ఓటమి చూడనివారు

హాద్రాకు దేశమునుగూర్చియు దమస్కు పట్టణమునుగూర్చియు వచ్చిన దేవోక్తి. ఏలయనగా యెహోవా సర్వ నరులను  ఇశ్రాయేలీయుల గోత్రపువారినందరిని లక్ష్యపెట్టువాడు గనుక…(జెక. 9:1). ఈ వాక్యమును ఈలాగు చదువుటకును  ఆదిమ భాషలో ఉన్నట్టుగా చదువుటకును ఎంతో భేదమున్నది. ఇందువలన చదువరులపై పడు ప్రభావము అధికముగానే ఉండును. ఎట్లనగా మనుష్యులలో నుండిన ప్రవర్తనకు యెహోవా ఇచ్చు స్పందన ఇక్కడ సందర్భములో ప్రజలు గమనింపకుందురు. అది తర్జుమాలో మరుగయ్యెను. ఆదిమ భాషలో ఈలాగు ఉండెను. హాద్రాకు  మీదకు దాని విశ్రాంతి స్థలమగు దమస్కు పట్టణముమీదకు వచ్చిన దేవోక్తి. ఏలయనగా సర్వ నరులయొక్కయు, ముఖ్యముగా ఇశ్రాయేలీయుల గోత్రపువారందరి నేత్రములు యెహోవా తట్టు ఉండెను గనుక…” తర్జుమాలో ఇట్టి ఉద్దేశము లోపించుటకు ఒకటి లేదా రెండు లౌకిక కారణములు ఉన్నందున ప్రజలు ఈ వాక్యములోని భావమును వేరే కోణములో గ్రహించుట జరుగును. అయితే, ఈ వాక్యము యొక్క ముఖ్య ఉద్దేశము శత్రువులనుండి  మనము  దేవునిచే  ఎప్పుడు కాపాడబడుదుమో చెప్పుచున్నది. లేక, ఇశ్రాయేలీయుల గోత్రము వారందరును మరియు జనులును వారిని వారి శత్రువులనుండి దేవుడు ఎప్పుడు కాపాడదలచెనో చెప్పెను.

నిజమే కదా, దేవుడు ఎప్పుడు మన పక్షముగా పనిచేయును? ఆయన వాత్సల్యము ఎప్పుడు మనకు ఉండును? ఈ ప్రశ్నలను క్రైస్తవులమైన మనము ఆలోచన చేయవలసినవారము. ప్రస్తుత దినముల పరిస్థితులలో వీటిని ఆలోచన చేయు సమయముగాని ఉద్దేశము గాని మనలో అనేకమందికి లేదనుటకు వెనుకాడ నవసరములేదు. చాలామంది అక్షరానుసారముగానే దేవుని సేవించుచున్నారు. అక్షరమును బట్టే ఆయనను ఆరాధించుచున్నారు. అవసరమును బట్టే ఆయన యొద్దకు వెళ్లుచున్నారు. వారి ఆశలను, ఊహలను ఉద్దేశములను నెరవేర్చుకొనుటకు ఆయన పక్షమున  చేరుచున్నారు. దేవుడు ఆయన కొరకు వారిపై ఉంచని భారమును వారు ఎంచుకొని ప్రయాస పడుచున్నారు. ఇందువలన శరీరతత్వములోని అనేకమైన చెడ్డవి వారిలో నిత్యము కనబడును. వారు గ్రహింపకయే సాతానుబట్టి శత్రువులను, ప్రతికూలమైన పరిస్థితులను పోగుచేసికొనుచున్నారు. దేవుడు కూడ వారి విషయమై వారి పరిస్థితుల విషయమై మౌనముగా ఉన్నాడు. ఏలయనగా వారు చిక్కుకున్న వాటినుండి బయటపడకున్నారు. అవి సాతాను సంబంధమైనవైనను శరీరమునుబట్టి  కలిగినవైనను లేక లోకసంబంధమైనవైనను వారు బయటకు రాలేకున్నారు. వాటిలోనే జీవించుచు పైకి దేవుని ప్రజలుగా జీవించు వేషమును వేయవలెనన్న భారమును కలిగి యున్నారు. యెహోవా నుండి వచ్చు దేవోక్తి బహు గొప్పది. అది ఆయనను ఆశ్రయించినవారికి, ఆయనతో నిరంతరము నడుచువారికి మేలు చేయ నూరకుండదు. అది వారిని  నిత్యము కాపాడును. ఎట్లనగా వారి నానావిధములైన శ్రమలలో ఓర్పువలనైన శక్తి నిచ్చుచు, విశ్వాసముబట్టి నిరీక్షించు కనులను జయముకై దయచేయుచు, ఆత్మవలనైన ధైర్యము నిచ్చుచు,  నిరాశలను తొలగించి అనుదిన సంతృప్తిని ఆనందమును కలుగజేయుచు, రాబోవు దినములలో ఆయనకొరకు చేయువాటికై సామర్ధ్యమును కూర్చుచు, బలహీనపరచగల మనుష్యుల మాటలను క్రియలను  తప్పించుకొను  మార్గముల నిచ్చుచు, వేషధారుల భక్తిలోని సారముకు గ్రహింపు నిచ్చుచు, దేవుడు చేయు గొప్ప కార్యములకై  మాత్రమే కనిపెట్టు హృదయము నిచ్చి వారిని కాపాడును. ఇట్టి దేవోక్తిని కలిగియుండని జనులు చిక్కులలో తమ్మునుతాము పడవేసికొనుచున్నారు. శత్రువు ఎంతటివాడైనను, లేక, సాతానువలన పరిస్థితి ఎంత గొప్పదైనను దేవోక్తి దేవుని ప్రజలను కాపాడక మానదు. బహు ప్రత్యేకమైన సమయములోను, గొప్ప అవసరతనుబట్టి అది దేహమును మాత్రమే కాపాడకుండును.

