టమైన పాత్రను కలిగియుండుటకైన అతని పిలుపు కొట్టివేయబడలేని సూత్రము కలిగియున్నది. అది అందరికి వర్తించును. ఆ సూత్రమేమనగా, మనకొరకు తాను నియమించిన దానికై మనము బ్రదుకునట్లు దేవుడు ఆజ్ఞాపించును. ప్రతి విశ్వాసి ఒక నిర్దిష్టమైన పాత్రను పోషించుటకు దేవునిచే పిలువబడును. లేనియెడల, రక్షింపబడిన పిమ్మట భూమిపై బ్రదుకుటను కొనసాగించుట అవసరములేదు.
  4. ఆత్మసంబంధమైన ఆశీర్వాదములు. పై చెప్పబడిన మూడు సంగతులు మనకు వర్తించునపుడు విస్తారమైన ఆత్మసంబంధమైన ఆశీర్వాదములు మనలోనికి ప్రవహించును. దీనిని బట్టి ఈలాగు వ్రాయబడెను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను (ఎఫె. 1:3). క్రీస్తుయేసు నందు మనము ఉత్సహించుచున్నామనుటకు ఆత్మసంబంధమైన ఆశీర్వాదములు సూచన. అన్నిటి కంటె క్రీస్తును తెలిసికొనుటకు ఎక్కువ మక్కువ చూపుచున్నామని అవి సూచించును. పరిస్థితులు ఏవిధముగా ఉన్నను శరీరమునందు నమ్మికకు అవకాశ మియ్యకుంటిమి. ఈ కారణమువలననే తనకు లాభముగా నున్న అన్నిటిని పౌలు నష్టముగా ఎంచుకొనగలిగెను. ఆత్మసంబంధమైన ఆశీర్వాదములు కేవలము ఆత్మవరములు కాక, దేవుని సహాయములు, సహకారము మరియు క్లిష్ట సమయములలో ఆత్మ యొక్క నడిపింపై యుండును.
  5. బలమైన ఆధారములు. ప్రభువును గూర్చి మాటలాడుటవలన మనము కనుపరచు ఆధారములు అనేకులను ఆశ్చర్యపరచును. ప్రభువు కూడ మన మాటలకు రుజువు లిచ్చును. ఈ ఆధారములు మన విశ్వాసముకు బలమైన సహాయముగా ఉండుటయే గాక, ప్రభువును ఇంకను తెలిసికొనవలసిన వారికి మార్గదర్శకముగా ఉండును. అంతట ఆ అధిపతి జరిగినదానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను (అపొ. 13:12). ఆధారములు ప్రభువు యొక్క కార్యములు. ప్రభువు మనలను నిలిపిన ప్రతి స్థితిలోనుండి మనమాయనను ఇతరులకు  తెలియజేయవలెనని కోరును. తనకు మేలుకలుగునట్లు పరిస్థితిని ప్రభావితము చేయునట్లుగా మనలను నడిపించి, తిరిగి మనకు మేలు చేయును. చివరికి మనము ఎల్లప్పుడు మేలు పొందెదము.
  6. అధికమైన ఘనత. ప్రభువు మనకిచ్చిన దానికి ఇంకను దయచేయును; ఆయన ఆశీర్వాదములకు ఆశీర్వాదములను జోడించును. ఇందువలన సాధారణముగానే మనము అంతరించిపోని గొప్ప మర్యాదను కీర్తిని సంపాదింతుము. వీని యొద్దనుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను (లూకా. 19:24). ఆత్మ మనకు జ్ఞాపకము చేయు వాటన్నిటిని గైకొనినయెడల ఆయన మనకు అప్పగించిన దానిని వృద్ధి చేయుదుము. అది మనము ఫలించు ఫలమును బట్టి తెలియును, మరియు దానికి బహుమానము లుండును. అప్పుడు, మనము ఇప్పటికే కలిగియున్నదానికి అధికముగా దయచేయుటకు ఆయన కేవలము సంతోషించును. ఆయన ఏది దయచేసినను, అది ఆయనతో మన సహవాసమును సంబంధమును ఘనపరచును. ఆయన దయ యొక్క పొడవును, ఎత్తును, వెడల్పును మరియు లోతును ఎరుగుదుము.
Posted in Telugu Library.