విశ్వాసము కొరకు పిలువబడినవారు

పాతనిబంధన కాలములో ప్రభువైన దేవుని స్వరము ప్రజలకు తరచుగా వినబడెను. ఒక్క కారణముబట్టి మాత్రమే ప్రభువు వారితో మాటలాడెను. అది ఆయన నామ ఘనతకై యుండెను. ఆయన స్వరముకు ప్రత్యేకత ఉండెను మరియు జనులు దానిని భూమ్యాకాశములకు దేవుడైనవాని స్వరముగా గ్రహించిరి. ఏలయనగా అది వినువారిలో భయమును, నిశ్చయతను, ఆశీర్వాదములను, నిరీక్షణను కలుగజేసెను. అనేకమార్లు ఆయనను నమ్మనివారిపై, ఆయనకు భయపడనివారిపై అది శిక్షావిధియును ప్రకటించెను. దానిలో వాక్యముండెను గనుక జనులు దాని ఉద్దేశమును గ్రహించిరి. ఆయన స్వరము ఆయన చిత్తమును ఉద్దేశము యొక్క ప్రతి విధానమును వివరించెను. తన అధికారమును, జ్ఞానమును స్థాపించుచు దేవుడు తన్నుతాను ప్రజలకు దాని ద్వారా ప్రత్యక్షపరచుకొనెను. ఆయన స్వరము ఆదినుండి నిలిచియున్న వాక్యముకు చెందినదై యుండి ఆయన ఆశను నెరవేర్చెను. ఆ దినములు మొదలుకొని ప్రభువైన దేవుడు తన స్వరమును వినిపించుట మానలేదు. ఆయన మాటలాడినపుడు అది స్పర్శగోచరమై యుండును. కాబట్టి, ప్రవక్త ఈలాగు చెప్పెను. దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయట ఆవరణమువరకు వినబడెను(యెహె. 10:5).

ప్రభువైన దేవుడు తన స్వరమును వినిపించు విధానములో ప్రత్యేకత ఉన్నది. అది ధైర్యముతోను బహు స్పష్టతతోను ఉండును. అది నిజముగా దేవుని స్వరమని జనులను ఒప్పించుటకు శక్తితో ఉండును. ఈ కారణమునుబట్టి దేవుని వాక్యము సజీవమై బలముగలదై యుండెనని చెప్పునట్లు పరిశుద్ధాత్ముడు హెబ్రీ పత్రిక గ్రంధకర్తను నడిపించెను. ఇది వాక్యము తత్వము కానియెడల అది వినబడదు, మన ఆత్మను ప్రాణమును చొచ్చుకొని పోలేదు. మాటలాడు దేవునిబట్టి వాక్యము మన ప్రతి ఆలోచనను, ఉద్దేశమును తీర్పుతీర్చును. వాక్యమువలన జరుగు ఇట్టి కార్యమును వ్యతిరేకించువారు ఉండిరి. వారిని నమ్మకుము. వారు వాక్యమునుండి పొందునంతగా దేవుని నమ్మియుండలేదు. ప్రభువైన దేవుడు మాటలాడునని కూడ వారు నమ్మరు. వారు శరీరమందు సంపాదించిన జ్ఞానముతో వాక్యమును చూచి, చదివి, అర్ధముచేసికొందురు. విశ్వసించువారిలో నివసించు దేవుని ఆత్మ వారిలో ఉండడు గనుక వారు దానిలోనుండి వినరు. మనలో నివసించు ఆత్మయే వాక్యములోనుండి వినునట్లు మనలను నడిపించును.