పాపము నుండి, సమస్యల నుండి, శత్రువు చేతిలోనుండి విడుదల పొందదలచిన యెడల మన నేత్రములు యెహోవా తట్టు ఉండవలెను. ఇది అల్పముగా ఉండరాదు. అప్పుడు ఎంతటివారు మనపై యుద్ధము చేసినను మన ఎదుట నిలువలేరు. అసలు పడిపోవుటకే వారు మనపై యుద్ధము చేయుటకు పూనుకొనెను. సాతాను దేవునికి విరోధి యగుటవలనే కదా నాశనముకు నిర్ణయింపబడెను. అటువలెనే మనపై యుద్ధము చేయువారు కూడ పడిపోవుటకే  నిర్ణయింపబడిరి. ఇది యెహోవా చిత్తము. ఆయన మహిమను ఈ రీతిగా మనవలన పొందగోరెను. మనపై యుద్ధము చేయువారు మనలోని ఆయన తత్వమును అంగీకరింపలేనందున యుద్ధము చయుచున్నారు. ఆయన వారికి తన మహిమను చూపించును.  ఇందుమూలముగా కొందరిని రక్షించి కొందరిని శిక్షించును. ఇశ్రాయేలీయులు దేవుని పిల్లలని, అందువలన మనుష్యులందరిలో వారు ఎన్నిక చేయబడినవారని, బహు శక్తిమంతుడైన దేవుడు వారితో ఉండెనని ఎరిగిన దేశములన్నియు వారికి వెంటనే విరోధులైరి. అయితే వారందరు మొదటినుండి దేవుని లక్ష్యపెట్టనివారు; దేవుని జనులను చంప నుద్దేశించిరి. కొన్ని సందర్భములలో వారిని చంపితే వారి దేవుడను, ఆయన విధానములను నిర్మూలము చేయవచ్చునని వారి తత్వము వారికి బోధించెను. కాని, ఇశ్రాయేలు దేవుని నమ్మెను గనుక యుద్ధములు చేసినను, శ్రమ పొందినను ఓటమిని చూడకుండిరి. ఎప్పుడైతే ఇశ్రాయేలు అతిశయించెనో, అన్యదేశములు తమ శరీరస్వభావముతో వారిని పట్టగలిగెనో అప్పుడు ఇశ్రాయేలును అన్యులు జయించిరి. దేవుడు కూడ ఇశ్రాయేలును కాపాడలేదు. అయితే, ఈ ఇశ్రాయేలు కూడ తమ పితరుల భక్తిని అనుసరింపనివారై దేవుని కన్నా లోకమును ప్రేమించిరి. దేవుడు వారిని శిక్షించి, జల్లించి, ప్రవక్తల బోధను హత్తుకొనువారిని ఏర్పరచుకొనినందున ఈరోజు మన మూలవాక్యమును చదువుచున్నాము. యెహోవా తట్టు మన నేత్రములను త్రిప్పుట ఎల్లప్పుడును లాభమే. అంతేగాక తనవారిని ఆయన ఎరుగును గనుక వారి బలహీనతను అవిధేయతను కూడ ఆయన ఎరుగును. తగిన కాలమున వారిని క్రమపరచి తన నామఘనతకు నడిపించును. ప్రభువు పేతురుతో ఇట్లనెను. నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను”  (లూకా. 22:32).

