క్రైస్తవులుగా అనేకమంది అన్యులను అనగా క్రీస్తునెరుగని  వారిని మన సహవాసములో చేర్చుకొనుటకు అనగా నిత్యజీవము నిచ్చు క్రీస్తు సహవాసము నందించుటకు మనము ప్రయత్నించుదుము. ఇతరులకు సువార్త ప్రకటించుట, క్రీస్తుని గూర్చి తెలియజేయుటలోని మన ఉద్దేశ్యము అదే అయినప్పటికీ అనేకసార్లు మనము దానిలో విఫలమగుచున్నాము. తరచుగా మన ప్రయత్నములు నిష్ఫలమగుచున్నవి. కారణము మనము అపొస్తలుల బోధను బోధించుచున్నాము కాని వారిలో ఉన్నది మనలో కొరవడిపోయినది. మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము” (1 యోహా. 1:3).

నిత్యజీవమును గూర్చి మొదట నుండి వారు విన్నది, నిదానించి కనుగొన్నది, వారి అంతర్నేత్రముతో సృశించి తెలుసుకొన్నదాని గురించే అపొస్తలులు ప్రకటించిరి. ఒక్క మాటలో చెప్పవలెనంటే నిత్యజీవమును గూర్చిన ఆనందమును వారు హృదయములో అనుభవించి దాని గురించే సాక్ష్యమిచ్చిరి. అదే వారిపట్ల తిరుగులేని శక్తివంతమైన సువార్తగా మారెను!

మనమయితే క్రీస్తు ప్రభువుతో సహవాసము చేయకుండానే, ఆయన ప్రేమ యొక్క ఆనందమును మనము రుచి చూడకుండానే ఆ సహవాసము గురించి ఇతరులకు చెప్ప ప్రయత్నించుచున్నాము. అందుచేతనే మన పనిలో మంచి ఫలములు చూడలేకపోవుచున్నాము. మంచి చెట్టు మంచి ఫలములనే ఫలించును.

క్రీస్తునందున్న సత్యము గాని, ప్రేమయే గాని, సమాధానమే గాని, సాత్వికమే గాని ఏ శ్రేష్ఠమైన వరమయినప్పటికీ మనము అనుభవపూర్వకముగా తెలుసుకొనవలెను. అప్పుడే వాటిలో ఇతరులకు పాలిభాగము నివ్వగలము (ఫిలొ. 1:6). దేవునియందు మనకున్న విశ్వాసమును బట్టి ఆయన శక్తి యొక్క మహత్యము మనలో కనబడవలెను. అంటే – బెదురులేక దేవుని నీతి కొరకు నిలబడగల సామర్ధ్యమును మనుషులు మనలో చూడవలెను. దేవునిని తెలిసికొనుటలో అలాంటి ప్రత్యక్షతగల మనస్సు మనము పొందవలెను (ఎఫె. 1:19). దేవుని జ్ఞానము మనలో ఉన్నదని మనమనుకొన్నట్లయితే లోకజ్ఞానము విషయములో అనగా ప్రతివిధమైన కుయుక్తి విషయములో మనము వెఱ్ఱివాళ్ళము కావలెను. వాటిని పూర్తిగా మర్చిపోవలెను. అప్పుడే మనలను పరిశీలించు లోకము మన సహవాసము పొందుటకు ఇష్టపడును. బట్టలిచ్చి, డబ్బులిచ్చి మనము వారిని పోగుచేయవలసిన అవసరము లేకపోవును!

రోమీయులు అపొ. పౌలును, సీలను సువార్త ప్రకటించినందుకు దెబ్బలు కొట్టి చెరసాలలో వేసిరి. వారిద్దరూ చెరసాలలో ఉండి కూడ కీర్తనలు పాడుచు దేవునికి చేసిన ప్రార్ధనల వల్ల పెద్ద భూకంపము వచ్చి చెరసాల తలుపులు తెరచుకొనెను. ఖైదీల బంధకములు గూడ ఊడిపోయెను. చెరసాల నాయకుడు పౌలు, శీల తప్పించుకొని పోయిరని తలంచి, భయముతో తనను తాను కత్తితో పొడుచుకొనబోయెను. లోకములో సాధారణముగా మనుషులు చేయునట్లే వారు కూడ చేసి ఉందురని అతడనుకొనెను. గాని వారు అక్కడే ఉంది తామేమిటో ప్రత్యక్షపరచుకొనిరి. తమ దేవుడు నమ్మకమైన వాడని, ఆ దేవుని పోలికను వారు కూడ పొందియున్నామని రుజువు చేసికొనిరి!