యెహెజ్కేలు దినములలో అనేకులు ఉండిరి గాని, అతను మరియు అతని సమకాలికులైనవారు మాత్రమే దేవుని స్వరమును వినిరి. ఆలాగుననే యేసు శిష్యుల కాలములో మరియు వారి తరువాత వచ్చినవారి కాలములో కూడ ఉండెను. దేవుడు అందరితో మాటలాడడు గాని, విశ్వాసము కొరకు పిలువబడినవారితోనే మాటలాడును. వాక్యములోనుండి వచ్చు ఆయన స్వరము మాత్రమే మనకు జీవమును, ధైర్యమును, సమాధానమును, సంతోషమును ఇచ్చును. అది ఆయన చిత్తమును మనకు దయచేయును. మనము దానిని గ్రహించెదము, ఎందుకనగా అది మనలను బంధించి ఆయనకు భయపడువారిగా చేయును. ఈ భయమే ఆయన స్వరమును గూర్చిన కచ్చితమైన సూచన. అది మనలో ఆయన కలుగజేయదలచిన ఆశీర్వాదములకు నడిపించును. కాబట్టి, మనము ఎల్లప్పుడు నిత్యజీవము కొరకు నిరీక్షణతో ఉందుము. యాజకులు, లేవీయులుచేత ప్రశ్నించబడినపుడు బాప్తిస్మమిచ్చు యోహాను పలికిన సమాధానమును చూడుము. అతడు ఎరుగననక ఒప్పుకొనెను; – క్రీస్తును కానని ఒప్పుకొనెను (యోహా. 1:20).

దేవుని స్వరములో ఉన్న ప్రత్యేకతవలన తాను క్రీస్తును కానని అతడు బలముగా ఒప్పుకొనెను. ఈ దేవుడు శరీరములో వచ్చెను. మరియు, యేసు తాను మంచి కాపరినని చెప్పెను; తన గొర్రెలు తన మాట వినునని చెప్పెను; తానే వారికి ద్వారమును తెరచుచు, మూసివేయునని చెప్పెను. తన స్వరము నాలకించు గొర్రెలనుగూర్చి యేసు ఇంకను చాలా సంగతులు చెప్పెను. తాను వెళ్లిపోయిన తరువాత తనను వెదకు గొర్రెలనుగూర్చి కూడ ఆయన మాటలడెను. క్రీస్తుకు ముందుగా వచ్చినవాడనని, అనగా దేవునికి తన పట్లనున్న ఉద్దేశమును ఎరిగిన యోహాను క్రీస్తునని చెప్పుకొనలేదు. దేవుడు ఎన్నుకొనిన ప్రజలు తమ్మునుతాము మహోన్నతుని సేవకులుగా తలంచు తత్వమును కలిగినవారు. ఎందుకనగా, వారాయన స్వరమును పొంది, దానికి విధేయత చూపెదరు; వారిలో తిరుగుబాటుతనము ఉండదు. దేవుడు వారియెడల కలిగియున్న ఆశను వారు కచ్చితముగా ఎరిగియుండి, వారియెడల ఆయన ఎన్నికనుబట్టి సంతోషింతురు. కాని, ఆయన స్వరమును ఎరుగనివారు అట్టివారు కారు. వారినిగూర్చి అపొస్తలులు పరిశుద్ధాత్ముడు ద్వారా ఈలాగు చెప్పిరి. కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమధికారమిచ్చి యుండలేదు (అపొ. 15:24).