నిరంతరము పాపమందు నుండువారికి దేవునివలనైన విడుదల ఉండదు. పస్చాత్తాపము లేకుండ శరీరతత్వమును బట్టి కొనసాగువారికై ప్రభువు విజ్ఞాపన చేయడు. దేవుడు ఎరిగినవాడు నిత్యము నీతిమంతునిగా ఉండలేడు. కాని, గొప్ప పనికై వాడు తిరిగి లేపబడును. తప్పిదమునందు కూడ అతని విశ్వాసము అతనియందు పనిచేయును. ఏలయనగా ప్రభువు అతని కొరకు వేడుకొనెను. కావున, అతడు నిరంతరము పాపమునందు కాని, బహుకాలమందు  పస్చాచాత్తాపము లేకుండ గాని ఉండనేరడు. అట్టివానికి క్షమాపణవలన  స్వేచ్ఛయే గాని శిక్షవలన విడుదల ఉండదు. కావున, అతని శత్రువులు అతనిపై అధికారము చేయలేరు. సాతాను పాపముతో వాని బంధించలేడు. యుద్ధకాలమున అతడు అజేయుడై యుండును. అతని ద్వారా దేవుడు తన మహిమను జనులకు చాటును. వాడు దేవోక్తిని గ్రహించు స్వభావమును  కనుపరచను. వీరు థెస్సలొనీకలో ఉన్నవారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలు సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి (అపొ. 17:11). దేవోక్తిని  పొందగోరువారు ఆసక్తితో వాక్యము నంగీకరించి అనుదినమును  లేఖనమును పరిశోధింతురు. వాక్యమును ప్రకటించువారే శరీరసంబంధులైనప్పుడు  వినువారు  యెట్లు  ఘనులౌదురు? బుద్ధిబలముతో ప్రకటించువారు కొందరైతే, ధనముతో మాత్రమే ప్రకటించువారు అనేకులు. దేవోక్తి కలిగి ప్రకటించువారు ఎందరు? బుద్ధిబలము, ధనము మనుష్యులకు తమ శరీర బలహీనతను, పాపస్వభావమును జ్ఞాపకము చేయుచు వారిని ఆకర్షించును. వాటిలో దేవోక్తి గాని, జ్ఞానమను దేవుని వాక్యముగాని ఉండదు. వాటివలన తృప్తి పొందగోరువారు తమ శరీరమును సహితము తృప్తిపరచుకొనలేరు. వారు నిరంతరము తమ స్వభావముకు బానిసలై యుందురు. కావున, వారి కన్నులను యెహోవా తట్టు త్రిప్పరు. పైకి భక్తిపరులుగా కనబడు వారి ప్రయాసలో అలసిపోవుదురు. బాహాటముగానైనను రహస్యముగానైనను అవిధేయతలో జీవించువారు దేవోక్తిని గ్రహింపగలరా? దేవోక్తుల యెడల ఆసక్తి చూపుటకు వారికి ధైర్యము ఉండునా? యెహోవా తట్టు తమ కన్నులను త్రిప్పువారు  దేవోక్తిని గ్రహించ దలచినవారు. ధనమునుబట్టి, బుద్ధిబలమునుబట్టి, అధికారమును బట్టి, శరీర స్వేచ్ఛనుబట్టి  విశ్వాసమును ఏర్పరచుకొనువారు ఉండిరిగాని దేవునివైపు తమ నేత్రములు త్రిప్పి విశ్వాసమును కట్టుకొనువారు  అరుదుగా ఉండిరి. అందుకే దేవుని జ్ఞానమును వరముగా పొందిన భక్తుడైన పౌలు  ఇట్లనెను – మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే (ఎఫె. 2:8).