తన ఉద్యోగ నిర్వహణలో చెరసాల నాయకుడు కొన్నివందల, వేలమందిని చూసి యుండవచ్చును. కాని ఇలాంటి నీతిని అతడెవరిలోను చూడలేదు. వారి నీతికి, యధార్ధతకు అతడి హృదయము కరిగిపోగా వణుకుచు తనకు తానుగా వారి కాళ్ళమీద పడి రక్షణ మార్గమును గూర్చి వారి యొద్ద తెలుసుకొనెను! (అపొ. 16:22-30). మన డబ్బును, హోదాని బట్టి కాదు, మన కులము, చదువు, జ్ఞానమును బట్టి కాదు. మనలోనున్న భక్తికి ఎవరైనా మోకరిల్లిన సందర్భము మన జీవితములో జరిగెనా? ఇతరులతో మన సహవాసము అలాంటిదై యున్నదా?

మనము దేవుని చిత్తమును చేయనిశ్చయించుకొన్నపుడే ఆయన మాటలలోని అంతరార్ధమును తెలిసికొనగలము. మనుషులు మన సహవాసము కోరుకొనులాగున మనము దేవునితో సహవాసము కలిగినవారమగుదుము (యోహా. 7:17).

నేనెవరినని మనుషులు చెప్పుకొనుచున్నారని ఏసుప్రభువు తన శిష్యులనడిగెను. వారందరిలో పేతురు మాత్రమే – నీవు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పగలిగెను. అందుకు ప్రభువతనిని ప్రశంసించి – క్రీస్తు ప్రభువు సంఘమును స్థాపించగల ఆధిక్యతను అతనికిచ్చెను. ఆ ఆధిక్యత అతనిలో అతిశయమును పెంచెనేమో: అటు తరువాత ప్రభువు – తాను హింసలు పొంది, చంపబడి, మూడవ దినమున లేచెదనని చెప్పినపుడు ఆ త్యాగములోని ఆంతర్యమును అతడు గ్రహించలేక అది నీకు దూరమగును గాక అని గద్దింపసాగెను. అతడు దేవుని సంగతులను తలంచలేకపోవుట ప్రభువుకు అభ్యంతరకారణమయ్యెను (మత్త. 16:13-23). అయితే మనమెన్ని విషయాలలో దేవునికి అభ్యంతరముగా ప్రవర్తించుచున్నాము? మన అతిశయము, మోసము, ద్వేషము, అబద్ధము దేవునినెంత ఆయాసపెట్టుచున్నవి? అందువల్ల ఎంతమందిని దేవుని సహవాసముకు చేరనీకుండ ఆటంకముగా ఉన్నామో మనము గ్రహించుకొందము.

సహోదరీ, క్రైస్తవులమని పేరు పెట్టుకొని ఏదో విధముగా జీవించినా రాబోవు కాలములో దేవునితో సహవాసము పొందుదుమని భ్రమపడుచున్నావేమో, ఒకప్పుడు దేవుని ప్రజలు కూడ – అబ్రాహాము ఒంటరియై ఈ దేశమును స్వాస్థ్యముగా పొందెను. అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని తలంచిరి. కాని వారి హృదయాల పరిస్థితినంతా ఎరిగిన దేవుడు – విగ్రహముల నారాధించుచు, నరహత్యలు చేయును, హేయక్రియలు చేయుచుండు మీవంటివారు దేశమును స్వతంత్రించు కొందురా? అని ప్రశ్నించుచున్నాడు (యెహె. 33:24-25). ఆ ప్రశ్నకు జవాబును గ్రహించగలిగితే మనము జాగ్రత్తపడుదుము. మన సహవాసము ద్వారా ఇతరులనేకమందికి మేలు చేయువారమగుదుము.

Posted in Uncategorized.