ఆత్మ ద్వారా దేవునిచేత పరిశుద్ధపరచబడిన విశ్వాసులుగా మన మధ్యనున్న లేఖనము యొక్క ప్రాముఖ్యతను గ్రహించుట ఆవశ్యకము. తమ్మునుతాము క్రైస్తవులుగా పిలుచుకొనువారు అనేకులుండిరి. వారు మనవిచేయు దేవుని వాక్యము యొక్క సంపూర్ణ జ్ఞానము లేనివారు. దేవునికి ఇష్టములేని మనస్సుతో వారు మాటలాడుదురు. విశ్వసించి, విశ్వాసము నుండి విశ్వాసముకు వెళ్లువారు దీనిని క్రమేణ పోగొట్టుకొందురు. కాని, మిగిలినవారు శరీరము నుండి శరీరమునకు ఎదుగుచు దేవునికి బహు ఇష్టమైన దానిని, అనగా ఆయన స్వరము నాలికించుటను విడిచిపెట్టుదురు. అట్టివారిని వినుట మన ప్రాణమును కలవరపరచుచు దేవుని ఇష్టముకు వ్యతిరేకముగా ఆలోచించుమని బలవంతము చేయును. అపొస్తలులు చెప్పినవారినిగూర్చి ఆలోచించుము. వారు దేవుని వాక్యమునుండైనను, అపొస్తలుల నుండైనను పొందలేదు గాని, వారి ఆలోచనలు దేవుని సంబంధమైనవిగా చేసికొని మాటలాడిరి. గొప్ప అలజడిని సృష్టించిరి. విపర్యయముగా, అబద్ధపు వాదనలనుండి విశ్వసించుచున్నవారిని కాపాడుటకు అపొస్తలులు దేవునినుండి పొందిరి. ఇది వారియందు నివసించుచున్న పరిశుద్ధాత్ముడువలన సంభవించెను.

క్రైస్తవులలోనే క్రైస్తవ్యమునుగూర్చి నానావిధములైన ఉద్దేశము లుండెను. మరియు, వాటిలో ఒక్కటి తప్ప అన్నియు దేవుని ఇష్టమందున్నవి కావు. ఏలయనగా అబ్రామును దేవుడు పిలిచినపుడు అది వాక్యముబట్టి కలిగిన ఆయన స్వరమై యుండెను; అబ్రాము దానిని నిర్లక్ష్యము చేయకపోయెను. ఈ స్వరమే మనకు సంబంధించిన సమస్తమును ఏర్పరచును. మనము విశ్వసించిన క్రీస్తునందు దేవుని ఆసక్తితో వెదకినపుడు ఆయన మనలను విడిచిపెట్టడు. మంచి కాపరి యొక్క పనిని ఆయన సంపూర్ణము చేయును. తన స్వరము యొద్దకు నడిపించునట్లు మనయందున్న క్రీస్తు ఆత్మను ఆయన ప్రేరేపించును. ఇది మనకు అలవాటుగా నుండినపుడు శరీరముతో ఆలోచన చేయుట నిరాకరించెదము. మనమెన్నడును దేవుని నడిపింపును పోగొట్టుకొనము. ఈ విధమైన దేవుని పనిని నిరాకరించువారినిబట్టి సొమ్మసిల్లకుము. కాని, అపొస్తలుని మాటలను వినుము. అవి బలము నిచ్చును. మా సువార్త మరుగుచేయబడినయెడల నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడియున్నది (2 కొరి. 4:3).

వారు నిరాకరింతురు, ఎందుకనగా అవిశ్వాసముతో వారు కప్పబడియున్నారు. కఠినత్వములోనుండి బయటపడుటకు ఇష్టపడువారికొరకే సువార్త నిలిచియుండెను. అంగీకరించు హృదయము గలవారికి అది శుభవార్త. అది బోధించుచు, మనవిచేయుచు దేవునితో అన్యోన్యతను నిశ్చయపరచును. “మా సువార్త” అనుటలో పౌలు ఉద్దేశమేమి? అనగా దేవుని ఇష్టమందున్న సువార్త అని అర్ధము మరియు ఈ సువార్తనే నీవు ఇప్పుడు వినుచున్నావు. నీవు దానిని హత్తుకొనినపుడు దాని ప్రకారము జీవించి, పనిచేయుదువు; నీకునీవే దేవునితో అన్యోన్యముగా ఉండుట గమనించెదవు. ఇందునుబట్టిమనుష్యుల అవసరమును కోరనివానివై, దేవుడు తన మార్గములలో దయచేయు సువార్తను పొందితివి. మరల, సువార్త నశించుచున్నవారి విషయములోనే మరుగుచేయబడి యున్నదనుటలో అతని ఉద్దేశమేమి? అంటే “మా సువార్త”ను నిరాకరించువారు ఎల్లప్పుడు ఉందురు అని అర్ధము. అట్టివారిని దేవుడు ముందుగానే ఎరిగియున్నాడు. దీనినే ఆయన భవిష్యద్ జ్ఞానముగా చెప్పబడెను. కావున, యేసు ఇరుకు ద్వారమును వెదకి దానిలోనుండి ప్రవేశించుమని మనుష్యులకు స్పష్టముగా చెప్పెను. ఏలయనగా మనుష్యుల ఆలోచనకు విపరీతమైనది దేవుని ఎన్నికై యుండెను. మరియు పరిశుద్ధాత్మ యిట్లు చెప్పుచున్నాడు – నేడు మీరాయన శబ్దమును వినినయెడల (హెబ్రీ. 3:7) విశ్వసించుము.

