పరిపూర్ణ మార్గము

మానవుడు పరలోకము చేరుటకు నిస్సందేహముగా దేవునిచేత రక్షింపబడవలెను. కాని, ఇది ఏలాగు జరుగును? దానికి ఒక విధానము ఉండెను. దీనికై క్రైస్తవులుగా తమ్మునుతాము ఎంచుకొనినవారు చాల సంవత్సరములనుండి అనేక మార్గములను సూచించిరి. మొదటి శతాబ్దపు క్రైస్తవ విధానమును కలిగియుండవలెనని వారు చాలా విధులను, ఇంకను కార్యములను కూడ చేపట్టిరి. ఆ విధానమును తెలియజేయుటకు వారు సూత్రములను, చేయదగిన మరియు చేయకూడని పనులను సృజించుచు వారి ఆలోచనలను దిద్దుకొనసాగిరి. లేఖనములు వారి సూత్రములకు మూలమని వారు చెప్పినప్పటికీ వాటిలో దేవుని విధానమునకు అంగీకారమైనవి బహు కొద్దిగా ఉండెను. మరియు, దిద్దుబాటులు చేసిన తరువాత వచ్చినవారు తమ బుద్ధిబలమునకు సరిపోవునట్లు వాటికింకను మార్పులు చేసిరి. సంఘము జీవించు విధానమును, దాని విధులను, రూపమును వారు ఇంకను చిందరవందరగా చేసిరి. దీని ఫలితము స్పష్టముగా కనబడుచున్నది, ఏలయనగా రక్షింపబడుటకు అనేక మార్గములు రూపించబడెను. వాస్తవముగా, రక్షింపబడుటకు అనేక మార్గములు ఉండెనా? కచ్చితముగా, దేవుడు తన అనంత జ్ఞానములో తన మార్గములకు, చిత్తమునకు, ఆశకు వ్యతిరేకముగా పనిచేయు మానవుల తత్వమును ఎరిగియుండవలెను గదా. అప్పుడు, ఆయనకొక స్థిరమైన విధానముండవలెను.

మానవులను తనయొద్దకు పిలుచుకొనుటకు దేవునికి పరిపూర్ణ మార్గముండెను. మనుష్యులు అంగీకరింపకపోయినను, అది మాత్రమే మార్గమై యుండెను. అది మారదు లేక ఏ కారణము చేతనైనను ఆయన దానిని మార్చడు. ఏలయనగా మానవులను తనయొద్దకు పిలుచుటకు ఆ మార్గమే విధానముగా నిలుచునని జగత్ పునాది వేయక మునుపే, ఇంకను మనము సృజింపబడిన మట్టి సహితము సృజింపబడక మునుపే ఆయన నిర్ధారణ చేసెను. క్రైస్తవ స్త్రీ, పురుషులు ఆయన రాజ్యమునకు ఆటంకముగా ఉండకుండునట్లు దానిని మొదటిగా ఎరిగి, అర్ధముచేసికొనవలెను. నిత్యపునాదిపై నిలిచియుండు ఆయన రాజ్యముకు ఆటంకముగా నిలుచు దేనినైనను లేక ఎవరినైనను తీసివేయుటకు దేవునికి తన శక్తియందు అనేక మార్గములుండును. ఆయన పరిపూర్ణ మార్గము ఆ పునాది. దాని ద్వారా మానవులను రక్షణ కొరకు పిలుచును. మరియు, విశ్వసించువారికి తండ్రిగా నియమించిన అబ్రాహాముతో దానిని మొదలుపెట్టెను. నీవు నీ దేశమును స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను(అపొ. 7:3).

పరిపూర్ణ మార్గము ద్వారా పిలువబడినవారు మాత్రమే దేవుని రాజ్యములో కొనసాగుదురు. వారు కొనసాగుచు రాజ్యము విస్తరించుటకు కూడ కారణమగుదురు. దేవుడు వారిని ఎన్నుకొనెను గనుక అందుకు వారిని బలపరచును. మిగిలిన మార్గముల ద్వారా ఆయనను ఎరిగిన వారందరు ఆటంకములై యుందురు. వారు రాజ్యములో ఉన్నామని తలంతురు గాని, దేవుడు వారిని తీసివేయును. ప్రజలు నిత్యజీవమును పొందవలసినచో దేవుడు తన పనిని వారియెడల మొదలుపెట్టుటవలననే సాధ్యమగును. వారాయన పిలుపును వినవలెను; వారాయన వాక్యమునుండి వాగ్దానమును పొందవలెను. ప్రజలు ముందుగా ఆయన పిలుపును పొంది సువార్తను ప్రకటించినపుడు, అది మహిమపరచబడును. సంఘము ఈ సూత్రము ద్వారా ఏర్పరచబడనియెడల వారు రక్షింపబడలేదు. అబ్రాము స్థితిని ఆలోచించుము. దేవుని ఎరుగని దినములలో తాను ఎటువంటి క్రియలు చేయుటవలన దేవుడు అతనిని పిలిచెను? ఏమియు లేదు. దేవునిచేత నీతిమంతుడని ఎంచబడుటకు అతడు ఎటువంటి సూత్రములను రూపించెను? ఏమియు లేదు. అయినను అతడు విశ్వసించు వారందరికి తండ్రి అయ్యెను. ఇది ఏలాగు సాధ్యము? దేవుని కనుగొనుట అతనికి ఎట్లు సాధ్యమయ్యెను? అది దేవుని వాక్యమునుబట్టి, అనగా వాక్యముతో ఆయన అతనిని పిలిచెను.