మన విశ్వాసము ఈలోకసంబంధమైనవాటికొరకు పనిచేయునదైతే మనమింకను పాపమునుండి, సాతానునుండి విడుదల పొందలేదు. ఇందులో లెక్కకుమించినవారు ఉండిరి. కాని, మన విశ్వాసము కృపకు ఆశ్రయమైతే ఆత్మ విషయములో మాత్రమే గాక ప్రతి విషయమునుండి విడుదల పొందితిమి. ఏలయనగా కృపచేత రక్షింపబడినవాడు కృపవలన, కృప కొరకును, కృప నిమిత్తము జీవించును. అట్టివానికి సమస్తము కృపవలన కలుగును. అనగా, వరముగా కలుగును. వరమునందు భయముండదు; అది మనుష్యులకు జవాబుదారు కాదు. దానియందు దుఃఖమును బానిసత్వమును ఉండవు. అది ఉచ్ఛితముగా కలుగును గనుక దానియందు దేవునివలనైన స్వేచ్ఛ అధికముగా ఉండును. వాని కన్నులు యెహోవా తట్టు ఉండిన చాలును. దేవుడు దయచేయదలచిన సమస్తమును  పొందువరకు  వాడు బ్రతుకును. అంతేగాక వాని రక్షణ ఫలము విస్తరించునట్లు ఊహించని గొప్పవాటిని పొందును.  యెహోవా తట్టు తన నేత్రములను ఉంచనివానికి ఏమి లభించును? అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై, తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభవువలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు (యాకో. 1:8). కావున, వాడు తన శక్తిసామర్ధ్యములను ఆధారముగా చేసికొని మనుష్యులవలనను లోకమునుండియు పొందుటకు తలంచును. ఇట్టివాడు దేవోక్తిని ఆధారముగా చేసికొనడు; [ఆధారము చేసికొనినయెడల వాని మార్గములను సరిచేసికొనును]. ఇట్టివారు ద్విమనస్కులౌదురు. ఎందుకనగా, వారు దేవునిపై మాత్రమే ఆధారపడి జీవించరు; వారి జ్ఞానమును దేవోక్తికి ముడిపెట్టుదురు. దేవుని సేవ చేయుటను వారి కోరికలకు కారణముగా చూపెదరు. ఇట్టి ధోరణి అస్థిరత్వముకే  కారణమగును.

శరీరరీతిగా అర్ధమగు సేవకుడైనను, విశ్వాసియైనను దేవుని పక్షముగా నున్నవారు కారు. మనలను ఎవడైనను శరీరానుసారముగా గుర్తించుచున్నచో సత్యమును గూర్చిన ఛాయైనను  మనలో లేదు. అన్యులు సహితము తమ విధానములనుబట్టి మనలను గుర్తించకూడదు. అప్పుడు దేవుడు మన పక్షమున నిరాక్షేపముగా నుండును; ఆయన వాత్సల్యము మనతో నిలుచును. ఇట్లు జరుగవలెనని పౌలు ఈలాగు అనెను. కావున ఇకమీదట మేము శరీరరీతిగా  ఎవనినైనను ఎరుగము; మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగియుండినను ఇకమీదట ఆయనను ఆలాగు  ఎరుగము (2 కొరి. 5:16). ఎవడైనను శరీరమందు అతిశయించుచున్నయెడల వాడు గుర్తింపబడడు. శరీరమందు ఒకడు కలిగియున్నవాటిని బట్టి తన్నుతాను ప్రచురపరచుకొనుచున్న యెడల వాడు గుర్తింపబడడు. ఐతే కొందరు మనుష్యులు అట్టివారిని తమ స్వార్ధముకై గుర్తించవచ్చును. కానీ, క్రీస్తు విషయమై, సువార్త విషయమై దేశమందు వారు మంచి సాక్ష్యము లేనివారై యుందురు. ఇదే పౌలు ఉద్దేశము. ఏలయనగా, క్రీస్తును కూడ శరీరమందు  జీవించినవానిగా ఎరిగినను ఆయన భూమిపై దేవునికొరకు జీవించిన జీవితమును బట్టి ఇకమీదట ఆయనను ఎరుగుదము. ఇందువలన దేవుని కొరకు జీవించుటపై, అనగా మన నేత్రములు ఆయన తట్టు త్రిప్పుటపై దృష్టి పెట్టుదుము గాని శరీరరీతిగా  జీవించుటయందు  కాదు. ఇప్పుడు మన విశ్వాసము కృపవలన ఫలించును గనుక ప్రతివిషయములోను అభివృద్ధి చెందెదము.

భూసంబంధమైన వాటినుండి, శరీరసంబంధమైన వాటినుండి విడుదల పొందని జీవితము ఎవరికి ప్రయోజనకరము? మన మనసులు నిత్యము దేవుని గూర్చియు ఆయనను సంతోషపెట్టుటను గూర్చియు ఆలోచన చేయనియెడల ఏమి లాభము పొందెదము? నీ శరీరమును తృప్తిపరచుకొనుటయే నీ ప్రథమ లక్ష్యమైనప్పుడు, మనుష్యుల కొరకు నీ జీవితమును కట్టుకొనుచున్నప్పుడు, నీ విశ్వాసము జ్ఞానము శరీరానుసారులవలన ప్రభావితమైనప్పుడు నీవు క్రీస్తు కొరకు మంచి సాక్ష్యమును ఎట్లు కట్టుకొందువు? కాబట్టి, ప్రియ  స్నేహితుడా, ఇది ఇట్లుండరాదు. అందుకు వారు – ప్రభువైన  యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి (అపొ. 16:31).

Posted in 2020, Telugu Library.