అనేకమంది క్రైస్తవులు అంగీకరించుటకు కష్టముగాను, ఇంకను అసాధ్యముగాను నున్న సువార్తను నీవు ఎన్నుకొనినయెడల ఆయన శబ్దమును (స్వరమును) విందువు. మనుష్యులు కోరుకొను చోట్లలో దేవుడు దొరకడు. వారు అనుకూలముగా ఎంచిన సమయమున ఆయన దొరకడు. కాని, ఆయన మాటలాడినపుడే దొరకును. నీవాయన సువార్తను ఎన్నుకొని, ఆయన కొరకు నీ హృదయమును అనుకూలముగా చేసికొనినపుడే ఆయన మాటలాడును. ఆయనను నిరాకరించలేవు. నీవు విశ్వాసము ద్వారా కృపవలన రక్షింపబడినపుడు దానివలననే ఆయనను విందువు. సువార్త ద్వారా నీవు అనుకూలమైన హృదయమును కలిగియుండగా ఆయనను వెదకుము, మరియు ఆయన స్వరమును విందువు. నీవాయనను ప్రతి సమయమున వెదకినచో ఆయనను కనుగొందువు. ఈ సంగతులన్నియు మీరు ముందటనే యెరిగియున్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్న దేమనగా, ప్రభువు ఐగుప్తులోనుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయినవారిని తరువాత నాశనము చేసెను(యూదా. 1:5).

ఏలయనగా నీవు వినుచున్న సువార్తను పొందనివారు సంఘములలో అనేకులు ఉండిరి. ఇందుకు కారణము వారిలోనికి రహస్యముగా జొరబడినవారే. వీరు పాపములో ఉండి వారిని దేవుడు ఉద్దేశించని మార్గములలో నడిపించుచున్నారు. దేవుని ఇష్టమందున్న సువార్త నీయొద్ద ఉండెను గనుక నీకు అన్ని సంగతులు తెలియును. మరియు నీవు దేవుని స్వరముచేత శక్తిమంతునిగా చేయబడితివి గనుక వారి దుష్ట ఉద్దేశములనుండి, జ్ఞానమునుండి కాపాడబడితివి. నీవు వారిని రక్షిపబడినవారిగా ఎంచవు. వాక్యములోనుండి ఆయన స్వరమును వినునట్లు నడిపించు సువార్త లేనపుడు వారు తరువాత నాశనము చేయబడినవారిని పోలియుందురు. వారు నమ్మికలేనివారని నీకు తెలియును మరియు వారిని వినువారు కూడ వారివలె ఉందురని నీకు తెలియును. యేసు పలికిన ఈ జ్ఞానము నీలో ఉండెను – శాస్త్రులనుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగగోరుచు సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు (లూకా. 20:45,46). కాబట్టి, దేవుని స్వరమును వినుట నీవు అలవాటుగా చేసికొనిన పిమ్మట అనేకులను కాపాడుట నీ ఉద్దేశముగా చేసికొనుము. ఇందుకు సరైన సమయముకై ఆయనను కోరుము మరియు ఆయన నీకు అవకాశమును కలుగజేయును.

Posted in Telugu Library.