దేవుని వాక్యము తమ మధ్య ఉండుటకుగల కారణమును తప్పుగా ఎంచుటవలననే ఈనాడు అనేకమంది క్రైస్తవులు ఆయన పిలుపును కలిగియుండకపోయిరి. తమతో ఆయన సంభాషించుటకు వాక్యము మూలాధారమని వారు ఎరుగరు. దానిలోనుండి ఆయన వారితో మాటలాడునని నమ్మరు. తన వాక్యమును దేవుడు వారిలో స్థిరపరచినపుడే అది వారిని రక్షించును. దానినుండి వారు తమ కొరకైన ఆయన చిత్తమును పొందినపుడే అది వారిలో జీవించును. దేవుడు వారినుండి కోరుచున్నదానిని వారు తెలిసికొననియెడల వారు దిక్కులేనివారు. పరిశుద్ధ గ్రంథములో ప్రతి విశ్వాసి దేవుని ఎరుగుటకు కారణము ఆయన తన వాక్యమును వారితో మాటలాడుట. అనేక క్రియలు మానవులను దేవుని యొద్దకు చేర్చవు; ఆలాగుననే వారి అనేక సూత్రములు కూడ వారిని ఆయన యొద్దకు చేర్చవు. వారాయన సింహాసనము యొద్దకు, ఆయన రాజ్యములోనికి తమ ప్రయాశతో పోలేరు. విపర్యయముగా, వారు రక్షింపబడునట్లు దేవుడు తన కార్యమును వారియెడల చేయవలెను. ఈ విధముగా వారికి ఏ శిక్షావిధియు కలుగదు. తన విశ్రాంతిలోనికి వారు చేరునట్లు దేవుడు బోధించుట ద్వారా, ఖండించుట ద్వారా మరియు తప్పు దిద్దుట ద్వారా వారిని పోషించును.

ఈ వాక్యమును ఆలోచన చేయుము: అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతివలన ప్రయోజనమేమి? (రోమా. 3:1). దేవుడు అబ్రాహామును పిలిచియుండనియెడల యూదునికి గొప్పతన మేమియులేదు; వాని విశ్వాసమువలనైన నీతికి సున్నతి సూచనగా ఉండకపోవును. కాని, దేవుడు అబ్రాహామును పిలుచుటకు ఇష్టపడెను గనుక యూదుడు ఆయన దేవోక్తులను పొందెను; వాడు ఆయన చిత్తముతోను, వాగ్దానముతోను ఆశీర్వదింపబడెను; వాడాయన కుమారుడయ్యెను. కావున, దేవుడు తన నిబంధన నిమిత్తము అబ్రాహామును మొదలుకొని అనేకులను పిలిచెను. మనుష్యుల క్రియలను విధానములను వెదకుటనుబట్టి ఆయన ఇట్లు చేయలేదు గాని, తన వాక్యముతో చేసెను. వారు రక్షింపబడినట్లు తన వాక్యమును వారి హృదయములలో పెట్టెను. ఈ దినము కూడ దేవుడు అవకాశమును ఏర్పరచుకొని, మానవులు సంతానమునకు చెందిన వాగ్దానమును పొందవలెనని వారిని తనయొద్దకు పిలుచును. వారి హృదయములతో తన వాక్యమును పలుకువాడాయనే. ఇట్లుకానియెడల, మనుష్యుని యొక్క కల్పనాశక్తివలన కృప ప్రత్యక్షము కాకపోవును. కాబట్టి, ఆయన పిలిచిన పిమ్మట నమ్మినవారి ద్వారా సువార్తను ప్రకటించును. వీరిని వినువారిని దేవుడు విశ్వాసము కొరకు పిలువలవలెనని పిలువబడిన విధానము ప్రకారము మాత్రమే వారు ప్రకటించెదరు. మరియు వినినవారు నమ్మినయెడల సంతానమునకు చెందిన వాగ్దానమును, అనగా క్రీస్తును ఆయన వారికి దయచేయును.

కాబట్టి, ఆత్మ చెప్పుచున్నాడు, పునాదిమీద ఒకడు కట్టిన పని నిలిచినయెడల వాడు జీతము పుచ్చుకొనును (1 కొరి. 3:14). ఈ నిరీక్షణతో వారు క్రీస్తును ప్రకటింతురు. దేవుడు వారికి వరముగా ఇచ్చిన సంతానముమీద వారు కట్టుదురు, అనగా మానవులను దేవుని యొద్దకు పిలిచెదరు. అయితే, లేఖనము చెప్పినట్లుగా పనిచేయువారు దేవుని విశ్రాంతిని పోగొట్టుకొనరు గాని, వారిలో అందరి పని క్రీస్తుమీద నిలువదు. ఎందుకనగా, సువార్తను వినువారు అనేకులైనప్పటికీ దేవుడు వారిని వారి విశ్వాసమునుబట్టి తీర్పుతీర్చును. ఏలయనగా సువార్తను వినువారు అబ్రాహామువలె విశ్వాసమునుబట్టి నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన పిలుపును పొందవలెను. ఈ కారణమునుబట్టి, దేవుని వాక్యము రెండంచులగల ఖడ్గముకంటె వాడియైనదిగాను, నమ్మువారందరికి రక్షణ కలుగుటకై సువార్త దేవుని శక్తిగాను ఉండెను.

కాబట్టి, వాక్యమువలన లేక సువార్తవలనైన దేవుని పిలుపు యొక్క ఉద్దేశమేమి? అది ఆయనను పూర్ణముగా నమ్మి, ఆయన పిలుపును వినిన పిమ్మట ఆయనకు సమర్పించుకొను స్త్రీ, పురుషులను ఏర్పరచుకొనుటకై యుండెను. ఇందు నిమిత్తము మనము అబ్రాహామును దేవునినుండి ఉదాహరణగా కలిగియున్నాము. ఆయనవలన నీతిమంతులుగా చేయబడినవారికి ఈ వాక్యము ఎంత యుక్తమైనది! మరియు మీరు నావలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో, అట్టివాటిని చేయుడి; అప్పుడు సమాధాన కర్తయగు దేవుడు మీకు తోడైయుండును (ఫిలి. 4:9). నీవు పొందినవాటిని చేయుట నీచెంత దేవుని నిలుపును; నీవు సమాధానమును పొందెదవు. అది నిరంతరము నిలిచియుండునదే గాని, మనుష్యులనుండి వచ్చునది కాదు. దేవుడు నిరంతరము ఉండువాడు గనుక మరియు నీవు వినినవాటిని, నేర్చుకొనినవాటిని చేయుదువు గనుక అది నీలో నిలుచును. దానిగూర్చి పౌలు ఒకచోట అది సమస్త జ్ఞానమును మించినదని చెప్పెను. ఏలయనగా అది నిన్ను దేవునికి దగ్గరగా చేర్చి ఆయన చిత్తమును, ఆశను వెదకుటకు నీకు ధైర్యము నిచ్చును. జీవితమునకు, దైవభక్తికి సంబంధించిన సమస్త విషయములలో దేవుడు నిన్ను నడిపించునని అది నీకు అభయమిచ్చును. నీవు నీతిమంతునిగా తీర్చబడితివని అది సాక్ష్యమిచ్చును.

దేవుని కార్యమువలన మనలో సమాధానము కలుగునని తెలిసికొనుట ఎంత గొప్ప సంగతి! తనయొద్దకు మనలను ఏ విధముగా పిలుచునో ఆయన చెప్పెను. ఆయన పిలుపుకు అబ్రాహామును ఉదాహరణగా మాత్రమే గాక మానవులను తన మార్గములలో ఏ విధముగా నడిపించునో తెలియజేయుటకు కూడ అతనిని మనకు దయచేసెను. మరియు దీనంతటికీ ఆయన వాక్యము జీవమై యుండెను. ఈ జీవము యేసుక్రీస్తు రూపమున మనయొద్దకు మరియు నమ్మువారందరి యొద్దకు వచ్చెను. కాబట్టి, దేవుడు మనలను రక్షణ కొరకు మాత్రమే గాక మనలోను, మనద్వారా ఆయన నెరవేర్చదలచిన వాటన్నిటి కొరకు పిలిచెను. నిత్యత్వము కొరకు, దేవుని ఉద్దేశము కొరకు, దేవునిచేత అబ్రాహాము ఏ విధముగా పరిపూర్ణునిగా చేయబడెనో మనము విని, చూచి, గ్రహించి, పొందినయెడల పరిపూర్ణ మార్గమునుండి తప్పిపోకుందుము. మనమాయన కుమారులగుటకు దానిని హత్తుకొందుము. ఇందు నిమిత్తము వాక్యము శరీరధారియై మానవుల మధ్య నివసించెను. అబ్రాముకు దేవుడు ఇచ్చిన మార్గమునుండి మనలను తప్పించుటకు క్రీస్తు వచ్చియుండలేదు గాని, దానిలోనికి మరియు సమస్త జనములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాము కిచ్చిన వాగ్దానములోనికి మనలను నడిపించుటకు వచ్చెను. కాబట్టి, ప్రజలను తనయొద్దకు పిలుచుట మొదలుపెట్టెను. ఇట్లుకానిచో, క్రైస్తవుడు అబ్రాహాము కుమారడు ఎట్లగును? అతని కుమారునిగాను, కుమార్తెగాను అగుట అనగా అతనివలె దేవునిచేత నడిపింపబడుటయే గదా. కాని, దేవుడు పిలుచు విధానమును ప్రజలు విడిచిపెట్టుచున్నయెడల వారు రక్షణను పొందకపోవుదురు. దేవుని వాగ్దానముగూర్చి బోధించి దానిని దయచేయు వాక్యముకు వారు అనుకూలముగా నుండరు. ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి. – నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా (హెబ్రీ. 13:5).

ఇది అబ్రాహాము నందును మరియు అతనివంటి విశ్వాసము కలిగిన వారందరి యందును నెరవేర్చబడెను. ఎందుకనగా, వారు దేవుని నమ్మిరి. అబ్రాహాముకు కలిగిన సమస్త కష్టములలో దేవుడు అతని విడిచిపెట్టలేదు. ఇంకను, తనకున్న దానంతటిలోనుండి అతడు పదియవ వంతును దేవునికి సమర్పించెను. అతని దృష్టి ఎల్లప్పుడు దేవునిపై, ఆయన పిలుపుపై మరియు ఆయన దయచేయు దివ్యమైన నడిపింపుపై ఉండెను. సంతుష్టి సహితముగా ఉండుట అనగా దేవుని కలిగియుండి, ఆయన ద్వారా అన్నిటిని పొందుటయే. అంటే, శరీరాశలకు దూరముగా ఉండుట. ఇది కేవలము ఆయన వాక్యమును పొంది, దాని ప్రకారము చేయుచు, ఆయన కొరకు కనిపెట్టుకొని యుండుటవలన సాధ్యమగును. దేవుడు నిన్ను ఎన్నడును విడువడు. దీనిని అబ్రాహము ఆయన పిలుపును నమ్మినందున అతని ద్వారా నిరూపించెను మరియు నీయందు కూడ దానిని నిరూపించుటకు ఆయన ఆశించుచున్నాడు. దేవుడు నిన్ను పిలిచి, తన వాగ్దానమును ఇచ్చినయెడల నీవు దేనియందైనను కొదువు గలిగి యుందువా? నీవే చెప్పుము. ఏలయనగా నీ పక్షమునున్న దేవుడెవరో చూడుము. ఆ గోత్రకర్తలు మత్సరపడి, యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరిగాని, దేవుడతనికి తోడైయుండి అతని శ్రమలన్నిటిలోనుండి తప్పించి(అపొ. 7:9).

దేవుడు నీ పక్షము ఉండవలసినచో నీవు ఆయనపై పూర్ణముగా ఆధారపడవలెను. నీవు ఆయనను జాగ్రత్తగా విని, ఆయన మాట ప్రకారము జీవించవలెను. ఆయన పిలుపు దేనికైనను నీ పూర్ణ హృదయముతో దానిని నీవు హత్తుకొనవలెను. నీవు నిర్లక్ష్యము చేసినచో ఆయన విలువైన ఆశీర్వాదములను పోగొట్టుకొందువు. ఆయన పరిచర్యను నెరవేర్చుటకు నీయెడల తన చిత్తమేమైనను నీవు విధేయత చూపవలెను. అప్పుడు, నీ దుఃఖము సంతోషమై దేవుని ఫలకరముగా మహిమపరచుటకు కారణమగును. దేవుడు నీతో ఉండును గనుక ఏ పరిస్థితియైనను, కల్పనాశక్తియైనను నిన్ను జయించదు. ఆయనే నీయందు గొప్ప కార్యములు చేయుటకు అవకాశమును ఏర్పరచుకొనెను. నీవు భయపడ నవసరములేదు. కాని, దేవుడు నీనుండి ఆశించు సమాధానమును గ్రహించుము. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పినవాని చూచి – నా తల్లి యెవరు? నా సహోదరు లెవరు? అనెను (మత్త. 12:48).

Posted in Telugu Library.